– సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించేలా చూడండి
– మా నియోజకవర్గంలో నిబంధనలు అమలు చేస్తున్నాం
– రాష్ట్రవ్యాప్తంగా ఈ నిబంధనలు కఠినంగా అమలుచేయండి
– ఏ మతం వారికీ మినహాయింపు వద్దు
– ప్రజలకు ప్రశాంతతే ముఖ్యం
– డీజీపీకి డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్ లేఖ
అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో అనధికారంగా, నిరంతరంగా లౌడ్‌స్పీకర్ల వినియోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ, శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కె. రఘురామకృష్ణంరాజు (ఆర్ఆర్ఆర్) రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. డీజీపీకి పంపిన లేఖలో ప్రజల నుంచి పెరుగుతున్న ఫిర్యాదులను ప్రస్తావించిన ఆయన, మత స్వేచ్ఛ రాజ్యాంగబద్ధ హక్కు అయినప్పటికీ అది ప్రజల ప్రశాంత జీవనానికి, ఆరోగ్యానికి భంగం కలిగించకూడదన్నారు.
శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు–2000 మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం లౌడ్‌స్పీకర్ల వినియోగానికి సంవత్సరానికి పరిమిత రోజులు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. అయినప్పటికీ అనేక ప్రార్థనా స్థలాల్లో ప్రతిరోజూ అధిక శబ్దంతో సౌండ్ సిస్టమ్‌లు వినియోగిస్తున్నారని, దీనివల్ల విద్యార్థులు, వృద్ధులు, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తన నియోజకవర్గంలో ఇప్పటికే ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నామని, ఇదే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని పోలీసు శాఖను కోరారు.
నిబంధనలను ఉల్లంఘించే వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని ప్రజా ఇబ్బందులకు సంబంధించిన సెక్షన్లు 270, 292తో పాటు శబ్ద పరిమితులు, సమయాలపై ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినందుకు వర్తించే సెక్షన్ 223 కింద చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ చట్టం–1986 ప్రకారం శబ్ద కాలుష్య ప్రమాణాలను ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందని గుర్తుచేశారు.
నాయిస్ పొల్యూషన్ రూల్స్‌లోని 7, 8 నిబంధనల ప్రకారం అనధికార సౌండ్ పరికరాలను స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉందని పేర్కొన్నారు. ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలగకుండా తక్షణ చర్యలు తీసుకుని, రాష్ట్రవ్యాప్తంగా కఠిన అమలు జరిగేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని డీజీపీని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కోరారు.