– ఏడాదంతా పొలం పచ్చగా ఉండాలి – రైతన్నపంట పండాలి
– ఎల్‌నినో ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు – పీఎండీఎస్ అమలు
– 50 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ సాగుకు యాక్షన్ ప్లాన్
– హెక్టారుకు తగ్గిన సగటు యూరియా వినియోగం
– ఈ ఏడాది 11 లక్షల హెక్టార్లలో ప్రకృతి సాగు
– 250 ఎకరాల్లో కోకో సిటీ-ఎక్స్పీరియన్స్ సెంటర్
– వ్యవసాయం, అనుబంధ రంగాల సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా… రైతులకు భద్రత, అధిక ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డిమాండ్ ఉన్న పంటల్ని సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని… ఏది లాభదాయకమో దాని గురించి వివరించి చెప్పాలని సీఎం అన్నారు. అలాగే 365 రోజులు పంటలు పండించేలా చూడాలని, భూమిని భాగాలుగా విభజించి ఒకే రైతు వివిధ రకాల పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు.
క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రైతులు ప్రకృతి సాగు కింద చేసే ఉత్పత్తులను సర్టిఫికేషన్‌తో విక్రయించేలా చర్యలు చేపట్టాలని, దీంతో ఆయా ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుందని అధికారులతో సీఎం చెప్పారు. రాష్ట్రంలో గతేడాది రబీలో హెక్టారుకు యూరియా వినియోగం తగ్గడం శుభపరిణామమని అన్నారు.
రైతు బజార్ల నుంచి డోర్ డెలివరీ చేసేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని, దీని కోసం ఏదైనా ఏజెన్సీ సేవలు వినియోగించుకునేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాయలసీమను గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌గా చేసేందుకు క్లస్టర్ల వారీగా అభివృద్ధి కార్యాచరణ చేపట్టాలన్నారు.
ప్రపంచంలోనే తొలిసారిగా కోకో పంటకు సంబంధించి ‘కోకో సిటీ’ ఏర్పాటు చేస్తున్నామని… కోకో సిటీ ఔత్సాహిక రైతులకు ఎక్స్పీరియన్స్ సెంటర్‌గా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు. 250 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేసేందుకు సరైన ప్రాంతాన్ని ఎంపిక చేయాలని ఆదేశించారు.
ఏపీ మష్రూమ్ మిషన్ 2026-31
అరకు ఏజెన్సీలో కుంకుమ పువ్వు సాగును మరింత విస్తరించేలా, మంచి నాణ్యమైన దిగుబడులు వచ్చేలా అధ్యయనం జరపాలన్నారు. ఏపీ మష్రూమ్ మిషన్ 2026-2031 కింద ఏడాదికి లక్ష మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించాలని సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు. అనంతపురంలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న ఆపిల్, పండ్లు రుచికరంగా ఉన్నాయని, వాతావరణం కూడా అనుకూలించిందని అధికారులు చెప్పగా, మరింత విస్తీర్ణంలో సాగు జరిపేలా అక్కడ వాతావరణాన్ని అధ్యయనం చేయాలని చెప్పారు.
అలాగే అవకాడో, అంజీర్, పనస, జామ, మిరియాల సాగును పెంచేలా దృష్టి పెట్టాలని నిర్దేశించారు. అంజీర్ వంటి పండ్లను డ్రైఫ్రూట్గా మార్చి వాటి విలువ పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 50 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ సాగు జరిగేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. బీపీఎల్‌కు దిగువున ఉన్న రైతు కుటుంబాలకు అనుబంధంగా డెయిరీ, లైవ్ స్టాక్ ద్వారా అదనపు ఆదాయం పొందేలా సహకారం అందిచాల్సి ఉందని సీఎం అన్నారు. దీనికి ప్రభుత్వం నుంచి సాయం అందించేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు.
8 లక్షలు దాటిన ఫార్మర్ యాప్ రిజిస్ట్రేషన్లు
రాష్ట్రమంతా క్రాప్ సర్వే చేస్తున్నామని… సాగవుతున్న పంటలు, అక్కడ జలవనరుల వివరాలు నమోదు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఫార్మర్ యాప్‌తో రాష్ట్రంలో రైతులు, భూ విస్తీర్ణం, భూసార పరీక్షలు, యూరియా-పురుగుమందులు-విత్తనాల వినియోగం వివరాలు, ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలు వంటి సమాచారం అంతా యాప్‌లో పొందుపరిచామని అధికారులు వివరించారు.
