Suryaa.co.in

Editorial

విజయసాయికీ..‘జాకా’ హోదా లేనట్టే!

( మార్తి సుబ్రహ్మణ్యం)
ప్రతిరోజూ రచ్చబండలో సొంత పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న యుశ్రారైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఇది నిరాశ-నిస్పృహ కలిగించే వార్త. ఇకపై ఆయనకు విజయసాయిరెడ్డిని ‘ మా జాకా గారు’ అని సంబోధించే అవకాశం ఎంతమాత్రమూ లేదు. ఎందుకంటే.. ఎన్నికల సంఘం టీడీపీతో పాటు, వైకాపాను సైతం ప్రాంతీయ పార్టీల జాబితాల్లో చేర్చింది కాబట్టి. తమ పార్టీ జాతీయ కార్యదర్శి అయిన విజయసాయిరెడ్డిని ఆయన తరచూ ‘జాకా గారు’ అంటూ వ్యంగ్యంగా సంబోధిస్తుంటారు. ఇకపై రాజుగారికి అలాంటి అవకాశం లేదు మరి!
ఏపీలో టీడీపీతోపాటు, వైకాపా కూడా ప్రాంతీయ పార్టీలే తప్ప, జాతీయ పార్టీలు కావని సీఈసీ స్పష్టం చేసింది. నిజానికి రెండు తెలుగురాష్ట్రాల్లో ఇప్పటిదాకా టీడీపీ మాత్రమే, జాతీయ పార్టీగా క్లెయిము చేసుకుంటోంది. మీడియాలో కూడా చంద్రబాబునాయుడును జాతీయ అధ్యక్షుడుగానే పరిగణిస్తుండగా, ఆ పార్టీ జాతీయ కమిటీలోని నేతలు పెట్టే ప్రెస్ కాన్ఫరెన్సుల్లో కూడా వారిని, జాతీయ పార్టీ నేతలుగానే సంబోధిస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. ఇప్పుడు టీడీపీ జాతీయ పార్టీ కాదని సీఈసీ స్పష్టం చేసిన నేపథ్యంలో, మరి హోదాలు కూడా మారతాయో లేదో చూడాలి.
ఇక వైసీపీ కూడా టీడీపీ మాదిరిగానే జాతీయ పార్టీగానే ఫీలవుతుంటుంది. కానీ కార్యకలాపాలు మాత్రం ఏపీకే పరిమితం. తెలంగాణలో ఆ పార్టీకి శాఖ ఉన్నప్పటికీ అది మనుగడలో లేదు. పార్టీ అధ్యక్షుడే పార్టీ మారిపోయారు. టీడీపీ మాదిరిగానే, వైసీపీకి చెందిన ఎంపీ కూడా గతంలో కారెక్కారు. అయినా స్పీకర్‌కు ఫిర్యాదు చేయలేదు. అది వేరే విషయం. నిజానికి వైసీపీ అధినేత జగన్‌ను జాతీయ పార్టీ అధ్యక్షుడిగా, సొంత మీడియా సాక్షి కూడా ఎప్పుడూ పరిగణించలేదు. కానీ, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిని మాత్రం జాతీయ కార్యదర్శిగానే పరిగణిస్తోంది. ఆ మేరకు ఆయన ఇచ్చే ప్రకటనల్లో కూడా అదే హోదాతో పరిగణిస్తున్నారు. పార్లమెంటుకు సంబంధించిన వ్యవహారాలు గానీ, జాతీయ స్థాయి వ్యవహారాల్లో గానీ విజయసాయిరెడ్డిని జాతీయ కార్యదర్శిగానే పరిగణిస్తున్నారు. రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలన్న లేఖ సందర్భంలో కూడా, విజయసాయిరెడ్డిని జాతీయ కార్యదర్శిగానే పరిగణించారు.
అటు రఘురామకృష్ణంరాజు కూడా విజయసాయిపై, ‘జాకా’ అంటూ షార్ట్‌కట్‌తో పిలుస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఓ సందర్భంలో మీడియా ఈ జాకా ఎవరుసార్? అని అడిగితే.. ‘‘అయ్యో అదేంటండీ మీకు తెలియదా? మా జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి గారు ’’ అంటూ మరో విరుపు విరిచేశారు. సో… తాజా పరిణామాల నేపథ్యంలో, రఘురామకృష్ణంరాజుకు ఇకపై విజయసాయిని ‘జాకా’ అని ప్రేమగా పిలిచే అవకాశం లేనట్టే. రాజు గారి ఉత్సాహంపై సీఈసీ బ్రేకులు వేసి, ‘ఆ విధంగా ముందుకు వెళ్లింద’న్నమాట!

LEAVE A RESPONSE