రాజ్యసభలో ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి సూచన
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: సాంప్రదాయ పద్దతుల్లో సాగుతున్న పోస్టల్ సర్వీసులను డిజటలైజ్ చేయడం ద్వారా ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు విస్తృత రీతిలో సేవలు అందించవచ్చని వైఎస్సార్సిపి సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. మనీ ఆర్డర్లకు బదులుగా మొబైల్ పేమేంట్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. చిన్న మొత్తాల పొదుపు కార్యకలాపాలను పేమేంట్స్ బ్యాంక్‌కు బదలాయించాలని కోరారు.
పోస్ట్ ఆఫీసు బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని పోస్టాఫీసులను కంప్యూటరైజ్ చేసి పోస్టల్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ట్రైన్ టిక్కెట్ల రిజర్వేషన్, ఆధార్ నమోదు, అప్‌డేట్ సేవలను పోస్టాఫీసుల్లో అందుబాటులోకి తెచ్చేలా సెంట్రలైజ్డ్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని పేర్కొన్నారు. గడచిన కొన్ని దశాబ్దాల్లో పోస్టల్ విభాగం నష్టాలు తొమ్మిది రెట్లు పెరిగాయి. పట్టణ ప్రాంతాల్లో పోస్టల్ సేవలకు ప్రత్యామ్నాయంగా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని బలహీన వర్గాలకు మాత్రం పోస్టల్ సేవల అవసరం చాలా ఉందని ఆయన అన్నారు.
పోస్టల్ సేవల విషయంలో పేదల కోసం ఉద్దేశించిన సబ్సిడీలు సంపన్న వర్గాలు అనుభవించకుండా నిరోధించేందుకు పోస్టల్ రేట్లను హేతుబద్దం చేయాలని విజయసాయి రెడ్డి సూచించారు. అలా చేయాలంటే ధరలను పునఃవ్యవస్థీకరించాలి. అన్ని ప్రాంతాలకు ఒకే తరహా చార్జీలు, ధరలకు బదులుగా గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లోని పోస్టాఫీసులకు మాత్రమే సబ్సిడీని పరిమితం చేసేలా విభిన్న ధరల విధానాన్ని అందుబాటులోకి తీసుకురావలని ఆయన అన్నారు.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు ఈ దిశగా ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం. దీని ద్వారా సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడానికి పోస్టల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చి వారు గ్రామీణ ప్రాంతాల్లో ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, స్మాల్ సేవింగ్స్ వంటివి విక్రయించేలా కృషి చేయాలని అన్నారు. అలాగే పోస్టాఫీసులను ఎలక్ట్రానికి నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ (ఈ-నామ్)లో అనుసంధానించడం ద్వారా అవి రైతులకు నేరుగా ఉపయోగపడేలా కృషి చేయవచ్చని విజయసాయి రెడ్డి అన్నారు.