– జర్నలిస్టులెవరు? జనరలిస్టులెవరు?
– పార్టీ నేతలనూ జర్నలిస్టులంటారా సామీ?
– పదవులు అనుభవించిన వారు మళ్లీ జర్నలిస్టుల అవతారమెత్తటం సిగ్గుమాలినతనమే
– ఈ దరిద్రం తెలుగు జర్నలిజానికే సొంతం
(మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘ సీనియర్ జర్నలిస్టు, ఎడిటర్ స్థాయి వ్యక్తి అయిన పూడి శ్రీహరి అక్రమ అరెస్టు అక్రమం. జర్నలిజం కూడా వ్యవస్థీకృత నేరమా? జర్నలిజాన్ని ఈరకంగా కూడా చూడవచ్చా? శ్రీహరి మీద కేసు పెట్టడమంటే అక్షరం మీద కేసు పెట్టినట్లే. ఇది జర్నలిజంపై దాడి చేసినట్లే. జర్నలిజంలో పనిచేసిన వ్యక్తి వైసీపీ మీడియా ఇన్చార్జిగా ఉండటమే నేరమా? రాజ్యాంగపరంగా మీడియాకు ఎలాంటి హక్కులుంటాయో, రాజకీయాల్లో ఉండే మీడియా కో ఆర్డినేటర్లకూ అలాంటి హక్కులే ఉంటాయి’’
– ఇదీ వైసీపీ మీడియా ఇన్చార్జి, సీఎం మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరి అరెస్టుపై.. గత రెండు రోజుల నుంచి వైకాపేయలు మీడియాలో నిర్నిరోధంగా చేసుకుంటున్న వాంతులు, రక్త విరేచనాలు. జర్నలిస్టులకు రాజ్యాంగపరంగా ఎలాంటి ప్రత్యేక హక్కులుంటాయో కూడా సెలవిస్తే బాగుండేది.
పూడి శ్రీహరి అనే వైకాపా నాయకుడు సీఎం చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి ఫొటో మార్ఫింగ్ చేయించి, దానిని సోషల్‌మీడియాలో వైరల్ చేయించారన్నది పోలీసుల ఆరోపణ.
ఆ అభియోగంపైనే పోలీసులు కేసులు నమోదు చేసి, అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. అయితే కోర్టు రిమాండ్ రిపోర్టును తిప్పికొట్టి, లీగల్‌గా వ్యవహరించాలని పోలీసులకు మొట్టికాయలు వేసింది. అంటే పోలీసులకు ఇంకా రిమాండ్ రిపూర్టు ఎలా రాయాలి? సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఎలా పాటించాలన్నది కూడా తెలియదన్నమాట. అది వేరే వ్యవహారం.
ఇప్పుడు మళ్లీ పూడి శ్రీహరిపై కేసు-అరెస్టు, దానిపై వైకాపేయుల గత్తర సంగతి చూద్దాం. వైకాపేయుల మాటల ప్రకారం పూడి శ్రీహరి అనే వ్యక్తి సీనియర్ జర్నలిస్టు. అవును. నిజమే. అదెప్పటివరకూ అంటే.. ఆయన వైసీపీ అధికార మీడియా సాక్షిలో కో ఆర్డిరేటర్గా పనిచేసినంత వరకు! ఆ తర్వాత ఆయన సీఎం జగన్‌కు సీపీఆర్ఓ అవతారమెత్తి, సర్కారు నుంచి జీతం తీసుకున్న ఒక ఉద్యోగి మాత్రమే. మరి అప్పుడు ఆయన జర్నలిస్టు ఎలా అవుతారు? ప్రభుత్వోద్యోగి మాత్రమే కదా?
