Suryaa.co.in

Telangana

అశ్రునయనాల నడుమ ఎమ్మెల్యే లాస్యనందిత అంతిమయాత్ర

-పాడె మోసిన హరీష్‌రావు
-అన్నీ తానై చూసిన తలసాని
-సాయన్న అభిమానుల రోదన

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిని అంతిమయాత్ర అభిమానుల అశ్రునయనాల మధ్య జరిగింది. కార్ఖానాలోని ఆమె నివాసంలో ప్రజల సందర్శనార్ధం భౌతికకాయం ఉంచారు. అక్కడి నుంచి అభిమానులు, బీఆర్‌ఎస్ అగ్రనేతలతో.. ఆమెను ఉంచిన రథం వైకుంఠధామానికి చేరుకుంది. మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి నివాళులర్పించారు. అక్కడే ఉన్న తలసానిని అంతిమయాత్ర ఏర్పాట్ల గురించి ఆరా తీశారు.

మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఎమ్మెల్యే నందిత ప్రమాదఘటన తెలిసిన వెంటనే వారి కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఆసుపత్రికి వెళ్లి, అక్కడి నుంచి భౌతికకాయం ఆమె నివాసానికి వచ్చేవరకూ ఏర్పాట్లు పర్యవేక్షించారు. భౌతికకాయం వైకుంఠధామం వెళ్లి, దహనసంస్కారాలు అయ్యే వరకూ తలసాని అక్కడే ఉండి కుటుంబసభ్యులను ఓదార్చారు.

లాస్య తండ్రి, దివంగత ఎమ్మెల్యే సాయన్న మృతిచెందినప్పుడు సైతం, తలసాని అక్కడే ఉండి సాయన్న అంత్యక్రియల ఏర్పాట్లు పర్యవేక్షించారు. కాగా మాజీ మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే లాస్యనందిత పాడె మోయడం విశేషం. ప్రభుత్వ లాంఛనాలతో లాస్యనందిత అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

LEAVE A RESPONSE