* సహకార సంఘాలతో మంత్రి సవిత
* నాణ్యమైన వస్త్రాలనే ఆప్కోకు విక్రయించండి
* ట్రెండ్ కు తగ్గట్లు వస్త్రాలు నేయండి
* నేతన్నల స్కిల్ పెంచేలా శిక్షణిస్తాం
* చేనేతల రెట్టింపు ఆదాయమే కూటమి లక్ష్యం
* 23 నెలల కాలంలో ఆప్కో ద్వారా రూ.190 కోట్ల వస్త్రాల విక్రయం
* రాబోయే మహానాడులో ప్రత్యేక చేనేత స్టాళ్లు ఏర్పాటు
* ఆప్కోకు తొలిసారి టీటీడీ ఆర్డర్
* చేనేతల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం
* త్వరలో నేతన్న భరోసా కు శ్రీకారం : మంత్రి సవిత
అమరావతి : నేతన్నలకు రెట్టింపు ఆదాయం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, వారికి ఆర్థిక మేలు కలిగేలా చేనేత సహకార సంఘాల చెంతకు వచ్చి చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. ఇండెంట్ లో పేర్కొన్న నాణ్యమైన వస్త్రాలనే ఆప్కోకు విక్రయించాలని, ఆ సంస్థను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలుచేస్తున్నామని, ఇప్పటికే ఉచిత విద్యుత్ అందజేశామని తెలిపారు.
చేనేతల ఆరోగ్య రక్షణకు యూనివర్సల్ హెల్త్ పాలసీని తీసుకొస్తున్నామని, నేతన్న భరోసా పథకం ద్వారా రూ.25 వేల ఆర్థిక సాయం అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో మంత్రి సవిత సోమవారం భేటీ అయ్యారు. చేనేత సహకార సంఘాల నుంచి చేనేత వస్త్రాల కొనుగోలు, ఇతర సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చేనేతల బాగుకోరే ప్రభుత్వం తమదన్నారు. చేనేత కళాకారులు కాలరు ఎగరేసేలా బతకాలన్నది సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లక్ష్యమన్నారు. 365 రోజులూ చేనేతలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 23 నెలల కాలంలో ఆప్కో ద్వారా రూ.190 కోట్ల అమ్మకాలు చేశామన్నారు. ఆప్కో షో రూమ్ ల్లో అమ్మకాలు పెంచడానికి సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు.
ఉచిత విద్యుత్ పథకం ద్వారా నేతన్నల కుటుంబాలకు ఎంతో మేలు కలుగుతోందన్నారు. 90 శాతం సబ్సిడీతో మగ్గం పనిముట్లు అందజేస్తున్నామని, నూలు కొనుగోలుపై 15 శాతం సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. నేతన్నలకు రెట్టింపు ఆదాయం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత వెల్లడించారు.
రాబోయే మహానాడులో చేనేత ఎగ్జిబిషన్ ఏర్పాటు
చేనేత అమ్మకాలకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నామని, సోషల్ మీడియాలో విస్తృతం ప్రచారం చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఆన్ లైన్ ద్వారా అమ్మకాలు చేస్తున్నామని, 6,770 చేనేత ఉత్పత్తులను 40 ఆప్కో షో రూమ్ ల ద్వారా ఈ కామర్స్ ద్వారా విక్రయిస్తున్నామని వెల్లడించారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామని, వాటికి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత ఎగ్జిబిషన్లకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. గతేడాది నిర్వహించిన మహానాడు సహా టీటీడీ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరులో జరిగే మహానాడు సందర్భంగా చేనేత ఎగ్జిబిషన్ స్టాళ్లు ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి సవిత తెలిపారు.
నాణ్యమైన వస్త్రాలనే ఆప్కోకు విక్రయించండి
చేనేతలకు ఆర్థిక మేలు కలిగేలా చేనేత సహకార సంఘాల చెంతకు వచ్చి చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తామని మంత్రి సవిత స్పష్టంచేశారు. చేనేత వస్త్రాలను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తామన్నారు. చేనేత అధికారులు స్వయంగా సహకార సంఘాల వద్దకు వచ్చి వస్త్రాలను కొనుగోలు చేస్తారన్నారు. అధికారులు ఇచ్చిన ఇండెంట్ ను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన వస్త్రాలను, ప్రస్తుత తరం అభిరుచులకు అనుగుణంగా చేనేత వస్త్రాలను తయారు చేసి ఆప్కోకు విక్రయించాలన్నారు. ఆప్కోను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు నేతన్నలపైనా ఉందన్నారు. చేనేత రెడీ మేడ్ వస్త్రాలను తయారుచేయాలని, ఇందుకు అవసరమైన శిక్షణ అందించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వెల్లడించారు.
ఆప్కోకు తొలిసారి టీటీడీ ఆర్డర్
ఆప్కో చరిత్రలో తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రూ.20 కోట్లకు పైబడి ఆర్డర్ వచ్చినట్లు మంత్రి సవిత తెలిపారు. కండువాలు, దుశ్శాలువాలు, చీరలు, దుప్పట్టాలు, బ్లౌజ్ లను టీటీడీకి అందజేయాల్సి ఉంటుందన్నారు. ఆ వస్త్రాలపై శంకు చక్రాలతో పాటు ఓం నమో వెంకటేశాయ అని ముద్రించాలన్నారు. ఆసక్తి కలిగిన ముందుకొస్తే, టీటీడీకి వస్త్రాలను తయారు చేసే అవకాశమిస్తామని మంత్రి సవిత తెలిపారు. చేనేత వస్త్రాలను ధరించేలా సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారన్నారు.
నేతన్నల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. నేతన్న భరోసా పథకం కింద రూ.25 వేల ఆర్థిక సాయం అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ, నాణ్యమైన వస్త్రాలను మాత్రమే ఆప్కో కు విక్రయించాలని స్పష్టంచేశారు. కమిషనర్ రేఖారాణి మాట్లాడుతూ, చేనేత అమ్మకాలు పెంచేలా మరిన్ని ఎగ్జిబిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ జిల్లాలకు చెందిన చేనేత సహకార సంఘాల ప్రతినిధులు తీసుకొచ్చిన చేనేత వస్త్రాలను మంత్రి సవిత పరిశీలించారు.
వాటి ధరలతో పాటు ఏయే ప్రాంతాల నుంచి తీసుకొచ్చారో అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన చేనేత సహకార సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ, పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉచిత విద్యుత్ పథకం అందజేసినందుకు కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, మంత్రులు నారా లోకేశ్, సవితకు ధన్యవాదాలు తెలియజేశారు.