పోనీ జగనన్న 11 సీట్లకు పరిమితయి, ప్రతిపక్షపాత్ర కూడా దక్కని స్థితిలో శ్రీహరి మళ్లీ ఏమైనా సాక్షిలో జర్నలిస్టు ఉద్యోగానికి వెళ్లారా అంటే అదీ లేదు. నిన్న శ్రీహరి మీడియాకు తాదాత్మ్యంతో చెప్పినట్లు.. జగనన్న ఆయన సేవలు మెచ్చి, ఆయన అంకితభావం నచ్చి, ఆత్మీయత కమ్ అభిమానంతో తనను ఈ స్థాయికి.. అంటే మీడియా ఇన్చార్జి కమ్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శికి తీసుకువచ్చారు. రైట్. మంచిదే. పైగా ‘ఉత్తరాంధ్ర కార్డు’ కూడా వాడిన శ్రీహరి, తనలాంటి వాడు ఈ స్థాయికి రావడం అరుదు అని కూడా బహు గొప్పగా చెప్పుకొచ్చారు. డబుల్ హ్యాపీసు!
మరి ఈ మొత్తం వ్యవహారంలో, పూడి శ్రీహరి మళ్లీ జర్నలిస్టుగా పనిచేస్తున్నట్లు ఎక్కడా చెప్పకపోవడమే ఆశ్చర్యం. అంటే ఆయన మాటల్లోనే చెప్పాలంటే.. శ్రీహరి జర్నలిస్టు కాదు. వైసీపీకి మీడియా ఇన్చార్జి కమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నమాట. అంటే ఫక్తు రాజకీయ నాయకుడన్నమాట. అసలు తాను జర్నలిస్టును కాదు. రాజకీయ నాయకుడినని శ్రీహరి నెత్తీనోరు కొట్టుకుని చెబుతుంటే, వైకాపేయులు మాత్రం ఆయన జర్నలిస్టు అని, జర్నలిస్టుపై జరిగిన దాడి అంటూ వాంతులు, విరేచనాలు చేసుకోవడమే వింత.
ఒక మీడియాలో పనిచేసిన జర్నలిస్టులు.. తర్వాత ఒక పార్టీకి చెందిన మీడియా విభాగంలో పనిచేస్తుంటే వాళ్లను జర్నలిస్టులంటారా? వాళ్లు పార్టీ ఆఫీసు ఉద్యోగులవుతారు కదా? అదేవిధంగా ప్రభుత్వంలో పీఆర్ఓలుగా పనిచేస్తున్న వారు కూడా జర్నలిస్టులవుతారా? వాళ్లను ప్రభుత్వ ఉద్యోగులంటారు కదా?
గత ఇరవై ఏళ్ల నుంచి తెలుగు జర్నలిజంలో ఒక గొప్ప దరిద్రం విజయవంతంగా కొనసాగుతోంది. పూర్వాశ్రమంలో జర్నలిస్టులుగా పనిచేసిన వారో, జర్నలిస్టు సంఘ నాయకులుగా పనిచేస్తున్న వారో, తర్వాత ప్రభుత్వంలో పదవులు పొంది కొత్త అవతారమెత్తుతున్నారు. వారి పదవీ కాలం ముగిసిన తర్వాత, మళ్లీ జర్నలిస్టు అవతారమెత్తుతున్నారు. అది కూడా ప్రతిపక్ష పార్టీకి చెందిన మీడియా సంస్థల్లో, ఏదో ఒక హోదాతో పాత అవతారమెత్తుతున్నారు.
మొన్నటి వరకూ ఒక ప్రభుత్వాన్ని భుజం పుండ్లు పడేలా మోసి, ఆ భుజం గాయం మానకముందే మరోపార్టీ వెనక నిలబడి మరో ప్రభుత్వాన్ని విమర్శలు చేయడాన్ని ఏమనాలి? ఒళ్లు అమ్ముకునే వారికీ- ఇలాంటి వారికీ పెద్ద తేడా ఏముందనేది బుద్ధిజీవుల సందేహం లాంటి ప్రశ్న.
