నేడే విడుదల!

– పొత్తు లెక్కలు రెడీ?
– బాబు-పవన్-లోకేష్ కలసి కసరత్తు
– సర్వే నివేదికలతో కుస్తీ
– నేడే టీడీపీ-జనసేన తొలిజాబితా?
-సిట్టింగులకు మళ్లీ సీట్లు?
– మాఘ పౌర్ణమి మంచి ముహుర్తం
– ఏకాభిప్రాయం ఉన్న సీట్ల ప్రకటన?
– వైసీపీకి లబ్ధి కలగకూడదన్నదే ఇద్దరి లక్ష్యం
– ఇరు పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ
( మార్తి సుబ్రహ్మణ్యం)

వైసీపీ అధినేత-ఏపీ సీఎం జగన్ పిలుపునిస్తున్న ‘సిద్ధం’ నినాదానికి బదులుగా ‘సై ’ అంటున్న టీడీపీ-జనసేన.. ఆమేరకు తమ పార్టీ అభ్యర్ధుల ఎంపికకు ఉమ్మడి కసరత్తు ప్రారంభించాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాధిపతి పవన్ కల్యాణ్, టీడీపీ యువనేత లోకేష్ కలసి అభ్యర్ధుల జాబితాపై కసరత్తు చేశారు. శనివారం మాఘ పౌర్ణమి మంచిరోజు కావడంతో, అదేరోజు తొలిజాబితా ప్రకటించాలని ఇరుపార్టీల నాయకత్వాలు నిర్ణయించినట్లు సమాచారం.

ఆ మేరకు ఉండవల్లి లోని చంద్రబాబు నివాసంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, యువనేత లోకేష్ రాత్రి వరకూ సుదీర్ఘ చర్చలు జరిపారు. ప్రధానంగా వైసీపీకి ఎలాంటి లబ్ధి చేకూర్చకూడదన్న లక్ష్యంతోనే ఇరు పార్టీలు జాబితా కూర్పుపై కసరత్తు చేశాయి. ఆ మేరకు వైసీపీని ఎదుర్కొనే అంగఅర్ధబలం ఉన్న అభ్యర్ధులనే ఎంపిక చేయాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ప్రత్యర్ధికి అవకాశం ఇచ్చినట్టవుతుందన్న ముందుజాగ్రత్తతో, ఆచితూచి ఎంపిక ప్రక్రియ చేపట్టారు.

కాగా ఇరు పార్టీలకు ఎలాంటి అభ్యంతరం లేని నియోజకవర్గాలకు సంబంధించి, అభ్యర్ధుల జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకే నియోజకవర్గంలో ఇరు పార్టీలు తలపడిన సందర్భం ఉంటే వాటిని పక్కన పెట్టి, ఏకాభిప్రాయం వచ్చిన నియోజకవర్గాలకే పరిమితమై, సీట్ల సర్దుబాటు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాఘపౌర్ణమి మంచిరోజు కావడంతో, శనివారం ఉమ్మడిగా తొలి జాబితా విడుదల చేస్తారని ఓ సీనియర్ నేత వెల్లడించారు.

కాగా నియోజకవర్గాల్లో ఇరు పార్టీలకు ఉన్న బలం ఎంత? ఏపార్టీకి ఎంత శాతం ఓటు బ్యాంకు ఉంది? ఏయే సామాజికవర్గాలు ఎవరికి మద్దతునిస్తున్నాయి? గతంలో రెండు పార్టీలకు వచ్చిన ఓట్లు ఎన్ని? ఇరు పార్టీ అభ్యర్ధుల సామాజిక-ఆర్ధిక బలం ఎంత? వైసీపీ అభ్యర్ధి ప్రస్తుత పరిస్థితి ఏమిటన్న కీలక అంశాలపై, ముగ్గురు నేతలు సర్వేల ప్రాతిపదికన చర్చించినట్లు సమాచారం. ఆమేరకు టీడీపీ-జనసేన నాయకత్వాలు, తాము వివిధ సంస్థలతో చేయించుకున్న సర్వే నివేదికలను ముందు పెట్టుకుని.. చర్చల్లో నియోజకర్గాలు, అభ్యర్ధుల ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది.

కాగా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ తిరిగి టికెట్లు ఇస్తామని గతంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అసెంబ్లీ సమావేశాల సందర్భంలో ప్రకటించారు. కాబట్టి, ఇప్పుడు టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న, సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టి కెట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా హామీ ఇచ్చినందున, దానిని అమలుచేయాల్సి ఉంటుంది.

Leave a Reply