Home » షర్మిలమ్మ.. సునీతమ్మ మధ్యలో విమలమ్మ!

షర్మిలమ్మ.. సునీతమ్మ మధ్యలో విమలమ్మ!

– షర్మిల-సునీతపై మేనత్త విమలమ్మ ఫైర్
– అవినాష్ చిన్నోడని జాలి చూపిన విమలమ్మ
– అవినాష్ హంతకుడన్న అక్కచెళ్లెల్లపై ఆగ్రహం
– హత్య చేయడం మీరు చూశారా అని ప్రశ్న
– వైఎస్ పరువు తీస్తున్నారని ఆవేదన
– విమలమ్మ కొడుకుకు జగనన్న మేలు చేశాడన్న షర్మిల
– మీ అన్నను చంపితే మీకు కోపం రాలేదా అని ప్రశ్న
– ఎండాకాలం కదా అని షర్మిల వ్యంగ్యాస్త్రం
– ఎంపిక చేసుకున్న మీడియా వద్ద విమలమ్మ ఆవేదన
– ఒక్క ప్రశ్న కూడా వేయని మీడియా వైచిత్రి
– వైఎస్ కుటుంబంలో మహిళల మాటల యుద్ధం
( మార్తి సుబ్రహ్మణ్యం)

వైఎస్ కుటుంబంలో ఇక మహిళల మధ్య మాటల యుద్ధం మొదలయింది. ఇప్పటిదాకా షర్మిల-సునీత వర్సెస్ జగన్-అవినాష్‌రెడ్డికే పరిమితమైన కుటుంబసమరంలో, వైఎస్ సోదరి, క్రైస్తవ ప్రచారకురాలు విమలమ్మ హటాత్తుగా ప్రవేశించారు. ఇప్పటివరకూ కేవలం క్రైస్తవ ప్రచారానికే పరిమితమైన విమలమ్మ, ఇప్పుడు జగన్-అవినాష్‌రెడ్డికి దన్నుగా రంగంలోకి దిగారు.

అవినాష్‌రెడ్డిని పదే పదే హంతకుడంటూ నిందిస్తున్న షర్మిల-సునీతపై వారి సొంత మేనత్త విమలమ్మ విరుచుకుపడ్డారు. అవినాష్‌రెడ్డిని చిన్నపిల్లాడిగా అభివర్ణించిన విమలమ్మ మీడియాతో మాట్లాడారు. అయితే ఎంపిక చేసుకున్న మీడియాతో మాత్రమే ఆమె మాట్లాడటం గమనార్హం. సహజంగా ఇలాంటి కీలక అంశాలపై ఎవరైనా మీడియాను పిలిచి, తన అభిప్రాయాలు వెల్లడిస్తారు. కానీ విమలమ్మతో మాత్రం కేవలం ఎంపిక చేసుకున్న మీడియాను మాత్రమే పిలిపించి, ఆమెతో మాట్లాడించడం ప్రస్తావనార్హం.

‘‘మా ఇంటి ఆడపడుచులు వైఎస్ కుటుంబ పరువును రోడ్డుమీద పడేస్తున్నారు. నేను కూడా ఆ ఇంటి ఆడపడుచునే కాబట్టి ఆ కుటుంబాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. నా ఫ్యామిలీని ఇంత అన్యాయంగా తిడుతుంటే భరించలేకపోతున్నాం. మా షర్మిల

కొంగుపట్టుకుని ఓట్లు అడగటం చూశా. అలా అడిగితే ఇక లీడర్‌షిప్ క్వాలిటీ ఏముంది? దినమంతా అవినాష్‌రెడ్డిని హత్య చేసినాడని తిడుతున్నారు. హత్య చేయడం మీరు చూశారా? హత్య చేసినవాడు బయట తిరుగుతున్నాడు. వాడి మాట నమ్మి వీళ్లు అవినాష్‌రెడ్డిని హంతకుడంటే ఇక కోర్టులెందుకు? మీరేమో అవినాష్‌రెడ్డి బెయిల్ రద్దుకోసం కోర్టు కెళుతున్నారు. అవినాష్‌రెడ్డి మీకంటే చిన్నోడు. పదేళ్లు చిన్నవాడు. అలాంటి వాడిని పట్టుకుని హంతకుడని తిడుతున్నారు. వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఈ ఆడపిల్లలలిద్దరు.

వాడికీ పిల్లలున్నారు. కొంచెమైనా మీకు మనసుందా? జాలి, దయ, కరుణ లేదా? వైఎస్ ఉంటే ఇలా జరిగేదా? వైఎస్, వివేకం అన్న నన్ను ఎంతబాగా చూసుకునేవారు? ఏ పాపం తెలియని మా భాస్కరన్నేమో పాపం ఏడాది నుంచి జైల్లో ఉన్నాడు. జగనన్న మీద కూడా వీళ్లు అటాక్ చేస్తున్నారు. బయటవాళ్లు మన ఇంటిమీదకొస్తే మనకు ఎన్ని విబేధాలున్నా పక్కనపెట్టి ఒకటవుతాం. కానీ మా కుటుంబంలో ప్రకృతికి విరుద్ధంగా జరుగుతోంది. అబద్ధాల జనకుడైన అపవాది కోరల్లో ఈ అమ్మాయిలు చిక్కుకున్నారు. రాత్రి ఆ వీడియో చూస్తే నాకు బీపీ పెరిగింది. అవినాష్‌రెడ్డి ఇంట్లోవాళ్లంతా ఏడుస్తున్నారు.

జగన్-అవినాష్‌రెడ్డి మీద ఆ ఇద్దరు పెంచుకున్న కక్ష, పర్సనల్ అజెండాతో రాష్ట్రం అల్లకల్లోలవుతుంది. మేనత్తగా చెబుతున్నా.. దయచేసి మీరు మారండి. ఇప్పటికైనా నోరు మూసుకోండి. జగన్ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమాలు అందుతున్నాయి. అలాంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తున్నారే. అసలు మీకు కరుణ, జాలి లేవా? మనమంతా బంధువులం’’ అంటూ ఒక మీడియాతో మాట్లాడారు.

మేనత్త తమపై చేసిన వ్యాఖ్యలు, తమను నోరుమూరుసుకోమంటూ చేసిన హెచ్చరికలపై షర్మిల ఘాటుగా స్పందించారు. ‘‘మేం ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. విమలమ్మ గారు మా మేనత్తే. సీబీఐ చెబుతున్నదే మేమూ చెబుతున్నాం. ఆధారాలున్నాయి కాబట్టే ఫలానా వాళ్లు హత్య చేయించారని, మళ్లీ అన్యాయం జరగకూడదనే

మాట్లాడుతున్నాం. మళ్లీ హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు. ఈ హత్యారాజకీయాలు ఆగాలని మా అక్కచెలెళ్లు కొట్లాడుతున్నాం. విమలమ్మ కొడుక్కి జగన్ వర్కులు ఇచ్చారు. ఆర్ధికంగా వాళ్లు బలపడటం జరిగింది కాబట్టే విమలమ్మ ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్నారు. కానీ చనిపోయిన తన సొంత అన్న వివేకా తనకు ఎంత చేశారన్నది విమలమ్మ మర్చిపోయింది. వయసు మీదపడటం వల్ల అది సహజం. మర్చిపోయినట్లున్నారు. అందులో ఎండాకాలం. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నార’’ని వ్యంగ్యాస్త్రం సంధించారు. ‘ఎండాకాలం కాబట్టి’ అని నొక్కి మాట్లాడటంతో అక్కడున్న వారంతా నవ్వారు.

వైఎస్ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారనుకునే విమలమ్మ.. తాజా పరిణామాల నేపథ్యంలో, జగన్-అవినాష్‌రెడ్డి పక్షాన నిలబడిన వైనం ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల ముందు విమలమ్మ తన మేనల్లుడు జగన్ గెలుపు కోసం లోటస్‌పాండ్ వేదికగా పాస్టర్లు,ఫాదర్లతో సమావేశాలు నిర్వహించారు. కొద్దిరోజుల క్రితం ఆమె నిర్వహించిన క్రైస్తవ సమావేశంపై, కూటమి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైనం తెలిసిందే. తాజాగా షర్మిల వ్యాఖ్యలను బట్టి.. విమలమ్మ తనయుడికి జగన్ ప్రభుత్వం భారీ స్థాయిలోనే కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా, ఆర్ధికంగా బలపరిచిందని స్పష్టమవుతోంది. ఆ కృతజ్ఞతతోనే విమలమ్మ జగన్‌కు మద్దతునిచ్చారన్న భావన వ్యక్తమవుతోంది.

