– బాలకృష్ణ భార్య వసుంధర సహా కుటుంబ సభ్యుల దీక్ష
– మురళీమోహన్ మద్దతు
– తరలివచ్చిన తెలంగాణ టీడీపీ శ్రేణులు
– హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టును ఖండిస్తూ.. గాంధీజయంతి సందర్భంగా టీడీపీ నిర్వహించిన నిరసనదీక్షలో, నందమూరి కుటుంబం మూకుమ్మడిగా హాజరయింది. నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర తన జీవితంలో తొలిసారి రోడ్డెక్కి, చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నినదించారు. నిజానికి నందమూరి కుటుంబం ఈవిధంగా ఒకేసారి రోడ్డెక్కడం ఇదే ప్రధమం. ఈ సందర్భంగా నందమూరి సుహాసినిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మాజీ ఎంపి మురళీమోహన్ హాజరయి తన మద్దతు ప్రకటించారు.
కేంద్రమాజీ మంత్రి పనబాక లక్ష్మి, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు అరవిందకుమార్ గౌడ్, నర్శిరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు అశోక్ తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దీక్ష ముగిసిన తర్వాత నందమూరి వసుంధరకు పనబాక లక్ష్మి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.
ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. చంద్రబాబుపై పెట్టిన కేసులు కోర్టులో నిలబడవని, సైకో జగన్ తన రాక్షస ఆనందం ఎక్కువ కాలం నిలబడదని స్పష్టం చేశారు. త్వరలో చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా రాబోతున్నారని, తెలంగాణలో కూడా టీడీపీ చక్రం తిప్పే రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యవాదులంతా బాబు అరెస్టును ఖండించాలని కాసాని పిలుపునిచ్చారు.