బీసీ సబ్ ప్లాన్ కావాలంటే కుల గణన జరగాలి

– కులగణనలో నిజాయితీగా ఉన్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్
– కులగణన తీర్మానం చారిత్రాత్మకం: బీసీ మేధావులు
– కులగణన సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

బీసీ సబ్ ప్లాన్ కావాలంటే కుల గణన జరగాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు, శుక్రవారం సాయంత్రం సచివాలయంలో జరిగిన కులగణన సమావేశంలో ఆయన పలు అంశాలు బీసీ మేధావులతో, అధికారులతో చర్చించి మాట్లాడారు. దేశ సంపద కొద్ది మంది చేతుల్లో ఉంది, ఎక్కువమంది ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నారు. ఈ అంతరాలు తొలగి పోవాలంటే కులగణన జరగాల్సిందేనని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు.

కులగణనకు సంబంధించి వివిధ రాష్ట్రాలతో పాటు బీహార్లో ఎటువంటి న్యాయపర చిక్కులు లేకుండా, విజయవంతంగా సర్వే జరిగి చట్టరూపం దాల్చిన తీరును ఆయన అధికారులు అడిగి తెలుసుకున్నారు. కులగణనకు సంబంధించి రాష్ట్ర క్యాబినెట్ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే కుల గణన చేపడుతామని దేశానికి ఆదర్శంగా నిలుస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా నాయకుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారని డిప్యూటీ సీఎం బీసీ నేతలకు వివరించారు.

ఈ అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ ప్రసంగాన్ని తానే అనువాదం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కులగనన తీర్మానం పై విపక్షంలో కొందరు దారి తప్పించాలని, కుట్రపూరిత విమర్శలు చేశారు అయినా మేము క్యాబినెట్లో తీర్మానాన్ని ఆమోదింపజేసి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం చేయించిన విషయాన్ని బీసీ మేధావులతో డిప్యూటీ సీఎం పంచుకున్నారు. కుల గణన కేవలం పొలిటికల్ రిక్రూట్మెంట్ కోసమే కాకుండా జనాభాకు అనుగుణంగా దేశ సంపద పంచాలి. సంపద ఎక్కడ ఉంది, భూమిలేని నిరుపేదలు ఎందరు, విద్యలో వెనుకబాటు, ఇల్లు లేని వారు, ద్విచక్ర వాహనాలు లేని వారు ఇలా అన్ని అంశాలు కులగణన సర్వేలో వెలుగులోకి వస్తాయన్నారు.

బీహార్ లో చేసిన సర్వేలో ఈ అంశాలన్నీ గుర్తించారా? అని అధికారులను ఆరా తీశారు. బీసీ సబ్ ప్లాన్ ద్వారా ప్రయోజనం చేకూర్చాలంటే కులగణన జరిగి తీరాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కుల గణన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదింప చేయడం విప్లవాత్మకమైన చర్యగా అభివర్ణించారు. ఈ చారిత్రిక అంశాన్ని సెమినార్లు, మీడియా సమావేశాలు, యూనివర్సిటీల్లో సదస్సుల ద్వారా తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీసీ మేధావులను డిప్యూటీ సీఎం కోరారు.

అసెంబ్లీలో కులగణన తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా ఒక ఘట్ట౦ ముగిసిందని బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మేం నిజాయితీగా ఉన్నా౦, క్యాబినెట్లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కులగణన తీర్మానాన్ని ఆమోదించాం. ఈ విషయాన్ని పబ్లిక్ డిమాండ్ లో పెట్టామని పొన్నం ప్రభాకర్ తెలిపారు.

కులగణన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని ప్రజలకు అర్థమైందనీ మాజీ జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఈ కార్యక్రమంతో మరో 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉంటుందని ఆయన అభినందించారు. కులగనన తీర్మానం అసెంబ్లీలో ఆమోదింప చేయడం ద్వారా కొత్త ప్రభుత్వం పొలిటికల్ విల్లింగ్ అర్థమైందని ప్రొఫెసర్ మురళీధర్ అన్నారు.

ఈ అంశాన్ని చివరి వరకు తీసుకెళ్తారు, అధికారులకు ప్రభుత్వానికి ఈ అంశంలో చిత్తశుద్ధి ఉందని మాకు ప్రగాఢ నమ్మకం కలిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక పెద్ద జాతీయ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కులగననకు కట్టుబడి ఉండడం విప్లవాత్మకమైన చర్య అని ప్రొఫెసర్ సింహాద్రి అన్నారు. కుల గణన విజయవంతంగా పూర్తి అయితే మిగిలిన అన్ని అంశాలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

కింది కులాల పట్ల ఈ ప్రభుత్వానికి నిజాయితీ నిబద్దత ఉందని మాకు భరోసా కలిగిందని బీసీ నేత క్రాంతి కుమార్ అన్నారు. అంధకారంలో ఉన్న బతుకులకు కొత్త ప్రభుత్వం వెలుగులు చూపిస్తుందన్న నమ్మకం కలిగిందన్నారు. కార్యక్రమంలో ఆకునూరి మురళి, విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్ర వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply