– శంకర్ గౌడ్ కు నివాళి అర్పించేందుకు ముత్తోజీపేట విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్
– శంకర్ గౌడ్ శవాన్ని నర్సంపేట డిపోకు తరలించాలని కోరిన కుటుంబ సభ్యులు
– డిపోకు తీసుకొస్తే శంకర్ గౌడ్ కు నివాళి అర్పించే అవకాశాన్ని కల్పించాలని కోరిన కార్మికులు
– రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలున్నందున ససేమిరా ఒప్పుకోని పోలీసులు
– శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని వెల్లడి
– పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి
– మానవత్వం లేకుండా వ్యవహరిస్తే ఎలా అని మండిపాటు
– పోలీసుల వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, బీజేపీ శ్రేణులు, కార్మికులు
– సీఎంకు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు
– శంకర్ గౌడ్ శవాన్ని నర్సంపేటకు తరలించేందుకు బలవంతంగా బయటకు తీసుకొచ్చిన శ్రేణులు
– పోలీసులకు, కార్యకర్తలు, కార్మికుల మధ్య పెనుగులాట
– నడిరోడ్డుపైనే శంకర్ గౌడ్ శవాన్ని ఉంచిన పోలీసులు
– కోపోద్రిక్తులైన కార్యకర్తలు శవపేటికను తీసేసి శవాన్ని ఎత్తుకుని అంబులెన్స్ లోకి ఎక్కించే యత్నం
– శంకర్ గౌడ్ శవాన్ని మళ్లీ తమ ఆధీనంలోకి పోలీసులు
– శవాన్ని తీసుకెళ్లి ఏం చేసుకుంటారో చేసుకోండంటూ కుటుంబ సభ్యుల పట్టు
– బండి సంజయ్ వాహనంలో ఎక్కి వెళ్లేందుకు యత్నం
– కేంద్ర మంత్రితో పోలీస్ కమిషనర్ మంతనాలు
– ప్రభుత్వ ఆదేశాల మేరకు శంకర్ గౌడ్ కుటుంబ సభ్యుల, జేఏసీ నాయకులతో చర్చలు
– శంకర్ గౌడ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ
– ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తామని భరోసా
– శాంతించిన కుటుంబ సభ్యులు, జేఏసీ నేతలు
– మొదలైన శంకర్ గౌడ్ అంత్యక్రియలు
నర్సంపేట: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని నర్సంపేట ఆర్టీసీ డిపోకు తరలించాలన్న కుటుంబ సభ్యుల, ఆర్టీసీ కార్మికుల విజ్ఝప్తిని పోలీసులు తిరస్కరించడంతో పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శంకర్ గౌడ్ భౌతిక కాయానికి నివాళి అర్పించేందుకు నర్సంపేట మండలం ముత్తోజీపేటలోని ఆయన నివాసానికి వచ్చారు.
తమ విజ్ఝప్తిని పోలీసులు పట్టించుకోవడం లేదని చెప్పడంతో రంగంలోకి దిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పోలీసులతో మాట్లాడారు.
కుటుంబ సభ్యుల విజ్ఝప్తిని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. నర్సంపేట డిపోలో 22 ఏళ్లపాటు శంకర్ గౌడ్ సేవలందించినందున ఆ డిపో వద్దకే భౌతిక కాయాన్ని తరలించి ఆయనను కడసారి చూసి నివాళలు అర్పించే అవకాశాన్ని సహచర ఆర్టీసీ కార్మికులను అనుమతించాలని కోరారు.
నర్సంపేట డిపోకు తరలిస్తే శాంతిభద్రతలు తలెత్తుతాయని, ముత్తోజీ పేటలోనే తొందరగా అంత్యక్రియలు జరపాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయని పోలీసులు చెప్పారు. దీంతో బండి సంజయ్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కనీసం మానవత్వం లేకపోతే ఎట్లా? కుటుంబ సభ్యుల విజ్ఝప్తిని, సహచర ఆర్టీసీ కార్మికుల ఆకాంక్షను పట్టించుకోకపోతే ఎట్లా?
లా అండ్ ఆర్డర్ బాధ్యత రాకుండా నేను చేసుకుంటా. డెడ్ బాడీని నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు అనుమతించండి’’అని చెప్పారు. అయినా పోలీసులు సేసేమిరా అనడంతో శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు రోదిస్తూ పోలీసుల తీరుపై మండిపడ్డారు.
అదే సమయంలో బీజేపీ శ్రేణులు, ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పోలీసుల తీరును నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం, దోపిడి రాజ్యమంటూ నినాదాలు చేశారు. శంకర్ గౌడ్ భౌతిక దేహాన్ని వారంతా కలిసి ఇంట్లో నుండి బయటకు తీసుకొచ్చారు.
భౌతిక కాయాన్ని నర్సంపేటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని రోడ్డుపైనే శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని నిలువరించడంతో ఈ సందర్భంగా పోలీసులకు, బీజేపీ శ్రేణులకు, ఆర్టీసీ కార్మికుల మధ్య చాలా సేపు తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మండుటెండలో నడిరోడ్డుపైనే శంకర్ గౌడ్ భౌతిక కాయం వద్ద కూర్చొని నిరసన తెలిపారు.
దీంతో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు గంటపాటు పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య పెనుగులాట జరిగింది. కోపోద్రిక్తులైన బీజేపీ శ్రేణులు, ఆర్టీసీ కార్మికులు శవ పేటికను పక్కకు తోసి శంకర్ గౌడ్ డెడ్ బాడీని తీసుకుని అంబులెన్స్ లోకి ఎక్కించారు.