అప్పటివరకూ సర్కారు కొలువు చేసి, సర్కారు సొమ్ము తిన్న జర్నలిస్టులే.. పదవి పోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీ మీడియా సంస్థల్లో చేరి, ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు, వ్యాసాలు రాయడం అలవాటయిపోయింది. ఈ దరిద్రం ఒక్క తెలుగు జర్నలిజానికే సొంతం. ఏపీ- తెలంగాణలో ఇలాంటి పొద్దుతిరుగుడుపువ్వు జర్నలిస్టుల సంఖ్య ఓ డజను దాకా ఉంటుందేమో?! ఏపీలో ఇప్పుడు కొందరు యూనిట్ మేనేజర్లు కూడా జర్నలిస్టు సంఘం నాయకుల అవతారమెత్తిన దౌర్భాగ్యం.
విచిత్రంగా పాలకులు-మంత్రులు కూడా.. ఈ పొద్దుతిరుగుడుపువ్వు జర్నలిస్టులకు-వారు నాయకత్వం వహించే జర్నలిస్టు సంఘాలకు, ఎప్పుడంటే అప్పుడు అపాయింట్మెంట్లు ఇస్తుంటారు. వారి సభలకు వెళుతుంటారు.
ఇటీవల విజయవాడలో ఒక జర్నలిస్టు సంఘం ఉత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హాజరయ్యారు. అక్కడ ఉన్న ప్రభుత్వ మాజీ సలహాదారు దేవులపల్లి అమర్‌ను చూసి.. ‘‘నువ్వేంటి ఇక్కడున్నావ్. నువ్వు పార్టీ నాయకుడివి కదా’’ అన్నారట. అంటే జగనన్న సర్కారులో తెలంగాణవాది అయిన అమర్‌కు ప్రభుత్వ సలహాదారు పదవి వచ్చింది కదా? సహజంగా పార్టీ నాయకులు-సానుభూతిపరులకే నామినేటెడ్ పదవులిస్తుంటారు. ఆ లెక్కన దేవులపల్లి అమర్ కూడా వైసీపీ నాయకుడు కాబట్టే, ఆయనకు ఆ పదవి వచ్చిందన్నది చంద్రబాబు కవి హృదయం కావచ్చు.
ఇప్పుడు ఏపీ-తెలంగాణలో ప్రభుత్వ పదవులు పొందిన జర్నలిస్టులంతా, ఆయా అధికార పార్టీ నాయకులు-సానుభూతిపరుల కిందే లెక్క. అలా కాకుండా.. మా ప్రతిభవల్లే ఆ పదవి వచ్చింది. మా ఎత్తు-పొడుగు చూసే ఆ పదవులిచ్చారు. మేం పార్టీలకు అతీతులం అనుకుంటే వారిని చూసి జాలిపడాల్సిందే. నిజంగా అలా భావించే ‘ఉత్తమ జర్నలిస్టులు’ తమ పదవులకు రాజీనామా చేయడమే ఉత్తమం. నామినేటెడ్ పదవులంటేనే పార్టీ కార్యకర్తలకు ఇచ్చేవి. మరి ఆ కోటాలో పదవులు పొందిన వారు జర్నలిస్టులవుతారా? పార్టీ కార్యకర్తలవుతారా?
పాపం చంద్రబాబుకు.. లీడర్ కమ్ జర్నలిస్టు అమర్ వైసీపీ సర్కారు నాటి సలహాదారు అవతారం చాలించి, మళ్లీ తెలంగాణలో ఒక పత్రికా సంపాదకుడి అవతారమెత్తిన విషయం తెలియకపోవచ్చు. ఆ రకంగా ముందు ప్రభుత్వ పదవులు చేసి.. మళ్లీ జర్నలిస్టు అవతారమెత్తి ముందుకుపోవచ్చన్న విషయం, ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ చంద్రబాబుకు తెలియదేమో? బహుశా ఇలాంటి సౌకర్యం మరే ఇతర రంగాలకు ఉండదన్న విషయం కూడా బాబుగు తెలియకపోవచ్చు.
జర్నలిస్టులు కూడా పొద్దు తిరుగుడు పువ్వు, అమీబా, స్టార్ఫిష్ లాంటి వాళ్లేనని, తమకు నచ్చినట్లు రూపాంతరం చెందే విచిత్రజీవులన్న విషయం తెలిసే, అమర్‌ను చంద్రబాబు ఆ మాట అన్నారా? లేక తెలియక అన్నారో తెలియదు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రెస్ అకాడెమీ చైర్మన్లు, ఆర్టీఐ కమిషనర్లుగా పనిచేసిన జర్నలిస్టులంతా.. సర్కారీ కొలువు చాలించిన తర్వాత మళ్లీ జర్నలిస్టుల అవతారమెత్తి, లోకోద్ధరణకు నడుం బిగిస్తున్న దరిద్రపు సంస్కృతి కొన్నేళ్ల నుంచి విజయవంతంగా కొనసాగుతోంది. తమకు కొలువు ఇచ్చిన పార్టీ మీడియాలో పనిచేస్తూ, ఆ పార్టీ భజనతోపాటు ప్రత్యర్ధి పార్టీని దుమ్మెత్తిపోసే పాత్రను విజయవంతంగా పోషిస్తున్న వైనం చూస్తున్నదే.
వీరుకాకుండా ఎనలిస్టు భజన సంఘాలు వేరు. ఇది అన్ని పార్టీ ప్రభుత్వాల్లోనూ కనిపిస్తున్నవే. అందుకు ఎవరూ మినహాయింపు కాదు. ఏపీ సర్కారు కూడా, కొంతమంది కుల ఎనలిస్టులకు నామినేటెడ్ పదవులిచ్చింది. ఈ తరహా విచిత్ర సంస్కృతి, మరే రంగాల్లోనూ భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. అది తెలుగు జర్నలిజానికే సొంతం.
ఇంకో విచిత్రం. ఇప్పటివరకూ ప్రెస్ అకాడెమీని వెలగబెట్టి, వెలగబెడుతున్న వారంతా ఒకే జర్నలిస్టు సంఘానికి చెందిన నాయకమ్మన్యులే! రాష్ట్రం విడిపోయిన పేర్లు మారినా అంతా ఆ తాను ముక్కలే. ఇందులో అన్ని పార్టీలకు చెందిన అనుబంధ సంఘ నాయకులుంటారు. టీడీపీలో ఒకరు, వైసీపీలో మరొకరు. టీఆర్ఎస్లో ఒకరు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల్లో మరికొందరు జర్నలిస్టు నాయకులు ఉంటారు.
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సానుభూతిపరులయిన జర్నలిస్టు నాయకులను పనుల కోసం ప్రభుత్వంపై ప్రయోగిస్తుంటారు. ఆరకంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ జర్నలిస్టు సంఘమే మెరుస్తుంటుంది. అదీ సీక్రెట్. ఎవ్వరికీ చెప్పకండి!
తెలంగాణలో అయితే సీపీఐ కోటాలో ప్రెస్ అకాడెమీ చైర్మన్ పదవి దక్కింది. మరిప్పుడు ఆయన జర్నలిస్టా? సీపీఐ నాయకుడా? కూటమి నాయకుడా? అది వేరే విషయం. ఈవిధంగా జర్నలిస్టులకు- జనరలిస్టులకు తేడా తెలియక చస్తుంటే.. మధ్యలో సీఎం రేవంత్‌రెడ్డి వచ్చి, ఎవరు జర్నలిస్టు? ఎవరు జర్నలిస్టు కాదని తేల్చమని.. ఇదే జర్నలిస్టు సంఘాల నాయకులను అడగడమే వింత. అలాకాకుండా.. ఎవరు జర్నలిస్టు? ఎవరు జనరలిస్టు? లీడర్ కమ్ జర్నలిస్టు ఎవరని తేల్చమని అడిగితే బాగుండేదేమో?!