Suryaa.co.in

Editorial

ఇంతకీ టీడీపీ జాతీయ పార్టీనా? ప్రాంతీయ పార్టీనా?

– ఈసీ జాబితాలో జాతీయ హోదా కోల్పోయిన టీడీపీ
– తెలంగాణలో టీడీపీ పోటీ చేయవచ్చా?
– మరి చంద్రబాబు-లోకేష్ హోదాలు మార్చుకుంటారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలుగుదేశం ఇక జాతీయ పార్టీ ఎంతమాత్రం కాదు. అది కేవలం ప్రాంతీయ పార్టీనే అని జాతీయ ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దీనితో ఇప్పటిదాకా జాతీయ పార్టీ హోదాతో మూడు రకాల పదవులు ప్రకటించిన టీడీపీ నాయకత్వం.. ఈసీ తాజా స్పష్టీకరణతో తమ హోదాలు మార్చుంటుందా? జాతీయ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన తనయుడు లోకేష్ తమ హోదాలు మార్చుకుంటారా? అన్నింటికీ మించి.. తెలంగాణ రాష్ట్రంలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో, టీడీపీ సైకిల్ గుర్తుతోనే బరిలోకి దిగుతుందా? అన్న ప్రశ్నలు ఆసక్తికలిగిస్తున్నాయి.
టీడీపీకి ప్రాంతీయ పార్టీ హోదా మాత్రమే ఉందని ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో, టీడీపీ రాజ్యాంగం కూడా మార్చుకోవలసిన అవసరం వచ్చింది. ఇప్పటివరకూ ఏపీ- తెలంగాణ రాష్ట్రాలకు అచ్చెన్నాయుడు, బక్కని నర్శింహులు అధ్యక్షులుగా.. చంద్రబాబునాయుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు, లోకేష్ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ సెంట్రల్ ఆఫీసుగా, మంగళగిరిలో ఉన్న ఆఫీసు ఏపీ ప్రధాన కార్యాలయంగా పరిగణిస్తున్నారు. జాతీయ పార్టీకి విడిగా కమిటీ కూడా ఏర్పాటుచేశారు. తాజా ఈసీ స్పష్టీకరణతో.. టీడీపీ ప్రాంతీయ పార్టీగా మిగిలిపోయిందున, చంద్రబాబునాయుడు హోదా కూడా మారుతుందా? లేదా? అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది.
నిజానికి ఎలక్షన్ లా సెక్షన్ 4 (బి) ప్రకారం.. జాతీయ పార్టీగా పరిగణించాలంటే ఆ పార్టీకి ఒక రాష్ట్రంలో ఒక ఎంపీ, రెండు రాష్ట్రాల్లో ఇద్దరేసి ఎమ్మెల్యేలు ఉండి తీరాలి. లేదా రాష్ట్రంలో పోలయిన ఓట్లలో 5 శాతం మించి ఓట్లు రావాల్సి ఉంది. లేదా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 48 శాతం ఓట్లు రావాల్సి ఉంటుంది. ‘‘ప్రస్తుతం తెలంగాణలో సాంకేతికంగా ఆ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలున్నప్పటికీ, వారు టీఆర్‌ఎస్‌లో చేరారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. కేవలం ఏపీలో ఎంపీలు, ఎమ్మెల్యేలున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ సైకిల్ మీద పోటీ చేయాలంటే, సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఈసీ నిబంధనలు ఎవరైనా పాటించాల్సిందే’’ అని ఈసీ అంశాలపై వాదించే సుప్రీంకోర్టు తెలుగు న్యాయవాది గల్లా సతీష్ స్పష్టం చేశారు.
ఈసీ తాజా జాబితాపై ఆయనను వివరణ కోరినప్పుడు.. వరసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, ఒక రాజకీయ పార్టీకి జాతీయ లేదా రాజకీయ పార్టీ గుర్తింపు రద్దవుతుందని వివరించారు. ఈసీ నిబంధనల ప్రకారం వైసీపీ కూడా జాతీయ పార్టీ కాదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం తాజా స్పష్టీకరణ నేపథ్యంలో, ఇకపై టీడీపీ జాతీయ పార్టీ అని అధికారికంగా ప్రక టించుకోవడం కుదరదని, ఆవిధంగా ప్రకటించుకున్నా తప్పేనని గల్లా సతీష్ చెబుతున్నారు. అంటే సాంకేతికంగా టీడీపీ ఇకపై… ఎన్నికల సంఘంతో జరిపే ఉత్తరప్రత్యుత్తరాలలో, జాతీయ పార్టీ లెటర్‌హెడ్ వాడినా ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించారు. ప్రధానంగా తెలంగాణలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో, టీడీపీకి సైకిల్ గుర్తుపై పోటీ చేసే అవకాశం రాకపోవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
అయితే ఈసీ నిర్ణయం టీడీపీపై ఎలాంటి ప్రభావం చూపదని ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ స్పష్టం చేశారు. తాజా వివాదంపై ఆయన వివరణ కోరినప్పుడు.. ‘‘ఈసీ నిబంధనల ప్రకారం వచ్చే ఓట్ల నిష్పత్తిని దృష్టిలో ఉంచుకునే దానికి జాతీయ-ప్రాంతీయ పార్టీల హోదా లభిస్తుంది. ఆ ప్రకారమే బ్యాలెట్ పేపర్‌పై జాతీయ ,ప్రాంతీయ,గుర్తింపుపొందిన పార్టీ అభ్యర్ధులకు ప్రాధాన్యం ఇస్తాయి. టీడీపీకి జాతీయ పార్టీ హూదా లేకపోయినా, తెలంగాణలో అదే సైకిల్ గుర్తుతో పోటీ చేయవచ్చు. యుపీలో సమాజ్‌వాదీ పార్టీకి అదే గుర్తు ఉన్నందున, అక్కడ మాత్రం టీడీపీ సైకిల్ గుర్తుతో పోటీ చేయలేదు. అదేవిధంగా ఒక ఈశాన్య రాష్ట్రంలో బీఎస్పీ ఏనుగు గుర్తుతో పోటీ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీకి ఆ గుర్తు కేటాయించబడింది. ఇప్పుడు మజ్లిస్ పార్టీ ‘కైట్’ గుర్తుతోనే యుపి, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పోటీచేసింది. కాబట్టి టీడీపీ కూడా తెలంగాణలో సైకిల్ గుర్తుతోనే పోటీ చే యవచ్చు. గతంలో టీఆర్‌ఎస్, ప్రజారాజ్యం, మొన్న జనసేన కూడా అవే గుర్తులతో రాష్ట్రమంతా పోటీచేసిన విషయాన్ని మర్చిపోకూడద’ని జంధ్యాల రవిశంకర్ విశ్లేషించారు.
సాంకేతిక కారణాలు, ప్రత్యర్ధి పార్టీలకు ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా చూడాలంటే.. టీడీపీ తన పార్టీ రాజ్యాంగాన్ని సవరించుకోవడం అనివార్యంగా కనిపిస్తోంది. ఇటీవల వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ తనదేనని సీఈసీకి ఫిర్యాదు చేసిన బాషా.. జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ, ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’ లెటర్‌హెడ్ మాత్రమే వాడుకోవాలని వాదించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారంగా.. రాజకీయ పార్టీలు చేసే చిన్న పొరపాట్లు కూడా సీఈసీ వద్ద వివాదమవుతుంటాయి. అంటే భవిష్యత్తులో ఎవరైనా టీడీపీ జాతీయ పార్టీ లెటర్‌హెడ్, జాతీయ పార్టీ కార్యవర్గంపై ఎవరు ఫిర్యాదు చేసినా దానిపై రచ్చ తప్పదన్నమాట. సహజంగా ప్రతి రాజకీయ పార్టీ దాని సభ్యత్వ వివరాలు, కమిటీ జాబితాను ప్రతి ఏటా సీఈసీకి సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా మార్చి 31 లోగా లెక్కలు సమర్పించాల్సి ఉంది. ఆ లెక్కన.. నిబంధనలకు విరుద్ధంగా జాతీయ పార్టీ పేరుతో టీడీపీ నియామకాలు చేసిందని, ప్రత్యర్ధి పార్టీ ఏదైనా ఫిర్యాదు చేస్తే తలనొప్పులు తప్పవని న్యాయవాదులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఏపీ పార్టీ అధ్యక్షుడిగా ఉంటారా? తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఉంటారా? ఒకవేళ ఆయన ఒక రాష్ట్ర అధ్యక్షుడిగానే పరిమితమయితే ఏ రాష్ట్రాన్ని ఎంచుకుంటారు? మరి అలాంటి నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడున్న జాతీయ పార్టీ కమిటీలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తారా? అసలు ఇకపై కేంద్రం, జాతీయ స్థాయిలోని రాజ్యాంగ సంస్థలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలపై జాతీయ పార్టీ లెటర్ హెడ్ వాడతారా? లేదా? అన్న ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.
కమ్యూనిస్టుపార్టీల జాతీయ హూదాపై పిల్ వేస్తా
కాగా గత రెండున్నర దశాబ్దాల నుంచి అసలు దేశంలో సాంకేతికంగా.. రాజకీయ ఉనికి లేని ఉభయ కమ్యూనిస్టుపార్టీలకు, జాతీయ పార్టీ హోదా కొనసాగించడం ఎలక్షన్ లాను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు న్యాయవాది గల్లా సతీష్ స్పష్టం చేశారు. తాను దీనిపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. ‘‘రెండు రాష్ట్రాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు గానీ, ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో 48 శాతం ఓట్లుగానీ, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఎంపీగానీ ఉన్న పార్టీలనే జాతీయ పార్టీగా పరిగణించాలని ఎలక్షన్ లా సెక్షన్ 4(బి) స్పష్టం చేస్తుంది. మరి సీపీఎం-సీపీఐ పార్టీలకు ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు, ఎంపీ నియోజకవర్గంలో 48 శాతం ఓట్లు వచ్చాయా? మరి రానప్పుడు వాటికి జాతీయ పార్టీ హోదా ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు? కేవలం రిక్వెస్ట్ లెటర్ల ఆధారంగా జాతీయ పార్టీ హోదా ఇస్తారా? రేపు అన్ని పార్టీలూ ఇదేవిధంగా రిక్వెస్ట్ లెటర్లు పెడితే వాటికీ జాతీయ హోదా ఇచ్చేస్తారా? ఇది తాను చేసిన చట్టాన్ని తానే బ్రేక్ చేయడమే అవుతుంది. అసలు ఎన్నిపార్టీలు ప్రతి ఏటా వార్షిక నివేదికలు సమర్పిస్తున్నాయి? ఈ దేశంలో మొదట కాంగ్రెస్, జనతా, కమ్యూనిస్టులు మాత్రమే గుర్తింపుపొందిన రాజకీయ పార్టీలు. కానీ కమ్యూనిస్టులు రెండుగా చీలిన తర్వాత, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా.. ఈసీ నిబంధనల మేరకు ఓట్లుగానీ సీట్లుగానీ సంపాదించుకోకపోయినా, వాటికి జాతీయ పార్టీ గుర్తింపు ఎలా ఇస్తారన్నది ప్రశ్న. దీనినే నేను సుప్రీంకోర్టుకు వెళ్లనున్నాను’ అని గల్లా సతీష్ వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE