‘అమ్మోరి గుడి’లో అన్యమత ప్రచారం..మళ్లీ ఆ ‘పిచ్చోళ్ల’ పనేనా?

– క్రైస్తవ ప్రార్ధనలతో పునీతమయిన బెజవాడ కనకదుర్గ ఆలయం
( మార్తి సుబ్రహ్మణ్యం)
బెజవాడ కనకదుర్గమ్మకు మహా పవర్‌ఫుల్ అమ్మోరని పేరు. అందుకే అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. బెజవాడ వెళ్లిన వారు, కొండపై కొలువుదీరిన అమ్మోరిని దర్శించకుండా వెళ్లరు. అలాంటి కోరిన కోర్కెలు తీర్చే అమ్మోరి ఆలయం.. దసరా సందర్భంగా పాస్టరు గారు చెప్పిన క్రైస్తవ వాక్యాలు, ప్రార్ధనలతో పునీతమయిపోయింది. ఆ స్తోత్రాలతో ఆలయం పావనమయింది. పాస్టరు గారు ‘పరిశుద్ధాత్మ’తో చేసిన ప్రార్ధనకు, కొండపై భక్తుల పూజలందుకుంటూ బిజీగా ఉన్న అమ్మోరు కూడా బిరాబిరామని దిగి వచ్చి, భక్తిశ్రద్ధలతో పాస్టరు గారి ‘దేవుడి వాక్యాలు’ విన్నదట. ఇప్పటి వరకూ బెజవాడ చుట్టూ కొండలపైనే శిలువను చూసిన వారికి, ఏకంగా అమ్మోరు కొలువుదీరిన కొండపైనే ‘శిలువ ఎక్కినంత పనిచేసి’.. ప్రభువు ప్రతినిధయిన పాస్టరు గారు.. టీవీలో చెప్పిన వాక్యాలు తరంగాల్లో బెజవాడలో కలసి, వాటిని ప్రత్యక్షంగా చూసిన హిందూ భక్తులను పులకరింపచేసిందట. ఇప్పటివరకూ అన్యమత ప్రచారం ఇంకా దుర్మమ్మ దాకా చేరలేదేమిటని బాధపడుతున్న ‘దేవుడి బిడ్డ’లకు ఇది శుభవార్తే కదా?!
విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా సందర్భంగా వచ్చే భక్తుల కోసం స్క్రీన్ ఏర్పాటుచేశారు. దాని కాంట్రాక్టును కావలసిన వారికి ఇచ్చారు. నలుగురు ఈఈలు, ప్రిన్సిపల్ సెక్రటరీ, వీరు కాకుండా ఇతర ఆలయాలకు చెందిన నలుగురు ఈఓలు దసరా పనులు పర్యవేక్షిస్తున్నారు. మరి ఇంతమంది పనిచేస్తున్నా, ఎదురుగా పెద్ద తెరపై ఏసు నామాలు, పాస్టర్ ప్రవచనాలు చెబుతుంటే అది ఎవరి కంట కనబడకపోవడమే కామెడీ. అయితే అక్కడకు వచ్చిన భక్తులు మాత్రం ఆ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసి, నానా యాగీ చేయడంతో.. ‘భక్తులపై దయతలచి’ ఏసు బోధనలు నిలిపివేశారు.


వైసీపీకి చెందిన ఒక స్థానిక చానెల్‌కు లైవ్ బాధ్యతలు అప్పచెప్పిన ఈఓ, సదరు చానల్ ఏమి ప్రసారం చేస్తుందో పర్యవేక్షించేందుకు ఎవరినీ నియమించకపోవడం ఆశ్చర్యం. ఆలయంలో ఎల్‌ఈడీ స్క్రీన్లను మాత్రం,నిజామామాద్‌కు చెందిన కీర్తి తరుణ్ క్రియేషన్‌కు కాంట్రాక్టు ఇచ్చారు. అయితే, లైవ్ బాధ్యతలు తీసుకున్న లోకల్ చానెల్ ఏమి టెలికాస్టు చేస్తుందన్నది కీర్తి క్రియేషన్‌కు సంబంధం లేదు. వారి పని కేవలం ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేయడమే. అన్యమత ప్రచారం వివాదం కావడంతో, దిద్దుబాటుకు దిగిన ప్రభుత్వం వెంటనే కీర్తి క్రియేషన్స్‌పై కేసు పెట్టి, అసలు లైవ్ టెలికాస్ట్ చేసిన లోకల్ చానెల్‌ను మాత్రం వదిలేయడం ఆశ్చర్యం.
నిజానికి లైవ్ టెలికాస్ట్ చేసిన లోకల్ న్యూస్ చానెల్ నిర్వహకులే వాటిని పర్యవేక్షించాలి. ఒకవేళ ప్రైవేటు కార్యక్రమాలు ఉన్నప్పటికీ, దానిని దుర్గగుడి పరిసరాల్లో ఇస్తున్న లైవ్ సిగ్నల్‌ను కట్ చేస్తే ఈ ప్రమాదం తలెత్తేది కాదు. కానీ, లైవ్ సిగ్నల్‌ను కట్ చేయకుండా, క్రైస్తవ మత ప్రచారకుడి ప్రోగ్రాంను నేరుగా టెలికాస్ట్ చేయడంతో, హిందూ భక్తులకు పాస్టరు గారి ప్రోగ్రాము చూసి తరించిపోయే భాగ్యం కలిగిందన్నమాట.
దుర్గగుడిలో అన్యమత ప్రచారంపై రాష్ట్రం అట్టుడుకుతున్నా.. ఇప్పటివరకూ ఆలయ ఈఓ గానీ, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గానీ ఇప్పటిదాకా శాఖాపరమైన విచారణ ప్రారంభించకపోవడమే విడ్డూరం. యధా రాజా తథా ప్రజ అంటే అదే మరి! వారంతా దసరా సందర్భంగా రోజూ ఆలయంలోనే తిష్టవేస్తున్నా, వారికి ఈ వివాదం పట్టకపోవడమే వింత. తాజాగా ఎల్‌ఈడీ స్క్రీన్లు పెట్టిన కీర్తి క్రియేషన్స్‌పై కేసు పెట్టి చేతులు కడిగేసుకున్న ప్రభుత్వం, అసలు ఆ అన్యమత ప్రచారాన్ని లైవ్ టెలికాస్ట్ చేసిన లోకల్ చానెల్‌ను మాత్రం కనికరించి వదిలేయడం ఆశ్చర్యం. ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఓ యువనేతకు అనుచరుడైనందుకే, ఆ చానెల్‌ను అలా వదిలేశారేమో మరి!
‘అసలు దీనికి ఈఓ, ప్రిన్సిపల్ సెక్రటరీ వైఫల్యమే కారణం. వారంతా ఉండి ఏం గడ్డి పీకుతున్నారు? ఈఈ భాస్కర్ హస్తం ఉంది. గతంలో భవానీ దీక్ష సమయంలో రెండుకోట్ల ఎల్‌ఈడీ కాంట్రాక్టు కూడా భాస్కరే ఇచ్చాడు. కాబట్టి ఆయనపై కూడా చర్య తీసుకోవాలి. చర్చి, మసీదులో ఇలా హిందూమత ప్రార్ధనలు చేయించే ధైర్యం ప్రభుత్వానికి ఉందా’ అని జనసేన నేత పోతిన మహేష్ ప్రశ్నించారు. బీజేపీ నేత లంకా దినకర్ మరో అడుగు ముందుకేసి, ‘ఏపీలో జగనన్న అన్యమత ప్రచార పథకం’ ప్రారంభించినట్లున్నారు. అసలు దుర్గగుడిలో దసరా ఏర్పాట్లు అన్యమత ప్రచారం కోసమే బాగా చేసినట్లున్నారు. రాష్ట్రంలో ప్రణాళిక ప్రకారం హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. అమ్మవారి చెంత ఒకవైపు వైసీపీ రంగుల విద్యుత్ దీపాలు. మరోవైపు అన్యమత ప్రచార హోరు’ అని దినకర్ ట్వీట్ చేశారు. దసరా సందర్భంగా ఆలయానికి వేసిన సీరియల్ సెట్లలో, వైసీపీ రంగుల ఏర్పాటు కూడా వివాదమయింది.
ఒకవేళ ఆ చానల్‌పై పోరపాటున కేసు పెట్టినా.. ఆ విషయం తమకు తెలియదని, బహుశా ఎవరో పిచ్చివాళ్లు చానెల్ ఆఫీసులోకి ప్రవేశించి ఉండవచ్చన్న స్టేట్‌మెంట్‌తో, ఈ కేసు సమాధి చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే.. ఇంతకుముందు అంతర్వేది, ఆ తర్వాత రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దేవాలయాలపై జరిగిన దాడులు, దేవతా విగ్రహాల విధ్వంసంలో కూడా. అలాంటి పిచ్చివాళ్లే ముద్దాయిలుగా తేలారు కాబట్టి! హేమిటో.. ఈ మతిస్థిమితం లేనివాళ్లంతా చర్చి-మసీదులు కాకుండా, దేవాలయాల చుట్టూనే తిరుగున్నారు!

Leave a Reply