– లోకేష్ మిత్రుడు కిలారి రాజేష్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి పట్టం
– యువగళం పాదయాత్రలో అంతా తానై నడిపించిన రాజేష్
– జగన్ జమానాలో ఆయనా ఒక బాధితుడే
– 40 ఏళ్లకే జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి
( మార్తి సుబ్రహ్మణ్యం)
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయిన మంత్రి నారా లోకేష్ మిత్రధర్మం నెరవేర్చారు. గత కొన్నేళ్ల నుంచి తన వెంట ఉండి, దన్నుగా ఉన్న మిత్రుడు కిలారి రాజేష్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి పట్టం కట్టారు. 40 ఏళ్లకే ప్రతిష్టాత్మక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన రాజేష్, వైసీపీ పాలనలో జగన్ బాధితుడు. ఆయనపై కేసులు పెట్టిన జగన్ సర్కారుపై, రాజేష్ న్యాయపోరాటం చేశారు.
దివంగత వైఎస్‌కు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ఆత్మవంటి వారన్నది తెలిసిందే. రాత్రి 8 తర్వాత వైఎస్ నిద్రలోకి వెళితే, అప్పటినుంచీ అర్ధరాత్రి వరకూ ఆయన తరఫున పార్టీ-ప్రభుత్వ వ్యవహారాలు చక్కదిద్దేది కేవీపీనే. టికెట్ల ఎంపిక నుంచి పార్టీ-ప్రభుత్వ పదవుల వరకూ కేవీపీ పాత్ర అధికం. వైఎస్‌ను కలవలేని నాయకులు, ముందు ఆయన ఆత్మ కేవీపీనే కలిసేవారు. వారు వైఎస్ వరకూ వెళ్లకుండానే వారి రాజకీయ-ఆర్ధిక అవసరాలు తీర్చేవారు.
కిలారి రాజేష్ కూడా అంతే. లోకేష్‌ను కలిసే అవకాశం లేని నాయకులు, ప్రజాప్రతినిధులు రాజేష్‌ను కలసి వినతులు ఇస్తుంటారు. ఇక రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలు, ఎమ్మెల్యేలు-నాయకుల కార్యకలాపాలపై నివేదికలిచ్చేందుకు రాజేష్ నాయకత్వంలో ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఇక సర్వే సంస్థకు చెందిన రాబిన్‌శర్మ బృందం తరచూ ఇచ్చే నివేదికలు సరేసరి. వీటిపై కసరత్తు చేసి, సంబంధిత నాయకులను పిలిపించి తగిన జాగ్రత్తలతోపాటు, హెచ్చరికలు- సూచనలిస్తూ, లోకేష్‌కు పనిభారం తగ్గించడమే రాజేష్ బాధ్యత.
ఎన్నికల ముందు లోకేష్ ప్రారంభించిన ‘యువగళం’ పాదయాత్రకు, కర్త-కర్మ-క్రియ రాజేషే. పాదయాత్రకు సమన్వయకర్తగా వ్యవహరించిన రాజేష్.. ఆ బృందంలో పనిచేసిన వారి బాగోగులతోపాటు, లోకేష్ పర్యటించబోయే నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు-వాటి వివరాలను సేకరించి, వాటిని లోకేష్‌కు అందించేవారు. అధికారం లోకి వచ్చిన తర్వాత అలా పాదయాత్రలో వివిధ బాధ్యతలు నిర్వహించిన వారికి, వివిధ మార్గాల్లో ఉదోగ-ఉపాథి అవకాశాలు కల్పించారు.
ఇప్పటివరకూ ప్రస్తుతం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు కాకుండా, ప్రజాప్రతినిధులు-నాయకులు- కొందరు పాత్రికేయులను మాత్రమే కలసి వారితో చర్చిస్తున్న రాజేష్.. ఇకపై ప్రధాన కార్యదర్శి హోదాలో, అన్ని స్థాయిల వారిని కలవడం అనివార్యమవుతుంది. లేకపోతే విమర్శలు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు.
దివంగత వైఎస్ ఆత్మ కేవీపీ సామాన్య కార్యకర్తలను సైతం కలిసేవారు. వైఎస్ బాగుకోరే వారి నుంచి సలహాలు తీసుకుని, వాటిని వైఎస్‌కు చెప్పేవారు. ఎలాగూ జిల్లాల్లో తనకున్న సొంత యంత్రాంగం ఇచ్చే సమాచారం కూడా వైఎస్‌కు అందించేవారు. ఒక్కోసారి నిఘా విభాగం అందించని సమాచారం కూడా, కేవీపీ తన సొంత నెట్వర్కుతో తెలుసుకునేవారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పుడూ అంతే. అంటే ఒక నాయకుడి ఉన్నతి కోరుకునే ఎవరయినా తమకున్న అన్ని మార్గాలూ అన్వేషిస్తారన్నమాట.
అధికారం-దండిగా వనరులు ఉన్నప్పటికీ, వైఎస్ ఎప్పుడూ పార్టీని కార్పొరేటీకరణ చేయలేదు. మానవ సంబంధాలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. ఎక్కువగా నాయకులు-కార్యకర్తలతో నేరుగానే మాట్లాడేవారు. బహుశా ఇలాంటి సంప్రదాయ రాజకీయాలు కొనసాగిస్తున్నందుకే, దేశంలో అధికారం లేకపోయినా కాంగ్రెస్ ఇంకా రాజకీయంగా సజీవంగా ఉంది.
ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయిన రాజేష్‌పై ఇలాంటి బాధ్యతలు చాలా ఉన్నాయి. యువకుడయినందున ఓపికగా వినడం, తన వద్దకు వచ్చిన వారిని గౌరవించడం వంటి లక్షణాలున్న రాజేష్‌కు.. ఇప్పుడు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులను కలవడం ఇక అనివార్యం. రిజర్వుడుగా ఉండటం కష్టం.
పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమస్యలు పరిష్కరించినా, పరిష్కరించకపోయినా ఎదుటివారు చెప్పింది శ్రద్ధగా వింటారు. అదే జగన్ తన వద్దకు వచ్చిన వారు చెప్పేది పూర్తిగా వినకుండా, మధ్యలోనే వారిపై మాటలతో ఎదురుదాడి చేసి నోరు మూయిస్తారు. తాను చెప్పిందే రైటంటారు. తనకు అన్నీ తెలుసంటారు. ఆయన బాడీ లాంగ్వేజీ చాలామంది పార్టీ నేతలకు నచ్చదు. ఇలాంటి పోకడలు ఒక్క జగన్‌కే కాదు. ఇప్పటి యువ నేతలకు బాగా అలవాటయిపోయింది. ఫొటోల కోసమే తన వద్దకు వస్తున్నారన్న భ్రమల్లో ఉంటున్నారు. కారణం వారు సమాచార సేకరణకు నియమించుకున్న ఉద్యోగుల నుంచి వచ్చే నివేదికల ప్రభావం. అయితే ఆ ఉద్యోగుల వయసు-అనుభవం ఎంతన్నది వేరే అంశం.
ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయిన రాజేష్, పార్టీ కోసం ఇంకా ఎక్కువ సమయం కేటాయించడం అనివార్యమవుతుంది. ఇకపై పూర్తిస్థాయిలో తెరపైకి రావలసి ఉంది. ఎందుకంటే రాజేష్ కంటే వయసు-అనుభవంలో చాలామంది సీనియర్లు ఉన్నప్పటికీ, వారిని కాదని ఆయనకే ప్రధాన కార్యదర్శి పదవి పట్టం కట్టారు. పైగా.. రానున్న రాజ్యసభ ఎన్నికల్లో ఆయన పేరు అభ్యర్ధిత్వానికి ప్రముఖంగా వినిపిస్తుంది. దానికి ఇది ముందస్తు రంగం కావచ్చు.
ఒకరకంగా లోకేష్‌కు సన్నిహితుడయిన రాజేష్‌కు ఈ పదవి రావడం మంచిదేనంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆయనకు సంబంధించిన విమర్శలు అనేకం ప్రచారంలో ఉన్నాయి. తెరవెనుక ఉండి పనిచేస్తూ కూడా విమర్శలు ఎదుర్కొనే బదులు, ఈవిధంగా నేరుగా ఒక హోదాతో తెరపైకొచ్చి, అందరికీ అందుబాటులో ఉండటమే సరైనదన్నది పార్టీ సీనియర్ల వ్యాఖ్య. అధికారం-అవకాశం ఉన్నప్పటికీ, రాజకీయాల్లో ఆమోదం ముఖ్యమని గుర్తు చేస్తున్నారు.
నిజానికి గతంలో కెవిపి విషయంలోనూ ఇదే జరిగింది. పార్టీ వ్యవహారాల్లో కెవిపి జోక్యం చేసుకుంటున్నారని, సీనియర్లను అవమానిస్తున్నారంటూ వీహెచ్ వంటి నేతలు, ఏకంగా మీడియాకెక్కిన సందర్భాలు లేకపోలేదు. ఆ తర్వాత ఆయనకు కేవీపీకి పార్టీ పదవి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సలహాదారు ఇచ్చిన తర్వాత ఆయనపై విమర్శలకు శాశ్వత ంగా తెరపడింది.
కాగా టీడీపీపై వైసీపీ ఎదురుదాడి- దుష్ర్పచారం ఉధృతం చేస్తున్న క్రమంలో, జగన్ మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. దానికంటే ముందే జిల్లా పర్యటనలకు వెళుతూ కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. అధికారం లేని వైసీపీ ఇప్పుడు సోషల్‌మీడియానే నమ్ముకుని, దానినే కూటమిపై అస్త్రంగా సంధిస్తోంది. నిజానికి నిర్మొహమాటంగా చెప్పాలంటే తెలుగు రాజకీయాల్లో బీఆర్ఎస్, వైసీపీ సోషల్‌మీడియా దళాలు బలంగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కొంత బలహీనంగా ఉన్న టీడీపీ సోషల్‌మీడియా వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉంది. ఎన్నికల ముందు సమరోత్సాహంతో పనిచేసి, ఇప్పుడు నాయకత్వం తీరుతో అస్త్రసన్యాసం చేసిన టీడీపీ సోషల్‌మీడియా సైనికులను బుజ్జగించి, వారిని మళ్లీ సమరానికి సన్నద్ధం చేయాల్సి ఉంది.
నాయకత్వాన్ని-నాయకులను మెప్పించే భజనపరులు-విధేయులను పక్కనపెట్టి, విషయ పరిజ్ఞానం ఉన్న వారికి సోషల్‌మీడియాలో స్థానం కల్పించాల్సిన సమయమిది. నిర్మొహమాటంగా వాస్తవాలు వెల్లడించే వారిని ప్రోత్సహించాల్సిన సమయమిది. ఇందులో జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయిన కిలారి రాజేష్ ఎంతవరకూ సక్సెస్ అవుతారన్నది, ఆయన సమర్థత మీద ఆధారపడి ఉంది. అందులో ఆయన సక్సెస్ కావాలని ఆశిద్దాం.