ఆ ఏరియాలో భూగర్భ జలాలు, సమీప జలవనరుల వివరాలు ఉంటాయని, ఏ పంటలు రైతులు వేసుకుంటారనే దానిబట్టి అక్కడ వాతావరణ సమాచారం, యూరియా, విత్తనాలు అవసరాలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఫార్మర్ యాప్ రిజిస్ట్రేషన్లు ఇప్పటివరకు 8 లక్షల మంది రైతులు చేసుకున్నారని అధికారులు వివరించగా, రిజిస్ట్రేషన్‌తో పాటు దానిని ఎంతమంది రైతులు వినియోగించి లబ్ది పొందుతున్నారనేది ముఖ్యమని సీఎం అన్నారు. రైతన్నా మీకోసం ఫేజ్ 1లో 48.73 లక్షల కుటుంబాలు, ఫేజ్ 2లో 46.21 లక్షల రైతు కుటుంబాలకు పంచ సూత్రాలపై అవగాహన కల్పించామని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు.
ఏపీపై ఎల్‌నినో ఎఫెక్ట్-ముందస్తు చర్యలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో సగటు వర్షపాతం తక్కువగా, 92 శాతమే నమోదు కావొచ్చని అధికారులు అంచనాలు వివరించారు. ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంలోని వర్షాధారిత ప్రాంతాలపై తీవ్రంగా పడే అవకాశం ఉందని, ముఖ్యంగా అనంతపురం, సత్యసాయి, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో వానలు తగ్గొచ్చన్నారు.
ఇది పప్పుధాన్యాలు, నూనెగింజలు, నీటి ఆధారిత ఉద్యాన పంటలపై ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడ్డారు. ఎల్‌నినో నివారణ చర్యల్లో భాగంగా పీఎండీఎస్ (Pre-Monsoon Dry Sowing) విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వర్షాలకు ముందే విత్తనాలు వేసే పీఎండీఎస్ విధానంతో రైతులకు అధిక దిగుబడి రావడంతో పాటు ఖర్చు, ఎరువులు, నీటి వనరులు వినియోగం తగ్గుతుందన్నారు.
దీంతో ఎకరాకు రూ.5,000 నుంచి రూ.7,000 వరకు రైతులు అదనపు ఆదాయం పొందుతారని చెప్పారు. ఈ ఏడాది 20 లక్షల ఎకరాల్లో దీనిని అమలు చేసేలా చూడాలని సీఎం సూచించారు. దీనిని వీబీ జీ రామ్ జీతో అనుసంధానించే అంశాన్ని పరిశీలించాలన్నారు.
అన్ని గ్రామాల్లో ప్రకృతి సాగుకు ప్రణాళికలు
2025-26లో 4,116 గ్రామ పంచాయతీల్లో 17.74 లక్షల రైతులు 9.26 లక్షల హెక్టార్లలో ప్రకృతి సాగు చేశారని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అయితే 2026-27లో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమంత్రి భారీగా లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ ఏడాది మొత్తం 13,300 గ్రామ పంచాయతీలకూ ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని… 25 లక్షల రైతులు, 11 లక్షల హెక్టార్లలో సాగు చేసేలా చూడాలన్నారు.
ఆర్ఎస్కే ఇంటిలిజెన్స్ హబ్ డ్యాష్ బోర్డ్
రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాల పనితీరును, వ్యవసాయ రంగ సమాచారాన్ని పర్యవేక్షించేలా రూపొందించిన ఆర్ఎస్కే ఇంటిలిజెన్స్ హబ్ డ్యాష్ బోర్డ్ గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇది ముఖ్యంగా రైతులకు సేవలను మెరుగుపరచడమే కాకుండా, విత్తనాలు-ఎరువుల సరఫరా, పంటల వివరాలను, ఇ క్రాంపింగ్, పంటల బీమా తదితర వివరాలను డిజిటల్‌గా ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుందన్నారు.
రైతులు తమ ఆర్డర్లు, స్టాక్ వివరాలను లైవ్ డ్యాష్‌బోర్డ్‌లో చూసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఈ డ్యాష్ బోర్డులో కచ్చితమైన సమాచారం రియల్ టైమ్‌లో అప్డేట్ అయ్యేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు.