– కేంద్రం నుంచి రావాల్సిన రూ. 16 కోట్ల సబ్సిడి ఇప్పించాలని విన్నపం
టిఎస్ రెడ్కో లో ప్రాజెక్టు డైరెక్టర్ గా పని చేస్తున్న ప్రాజెక్టు డైరెక్టర్ అమరేందర్‌రెడ్డి బదిలీని నిలిపివేయాలని ఆల్ ఇండియా రెన్యుబుల్ ఎనర్జీ ఎంటర్ ప్రిన్యూర్స్ ఆసోసియేషన్ ప్రతినిధులు బుదరవారం రాత్రి రాష్ట్ర సచివాలయంలో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క మల్లును కలిసి వినతి పత్రం అందజేశారు. ఆకస్మాత్తుగా ప్రాజెక్టు డైరెక్టర్ అమరేందర్ రెడ్డిని బదిలీ చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.16 కోట్ల సబ్సిడి నిధులు జాప్యం అవుతుందని విన్నవించారు.
రెడ్కో నుంచి కేంద్ర ప్రభుత్వంతో సబ్సిడి నిధులను రాబట్టడానికి సమన్వయం చేస్తున్న అమరేందర్ రెడ్డి బదిలీ వల్ల తమకు ఇబ్బందులు కల్గుతాయని వివరించారు. ప్రభుత్వ భవనాలపై రూప్‌టాప్ సోలార్ వివిధ దశల్లో జరుగుతున్న పనులను సమన్వయం చేస్తూ వివిధ శాఖల నుంచి తమకు రావాల్సిన నిధులను సైతం అమరేందర్ రెడ్డి సమన్వయం చేయడంతో పాటు నిర్వహణ, పర్యవేక్షన బాధ్యతలు చూస్తున్న ప్రాజెక్టు డైరెక్టర్ బదిలీ కావడం వల్ల ఆపనులు అర్ధాంతరంగా ఆగిపోతాయన్నారు. టి.ఎస్ రెడ్కోలో సోలార్ రూప్ టాప్ పనులు, కేంద్రం నుంచి రావాల్సిన సబ్సిడి నిధులను తీసుకువచ్చే విషయ పరిజ్ఙానం, అనుభవం కలిగిన అధికారిని బదిలీ చేయడం వల్ల తమ పనులు కుంటుపడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అదే విధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూర్య ఘర్ యోజన పథకం, పీఎం కుసుమ్ అమలులో సైతం జాప్యం కలిగే అవకాశం ఉన్నందున కనీసం మూడు నెలలైన బదిలీని నిలిపివేయాలని కోరారు. ఎం ఎన్ ఆర్ ఈ లో గత రెండు సంవత్సరాల నుంచి నిలిచిపోయిన రూ.16 కోట్ల సబ్సిడి నిధులు త్వరగా ఇప్పించాలని మంత్రిని కోరారు. ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా సోలార్ విద్యుత్తు వాడకం గురించి ప్రజలకు తమ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహాన కల్పిస్తామని చెప్పారు.
డిప్యూటి సీఎం ను కలిసిన వారిలో ఆసోసియేషన్ జనరల్ సెక్రటరీ చారుగుండ్ల భవాణి సురేష్, వైస్ ప్రెసిడెంట్ ఇంద్రసేన రెడ్డి, జాయింట్ సెక్రటరీ శ్రీనాథ్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు మోరంపూడి ప్రసాద్, సత్య, శ్రీకాంత్, ఆశోక్, గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.