Suryaa.co.in

Andhra Pradesh

తెలుగు ప్రజలకు 2019 తర్వాత అత్యంత ఆనందదాయకం కానున్న 2024!

(రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి)

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు సంవత్సరాల ఏడు నెలలుగా అధికారంలో ఉంటూ దాదాపు ఐదున్నర కోట్ల ప్రజానీకానికి సమర్ధ పాలన అందిస్తున్న రాజకీయపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రాంతీయ పార్టీకి 2024 ఎన్నటికీ మరవలేని ఆనందదాయక సంవత్సరంగా నిలిచిపోతుంది. 2024 మే 30న వైఎస్సార్సీపీ జనరంజక పరిపాలనకు ఐదేళ్లు నిండుతాయి.

అంతేకాదు, వచ్చే ఏప్రిల్‌–మే మధ్యకాలంలో లోక్‌సభ 18వ ఎన్నికలతోపాటు జరిగే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ 16వ ఎలక్షన్లలో ఏపీ పాలకపక్షం మరోసారి చరిత్రాత్మక విజయం సాధించి తెలుగవారికి మరింత ఉజ్వల భవిష్యత్తు అందించడానికి రంగం సిద్ధమైంది. గడచిన 55 మాసాలుగా ఏపీ ప్రజలకు మున్నెన్నడూ కనీవినీ ఎరగని సంక్షేమ పాలన అందించడం, బడుగు, బలహీనవర్గాలను రాజకీయంగా చైతన్యపరచడం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సాధించిన గొప్ప విజయాలు. వచ్చే ఏడాది మార్చి 12న ఈ యువ రాజకీయపక్షానికి 13 సంవత్సరాలు నిండుతాయి.

ఆ తర్వాత రెండు నెలల్లో జరిగే శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అద్వితీయ విజయం సాధించి రెండోసారి మే నెలలో అధికారం చేపట్టడం ఈ పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, నాయకులకేగాక తెలుగు ప్రజలందరికీ గొప్ప పండగ కాబోతోంది. తప్పనిసరి రాజకీయ పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011 మార్చి 12న అవతరించిన వైఎస్సార్సీపీ ఏడాది గడచిన వెంటనే 2012 జూన్‌ మాసంలో తొలి రాజకీయ పరీక్షను ఎదుర్కొని విజయవంతంగా నెగ్గింది.

ఒక లోక్‌సభ, 18 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో నాటి పాలకపక్షమైన కాంగ్రెస్, ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఓడించి నిర్ణయాత్మత విజయం సాధించడం తెలుగు ప్రజలు ఎన్నడూ మరచిపోలేని గొప్ప పరిణామం. ఒక పార్లమెంటు, 15 అసెంబ్లీ స్థానాలను ఈ ఉప ఎన్నికల్లో కైవసం చేసుకుని తెలుగునాట ఒక కొత్త రాజకీయ అధ్యాయానికి వైఎస్సార్సీపీ శ్రీకారం చుట్టడం ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర గతిని కొత్త మలుపు తిప్పింది.

తొలి ప్రయత్నంలో మెజారిటీ దక్కకపోయినా తర్వాత ఎన్నికల్లో బ్రహ్మాండమైన తీర్పు
స్థాపించిన తొమ్మిది నెలలకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం కైవసం చేసుకుని గినీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లో స్థానం సంపాదించుకున్న పార్టీ ఎన్‌.టి.రామారావు గారు ప్రారంభించిన తెలుగుదేశం అని చెబుతారు. నిజమే అప్పటి పాలకపక్షం కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టే పెద్ద రాజకీయపక్షం ఏదీ 1982 నాటికి లేదు. ఐదేళ్ల కాలంలో (1978–83) నలుగురు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు మారిపోయారు.

రాష్ట్ర అవసరణ జరిగిన పాతికేళ్లకైనా రాజకీయ ప్రత్యామ్నాయం కావాలని తెలుగు ప్రజానీకం తహతహలాడుతున్న సందర్భం అది. ఎలాంటి పూర్వ రాజకీయ అనుభవం లేని నందమూరి తారక రామారావు గారు 1983 జనవరి ఎన్నికల్లో తన పార్టీని విజయపథంలో నడిపించారు. ఏనాడూ శాసనసభలో అడుగుపెట్టిన అనుభవం లేకుండానే హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జనవరి 9న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే, 2011–14 మధ్య కాలంలో ఏపీలోని పాలక, ప్రతిపక్షాలు ఏకమై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేతను, పార్టీ నాయకులు, కార్యకర్తలను నానా ఇబ్బంబదులు పెట్టాయి.

దీనికి తోడు 2014 ఫిబ్రవరి–మార్చిలో దాదాపు పూర్తయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కొత్తగా అనూహ్యమైన, కాస్త అననుకూలమైన రాజకీయ పరిస్థితులను తీసుకొచ్చింది. 2014 సాధారణ ఎన్నికల్లో ఈ యువ ప్రాంతీయపక్షం అధికారాన్ని కేవలం కొద్ది సీట్ల తేడా వల్ల కైవసం చేసుకోలేకపోయింది. తీవ్ర రాజకీయ సంక్షోభం నుంచి పుష్కర కాలం క్రితం పుట్టిన వైఎస్సార్సీపీ తొలి పరాజయంతో కుంగిపోలేదు.

నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సాగిన అడ్డగోలు, దుర్మార్గ పరిపాలనను జగన్‌ గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, ప్రజలు విజయవంతంగా ప్రతిఘటించారు. వారి పోరాటం, కృషి ఫలితంగా కిందటి ఎన్నికల్లో 22 పార్లమెంటు, 151 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది. తెలుగునాట సుపరిపాలనకు 2024 మే 30న శ్రీకారం చుట్టింది వైఎస్సార్‌ కాంగ్రెస్‌.

ఈ నేపథ్యంలో 2024 ఏపీ పాలకపక్షానికి, తెలుగు ప్రజలకు అత్యంత కీలకమైన సంవత్సరం. ప్రస్తుతం పార్లమెంటు ఉభయసభల్లో మొత్తం 31 సభ్యులతో జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రాజకీయపక్షం వచ్చే ఏడాది తిరుగులేని రాజకీయ విజయాలు సాధించి తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమౌతుంది.

LEAVE A RESPONSE