షర్మిలకు పోటెగా విమలమ్మ ప్రచారం?
విమలమ్మ తీరు పరిశీలిస్తే… కడప పార్లమెంటు పరిథిలో ఆమెను కూడా ప్రచారబరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని అమాయకులన్న విమలమ్మ ద్వారా ప్రచారం చేయిస్తే.. షర్మిల వైపు మొగ్గే వైఎస్ అభిమానుల ఓట్లు, చీల్చవచ్చన్న వ్యూహం కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు విమలమ్మ వ్యాఖ్యలకు షర్మిల ఘాటు జవాబు ఇవ్వడంతో, ఆమె ప్రచారానికి పెద్దగా ఫలితం ఉండకపోవచ్చంటున్నారు.

విమలమ్మకు ప్రశ్నలు వేయని వింత మీడియా
అయితే హటాత్తుగా తెరపైకి వచ్చి మీడియాతో మాట్లాడిన విమలమ్మను, ఏ ఒక్క మీడియా ప్రతినిధి కూడా ప్రశ్నలు అడగకపోవడం ఆశ్చర్యం కలిగించింది. షర్మిల విమర్శలు-వివేకా హత్య నేపథ్యంలో వైఎస్ కుటుంబం ఎందుకు చీలిపోయింది? జగన్ తన తల్లి,చెల్లికి ఎందుకు దూరమయ్యారు? షర్మిల అసలు నాకు జగన్‌అన్నయ్య కాదని ఎందుకు అన్నారు? వారిమధ్య ఆస్తితగాదాలేమైనా ఉన్నాయా? సజ్జల, బొత్స లాంటి వైసీపీ నేతలు షర్మిలను పెయిడ్ లీడరని విమర్శిస్తుంటే మీరెందుకు స్పందించలేదు? అని మీడియా ప్రతినిధులు ప్రశిస్తారని సహజంగా పాఠకులు, వీక్షకులు ఆశిస్తారు.

అసలు షర్మిల వైఎస్‌కే పుట్టలేదన్న దుష్ప్రచారంపై మీరెందుకు మౌనంగా ఉన్నారు? మీ అన్న కూతురి వ్యక్తిత్వ హననంపై జగన్ పార్టీ దాడి చేస్తుంటే, మేనత్తగా మీరెందుకు స్పందించలేదు? కుటుంమ పెద్దగా మీరు వారి మధ్య ఎందుకు సంధి కుదర్చలేదు? మీ కొడుక్కి జగన్ ఏమైనా కాంట్రాక్టులిచ్చారా? అవినాష్‌రెడ్డి హంతకుడు కాదని మీరెలా నిర్ధారిస్తారు? ఇలాంటి ప్రశ్నలు సంధించాల్సిన మీడియా ప్రతినిధులు.. స్టెనోగ్రాఫర్ల మాదిరిగా విమలమ్మ చెప్పింది షూట్ చేయడం వినా మౌనంగా ఉండటమే ఆశ్చర్యం.

నిజానికి జర్నలిస్టులకు ఇలాంటి అరుదైన అవకాశం ఎప్పుడో గానీ రాదు. అలాంటి వివాదాస్పద అంశాలపై వైఎస్ కుటుంబసభ్యులెవరూ విడిరోజుల్లో అయితే ఇంటర్వ్యూ ఇవ్వరు. కానీ స్వయంగా విమలమ్మనే మీడియా పేరంటం పెట్టారు కాబట్టి, ఆ అవకాశం వినియోగించుకుని.. వివేకా హత్య, షర్మిల-జగన్-విజయమ్మ మధ్య అభిప్రాయబేధాలు, షర్మిలపై వైసీపీ మాటల దాడి వంటి అంశాలను ఆమె వద్ద ప్రస్తావించి, విమలమ్మతో సమాధానాలు రాబట్టాల్సి ఉంది.

కానీ అందుకు భిన్నంగా విమలమ్మ చెప్పింది వినడానికే పరిమితమైన తీరు చూస్తుంటే.. అదేదో కేవలం కొందరిని ఎంపిక చేసుకున్న ప్రమోషన్ ప్రోగ్రాం అని, మెడమీద తల ఉన్న ఎవరికైనా అర్ధమయి తీరాలి. అసలు విమలమ్మ మీడియాతో మాట్లాడిన సమయంలో రిపోర్టర్లు ఎవరైనా ఉన్నారా? లేక ఫొటోగ్రాఫర్లతోనే ‘స్పాన్సర్ ప్రోగ్రాం’ లాగించేశారా అన్నది ఇంకో డౌటనుమానం.

Leave a Reply