– పవన్ ఉన్నా ప్రయోజనం శూన్యం
– కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడినే పక్కన పెడతారా?
– కళా వెంకట్రావుకు ఇంత అవమానమా?
– అచ్చెన్నాయుడికి పొలిట్‌బ్యూరో ఇచ్చి కళాకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవా?
– బోండాకు ఇచ్చే విలువ ఇదేనా?
– కన్నాకు మంత్రి బదులు పార్టీ పదవి ఇస్తారా?
– కాపునాడు అధ్యక్షుడు అర్జా రామకృష్ణను తొలగించి అవమానిస్తారా?
– రెండు జిల్లాల బోయలకు అన్నేసి పదవులా?
– రాయలసీమలో బలిజలకు ఒక్క పదవేనా?
– ఇవి కాపులను అవమానించడమే కదా?
– పవన్‌ను చూసుకుని కాపులను పక్కన పెడతారా?
– పవన్ కాపులకు ఏం చేశారని గౌరవించాలి?
– కాపులను పట్టించుకోని పవన్ మాకెందుకు?
– మనం పవన్‌ను మోసింది ఇందుకేనా?
– మళ్లీ పవన్ పార్టీ గెలుస్తుందా?
– మళ్లీ పవన్‌ను కాపు-బలిజలు మోస్తారా?
– కాపు-బలిజ సమస్యలపై మళ్లీ రోడ్డెక్కాల్సిందే
– పార్టీలు పక్కనపెట్టి జాతికోసం పోరాడాల్సిందే
– కర్నూలులో కాపునాడు నేతల ఆగ్రహం
( మార్తి సుబ్రహ్మణ్యం)
రెండేళ్ల ఆశాజనక మౌనం తర్వాత కాపునాడు గళం విప్పింది. ఈ రెండేళ్లలో కాపు-బలిజలకు జరిగిన మేలు-అన్యాయాన్ని సుదీర్ఘంగా చర్చించింది. సుదీర్ఘ చర్చల తర్వాత.. జిల్లా పర్యటనలు చేసి, కాపు-బలిజల మనోగతం మేరకు అడుగులు వేయాలని నిర్ణయించింది.
కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ టీడీపీ నేత, ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు అర్జా రామకృష్ణను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించడంతోపాటు.. తూర్పు కాపు నేత, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ మంత్రి కళా వెంకట్రావును రాష్ట్ర ఉపాథ్యక్ష పదవికి పరిమితం చేయడం.. మంత్రి పదవి ఇవ్వాల్సిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను పార్టీ కమిటీకి పరిమితం చేయడం.. పొలిట్‌బ్యూరో నుంచి బొండా ఉమాను తప్పించడం వంటి చర్యలపై .. ఆదివారం కర్నూలు వేదికగా చర్చించిన కాపునాడు నాయకులు తీవ్ర అసంతృప్తి-ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం కర్నూలు, అనంతపురం జిల్లాకే పరిమితమయిన బోయలకు ఎక్కువ పదవులిచ్చి, సీమలోని అన్ని జిల్లాలో అధిక జనాభా ఉన్న బలిజలను అవమానించడంపై బలిజ నేతలు కన్నెర్ర చేశారు. అటు కోస్తాలోనూ కాపులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
తాము పల్లకీ మోసిన పవన్ వల్ల కాపు-బలిజలకు వీసమెత్తు ఉపయోగం లేనందున.. మళ్లీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సిందేనని కాపునాడు నేతలు వాదించారు. కాపు-బలిజ ఓట్లతో అన్ని సీట్లు గెలుచుకున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు తమ జాతిని పట్టించుకోనందున, తామూ ఆయనను పట్టించుకోవలసిన పనిలేదని స్పష్టం చేశారు.
అటు.. ఈనెల 28, లేదా వచ్చే నెల 5న తిరుపతి వేది గా.. టీడీపీ మాజీ సభ్యుడు, బలిజనాడు కన్వీనర్ ఓవి రమణ, అర్జా రామకృష్ణ ఆధ్వర్యంలో ‘బలిజ-కాపు శంఖారావం’ ఏర్పాట్ల చర్చకు తెరలేచింది. దీనికి పార్టీలకు అతీతంగా కాపు-బలిజ నేతలను ఆహ్వానించాలని, ఈ కార్యక్రమాలకు అటు దళితులనూ ఆహ్వానించాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఆదివారం కర్నూలు శివారులోని ఓ రిసార్టులో కాపునాడు అంతర్గత సమావేశం వాడివేడిగా జరిగింది. ఈ సమావేశంలో రెండేళ్ల కూటమి పాలనలో కాపు-బలిజవర్గాలకు రాజకీయ-ఆర్ధిక-సామాజక రంగాల్లో జరుగుతున్న అన్యాయంపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఫల్యాలపైనే ఎక్కువగా చర్చించారు. సమావేశం సమాచారం బయటకు పొక్కడంతో, మీడియా-ఇంటలిజన్స్ వర్గాల రాకతో.. వేదికను మూడుసార్లు మార్చడం గమనార్హం. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం..
కులపరంగా-సైద్ధాంతికంగా కమ్మ సామాజికవర్గంతో సరిపడకపోయినా.. పవన్ కల్యాణ్ జత కట్టారన్న ఏకైక కారణంతో కూటమిని గెలిపించిన తమను గత రెండేళ్లుగా పట్టించుకునేవారే కరువయ్యారని కాపు-బలిజ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మరో 15 ఏళ్లు కూటమి కలసి ఉండాలంటున్న పవన్ కల్యాణ్ తీరు వల్ల మరో 15 ఏళ్లు కాపుఙలిజలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
చివరకు టీడీపీ రాష్ట్రకమిటీలో ఉపాధ్యక్షుడిగా ఉన్న కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు, కర్నూలులో పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోస్తున్న అర్జా రామకృష్ణను తాజా కమిటీలో పక్కనపెట్టడాన్ని కాపు-బలిజలను అవమానించడంగానే భావించాలని నాయకులు స్పష్టం చేశారు. ‘ రాయలసీమలో బలిజల కోసం-పార్టీ కోసం కుటుంబం విడిచిపెట్టి పనిచేసిన కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడయిన మిమ్మల్నే గౌరవించని వాళ్లు ఇక మమ్మల్సేం గౌరవిస్తారు?మన జాతికి ఏం చేస్తుంది? కర్నూలు, అనంతపురం జిల్లాలకే పరిమితమయిన బోయ కులానికి చెందిన బిటి నాయుడుకు ఐదు పదవులిచ్చి, బలిజలకు ఒక్కటి ఇవ్వడం అవమానించడమే కదా? దీనిపై మనం ఇక అన్ని రకాల మొహమాటాలు విడిచిపెట్టి గళం విప్పాల్సిందే.
బహుశా పవన్ కల్యాణ్ తమ పక్కన ఉన్నారన్న ధీమాతో కూటమి, కాపు-బలిజలను పట్టించుకోకపోవచ్చు. కానీ అదే పవన్ వల్ల కాపు-బలిజ జాతికి వీసమెత్తు ఉపయోగం కనిపించడం లేదు. ఆయన అసలు కులం వారినే దగ్గరకు రానీయడం లేదు. తనకు కులం లేదంటున్న ఆయన పక్కన, ఏ కులం వారున్నారో అందరికీ తెలుసు. మనం ఆయనకు అవసరం లేకపోతే మనకూ ఆయన అవసరం లేదు. దీనిపై మనం ఇక నిర్మొహమాటంగా ఉండాల్సిందే’’ని కాపునాడు నాయకులు స్పష్టం చేశారు.
అయితే తనకు ఎలాంటి రాజకీయ పదవులు అవసరం లేదని, తన కోసం కాకుండా జాతి ప్రయోజనాలు, భవిష్యత్తు గురించి చర్చించాలని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు అర్జా రామకృష్ణ నాయకులకు సూచించారు. ఈ సందర్భంలో పలువురు నాయకులు ఇటీవలి టీడీపీ రాష్ట్ర కమిటీపై చర్చించారు.
‘ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి, ఎన్నో పదవులు అనుభవించిన మాజీ మంత్రి కళా వెంకట్రావుకు పోలిట్‌బ్యూరోలో ఇవ్వకుండా రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడిగా ఇస్తారా? అదే ఆయన తర్వాత అధ్యక్షుడయిన అచ్చెన్నాయుడుకు పొలిట్‌బ్యూరోలో ఇస్తారా? అచ్చెన్నాయుడు కుటుంబానికి ఎన్ని పదవులిస్తారు? ఇదేం న్యాయం? ఉత్తరాంధ్రలో వెలమ సామాజికవర్గం దూకుడుతో, తూర్పు కాపులు అన్ని రంగాల్లో నష్టపోతున్నారు. ఇది తూర్పు కాపులను అవమానించడమే కదా? ఇంత అవమానం చేసే బదులు కళాకు అసలు పదవి ఎవరు ఇవ్వమన్నారు?
అనేకసార్లు మంత్రిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణకు మంత్రి పదవి ఇవ్వకుండా పార్టీ కమిటీలో ఇస్తారా? పొలిట్‌బ్యూరోలో ఉన్న ఎమ్మెల్యే బొండా ఉమను తొలగించడం అవమానించడమే కదా? టీడీపీ కాపులకు పదవులివ్వాలంటే పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లి అడుక్కోవాలట. ఇదేం పద్ధతి? ఇలాంటి అవమానాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోవలసిందేనని’’ స్పష్టం చేశారు.
విజయవాడ జిల్లా, సిటీకి ఇప్పటివరకూ ఒక్క కాపును టీడీపీ అధ్యక్షుడిగా నియమించలేదని మరో నాయకుడు గుర్తు చేశారు. కాపు కార్పొరేషన్‌కు 6 వేల కోట్ల నిధుల విడుదల-విద్యాదీవెన నిధుల కోసం ఎన్నిసార్లు డిమాండ్ చేసినా పట్టించుకోవడం లేదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా పవన్ కల్యాణ్‌ను చూసి కూటమిని గెలిపించిన కాపు-బలిజ కులానికి, అన్యాయమే మిగిలిందని మరికొందరు విమర్శించారు. ‘పవన్ గారు ఎవరితో కలవరు. ఎక్కడుంటారో తెలియదు. కాపు-బలిజ నేతలను ఇప్పటివరకూ లిసింది లేదు. కుల నాయకులకు అపాయింటుమెంట్ ఇవ్వరు. టీడీపీలో ఉన్న కాపు ఎమ్మెల్యేలను అడిగితే పవన్ ఉన్నందువల్ల పార్టీ మమ్మల్నే పట్టించుకోవడం లేదంటున్నారు. మరి మేం ఎవరిని కలవాలి? పవన్ వల్ల జాతికి వచ్చిన ప్రయోజనం ఏమిటి? అందువల్ల మనం ఇప్పటివరకూ పవన్ పై ఉన్న మొహమాటాలు-అభిమానం పక్కనపెట్టి జాతి కోసం పోరాడదాం’’ అని మరికొందరు వాదించారు.
మనం రోడ్డెక్కపోతే ఈ ప్రభుత్వాలు పట్టించుకోవని, మౌనంగా ఉంటే పవన్‌ను చూసి మనం మౌనంగా ఉన్నారని ప్రభుత్వం భావించి, మనల్ని పట్టించుకోదని మరికొందరు వ్యాఖ్యానించారు. ‘‘కూటమికి పవన్ బలం. పవన్‌కు మనం బలం. ఇప్పుడు తన పక్కన పవన్ ఉన్నారన్న ధీమాతోనే కాపు-బలిజలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అసలు అదే పవన్‌ను కాపు-బలిజలు పట్టించుకోరన్న సంకేతం ప్రభుత్వానికి వెళితే తప్ప చలనం రాదు. అందుకే పవన్‌ను వదిలేద్దాం. పైగా ఆయన తనకు కులం లేదని మన కులనాయకులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు’’ అని మరికొందరు సూచించారు.
ఈ క్రమంలో జోక్యం చేసుకున్న కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు అర్జా రామకృష్ణ, ఇది మనం మాత్రమే తీసుకునే నిర్ణయం కాదన్నారు. ‘మనకు జాతి కంటే ఇతర ప్రయోజనాలు ఏమీ లేవు. మనకు పదవులూ వద్దు. భవిష్యత్తు ప్రణాళికపై జిల్లాలకు వెళ్లి కాపు-బలిజ నాయకులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుందాం’’ అని చెప్పడంతో కాపునాడు నాయకులు అంగీకరించారు.
—
తిరుపతిలో ‘బలిజ-కాపు శంఖారావం?’
కాగా తిరుపతి వేదికగా ఈనెల 28 లేదా వచ్చే నెల 5న బలిజ-కాపు శంఖారావం సభకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. పార్టీలు-రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని కాపు-బలిజ ప్రముఖులతో శంఖారావం సభ నిర్వహించాలని యోచిస్తున్నారు. టీటీడీ మాజీ సభ్యుడు- బలిజనాడు కన్వీనర్ ఓ.వి.రమణ.. కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు అర్జా రామకృష్ణతోపాటు, రాయలసీమ, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లా బలిజ-కాపు నేతలతో ఆమేరకు చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సభకు దళిత నాయకులను కూడా ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. కాపు-దళితవర్గాలు కలిసి రాజ్యాధికారం సాధించాలన్న లక్ష్యంతో అడుగులు వేద్దామని చెబుతున్నారు.
ఇప్పటికే ఒక తరం నష్టపోయిందని, భవిష్యత్తు తరాలు నష్టపోకుండా ఉండాలంటే ఇకనయినా సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన నాయకులకు స్పష్టం చేసినట్లు సమాచారం. ‘‘మనం పేపర్ టైగర్లమనే మనల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు. మనం పేపరు డైగరులగా ఉందామా? ఇగోలు పక్కనపెట్టి నిజమైన పోరాటం చేద్దామా? అన్నది తేల్చుకోండి. మనకు గౌరవం-రాజకీయాల్లో ప్రాధాన్యం-అధికారంలో వాటా కావాలా వద్దా అనేది నిర్ణయించుకోండి. మనకు పార్టీలు అవసరం లేదు. పదవులు అవసరం లేదు. మన జాతి కోసం పోరాడితే మన తరాలు మనల్ని పూజిస్తాయి. అన్ని పార్టీల్లో వారిని పిలుద్దాం. కార్యాచరణపై అందరి సలహాలు తీసుకుని నిర్ణయం ప్రకటిద్దామ’’ని ఒవి రమణ నాయకులకు స్పష్టం చేసిన ట్లు తెలుస్తోంది.