అంబులెన్స్ కదులుతుండగా మళ్లీ పోలీసులు అడ్డుకుని డెడ్ బాడీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో పట్టరాని కోపంతో బీజేపీ శ్రేణులు, ఆర్టీసీ కార్మికులు, శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ దాదాపు 3 గంటలకుపైగా రోడ్డుపైనే బైఠాయించారు.
దీంతో వరంగల్ మల్లంపేట రహదారి పూర్తిగా స్తంభించింది. అయినా పోలీసుల ససేమిరా అనడంతో విసిగిపోయిన శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు ‘‘మీరే అంత్యక్రియలు నిర్వహించుకోండి. ఎలా చేస్తారో చూస్తాం’’ అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వాహనంలోనే కూర్చుండిపోయారు.
దీంతో వరంగల్ పోలీస్ కమిషర్ సన్ ప్రీత్ సింగ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కేంద్ర మంత్రితో చర్చలు జరిపారు. సమయం మించి పోతోందని, అంత్యక్రియలు నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. వెంటనే కేంద్ర మంత్రి స్పందిస్తూ…‘‘శంకర్ గౌడ్ అంత్యక్రియల విషయంలో ఆయన కుటుంబ సభ్యుల, ఆర్టీసీ జేఏసీ నేతల నిర్ణయమే ఫైనల్. వారు ఏం చెబితే దానికి మేం అంగీకరిస్తాం. దయచేసి రెచ్చగొట్టి ఇబ్బందులు స్రుష్టించొద్దు’’అని కోరారు. ఈ నేపథ్యంలో శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులతో, ఆర్టీసీ జేఏసీ నాయకులతో పోలీసులు చర్చలు జరిపారు.
అదే సమయంలో ప్రభుత్వ పెద్దలతో ఫోన్లో మాట్లాడించారు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటామని, నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై చర్చలు జరుగుతున్నాయని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని భరోసా ఇచ్చారు.
దీంతో శాంతించిన కుటుంబ సభ్యులు, జేఏసీ నాయకులు శంకర్ గౌడ్ అంత్యక్రియలను నిర్ణయించి కేంద్ర మంత్రి బండి సంజయ్ కు తెలియజేయడంతో వారికి ఏ ఇబ్బందులు లేకుండా అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసులకు చెప్పిన బండి సంజయ్ అక్కడి నుండి కరీంనగర్ కు తిరుగుపయనమయ్యారు.
ఆర్టీసీ కార్మికులు ఏమైనా దొంగలా? లంగలా?: బండి సంజయ్
ముత్తోజీపేటకు రాగానే తొలుత కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘శంకర్ గౌడ్ డెడ్ బాడీతో పోలీసుల రాజకీయాలేంది?. నర్సంపేట డిపో ఏమైనా పాకిస్తాన్ లో ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత పట్టింపులెందుకు? శంకర్ గౌడ్ డెడ్ బాడీని పోలీసులు తీసుకెళ్లి ఏం చేసుకుంటారు?
శంకర్ గౌడ్ భౌతిక దేహాన్ని నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉంచి నివాళి అర్పించాలన్నది కుటుంభ సభ్యుల కోరిక. 22 ఏళ్ల అనుబంధమున్న ఆర్టీసీ డిపో వద్ద శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని కడసారి చూసి నివాళి అర్పించాలన్నది ఆర్టీసీ కార్మికుల ఆకాంక్ష. ఆర్టీసీ డిపో వద్ద శంకర్ గౌడ్ డెడ్ బాడీని 5 నిమిషాలు ఉంచేలా అనుమతించాలని కోరితే ఇంత గోడవ ఉండేది కాదు కదా?’’అని అన్నారు.
‘‘శాంతి భద్రతల సమస్యే ఉండదు…5 నిమిషాలు ఆర్టీసీ డిపో వద్ద ఉంచాలని చెప్పినా పట్టించుకోకపోతే ఎలా? శంకర్ గౌడ్ ఇంటి ముందు టెంట్ వేసిన వాళ్లను సైతం పోలీసులు బెదిరిస్తున్నారు. మేం చెప్పినట్లు వినకపోతే బెన్ ఫిట్స్ కూడా ఇవ్వబోమని శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. చివరకు శంకర్ గౌడ్ కొడుకును కొట్టి స్టేషన్ కు తరలించారు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా? ఆర్టీసీ కార్మికులు ఏమైనా దొంగలా? లంగలా?. తమ సహచరుడిని కడసారి చూసుకుందామనుకుంటే ఎందుకు అనుమతించడం లేదు’’అని మండిపడ్డారు.
కుటుంబ సభ్యులు, జేఏసీ నాయకులతో చర్చల అనంతరం మళ్లీ మీడియాతో మాట్లాడుతూ… శంకర్ గౌడ్ అంత్యక్రియల విషయంలో నేను మొదటి నుండి ఆర్టీసీ జేఏసీ, శంకర్ గౌడ్ కుటుంబ సభ్యుల నిర్ణయానికే వదిలేశాం. వాళ్లు మాట్లాడుకుని అంతిమ యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. శంకర్ గౌడ్ కు సొంత ఇల్లు కూడా లేదు. ప్రభుత్వం చేసే రూ.10 లక్షల సాయం దేనికి పనికొస్తుంది? శంకర్ గౌడ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి.’’అని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
‘‘ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని కోరుతున్నా. ఆర్టీసీ కార్మికులకు యుద్దం కొత్త కాదు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. డిమాండ్ల సాధనలోనూ కొట్లాడాలే తప్ప ఆత్మహత్యలు చేసుకోవద్దు.ఆర్టీసీ కార్మికులకు బీజేపీ పూర్తిగా మద్దతిస్తోంది. వారి పక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం.’’అని పేర్కొన్నారు.