Suryaa.co.in

Editorial

హ్హి హ్హి హ్హి… జగనన్న జ్ఞానసంపద చూడతరమా?

-ఉల్లిగడ్డకి బంగాళాదుంపకి తేడా తెలియదు… నీ దుంపతెగ.. మా కొంపలు కూల్చేస్తున్నావ్
– పొటాటో అంటే ఉల్లిగడ్డలట
– జగనన్న జ్ఞానాన్ని వెక్కిరించిన చంద్రబాబు
– వీడిదుంపతెగ మా కొంపలు కూల్చేస్తున్నావంటూ బాబు వ్యంగ్యాస్త్రాలు
– బంగాళాదుంప-ఉల్లిగడ్డకూ తేడా తెలియదా సారూ?
– సోషల్‌మీడియాలో పేలుతున్న సెటైర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ సీఎం జగన్మోన్‌రెడ్డి ఒక విజ్ఞానఖని. విజ్ఞాన భాండాగారం. కన్యాశుల్కంలో గిరీశం చెప్పినట్లు.. తనతో మాట్లాడటమే ఒక నాలెడ్జ్. అంటే జగనన్నతో మాట్లాడమే కాదు. ఆయన మాట్లాడితేనే ఒక నాలెడ్జ్. అన్నియ్య జ్ఞాన సంపద అపూర్వం.. అద్భుతం.. అనితర సాధ్యం.. అనన్య సామాన్యం! నో బడీ కెన్ రీచ్ హిమ్! జ్ఞానసంపదలో ఆయనను అధిగమించడం అసాధ్యం. దేశంలోని సీఎంలందరికంటే అన్నయ్య విజ్ఞానం అద్భుతం.

జ్ఞానసరస్వతి ఆయన నాలికపై నడయాడుతుంటుంది. ఇక విజ్ఞానమైతే ఆయన వెన్నంటే ఉంటుంది. ఆంగ్రేజీకి తెలుగుపదాలు అద్దిన బ్రౌను దొర సైతం అన్నయ్య ముందు బలాదూరే! లేకపోతే ‘పొటాటో అంటే ఉల్లిగడ్డనే అంటరు కదా’ ‘‘బంగాల.. ఆ

బంగాలదుంపనా? ఆ.. ఒక కేజీ బంగాళదుంప’’ అని ఉల్లిగడ్డ కమ్ బంగాళదుంపకు, సరికొత్త భాష్యమిచ్చిన సీఎం, ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? ఎప్పుడైనా కన్నారా? నో నెవ్వర్! మహేష్‌బాబు చెప్పినట్లు.. నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్!!

ఇవన్నీ జగనన్ననంటే పడనివాళ్లు చేస్తున్న కామెంట్లు కావండోయ్. సీఎం జగన్మోహన్‌రెడ్డి విజ్ఞానంపై, సోషల్‌మీడియాలో లక్ష్మీబాంబులా పేలుతున్న సెటైర్లు. ఇంతకూ విషయేమిటంటే.. తుఫాను బాధితులకు సర్కారు చేసే సాయం గురించి, జగన్మోహన్‌రెడ్డి అధికారులు కమ్ బాధితులతో కలిపి ఒక సమావేశం నిర్వహించారు. అందులో ఒక కేజీ బంగాళదుంప ఉచితంగా ఇస్తామనేందుకు, జగనన్న నానా పాట్లు పడ్డారు. ముందు దానిని ఆనియన్.. అంటే.. ఉల్లిగడ్డ అని, దానికి పొటాటోగా కొత్త పేరు పెట్టారు. పక్కనున్న అధికారులు సర్దిచెప్పడంతో.. బంగాళదుంప అని నాలుక్కరుచుకున్నారు. ఆ పేరు కూడా సరిగా పలకలేకపోయారు. దీనితో దుర్మార్గ సోషల్‌మీడియాలో జగనన్న పాపం ట్రోలింగుకు దొరికిపోయారు.

‘‘కూరగాయల పేర్లు కూడా తెలియని సీఎం ఉండటం మా ఖర్మ’’ అని కొందరు.. ‘‘ముందు కూరగాయల పేర్లు తెలుసుకుని వస్తే సరిపోయేది కదా? కావాలంటే లక్ష్మీపార్వతిని అడిగినా చెప్పేది కదా’ అని ఇంకొందరు… ‘‘పొటాటోకు ఆనియన్‌కు తేడా తెలియని సీఎం మన రాష్ట్రానికి ఉండటం అందరి దౌర్భాగ్యం’’ అంటూ మరికొందరు తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.

‘‘అట్లా వదిలేయకండ్రా.. ఎవరికైనా చూపించండ్రా’’ అంటూ రావు రమేష్ డైలాగులు, ‘‘ఎప్పటినుంచి నీకు అలా అనిపిస్తుంది’’ అన్న పాత సినిమా డైలాగులు.. ‘‘పిచ్చోడిని వింటమే గానీ లైవ్‌లో ఎప్పుడూ చూడలేద’’న్న బ్రహ్మానందం డైలాగులు, సోషల్‌మీడియాలో సీమటపాకాయ్ మాదిరిగా తెగ పేలిపోతున్నాయి.

సరిగ్గా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా దీనిపై వ్యంగ్యాస్త్రం సంధించిన వీడియో, యమా ఫాస్టుగా వైరల్ అవుతోంది. ‘‘ ఈరోజే చూశా. అడుగుతున్నాడు. పొటాటో అంటే ఏంటని. అడిగితే ప్రజలు నేర్పిస్తున్నారు అది బంగాళాదుంప అని. దీని దుంపతెగ. మా

కొంపలు కూల్చేస్తున్నావ్. ఏమీ తెలియకుండా. ఒకటే చేస్తున్నావ్. తప్పుడు పనులు చేయడం తప్ప ఏమీ తెలియని ముఖ్యమంత్రి’’ అంటూ జగన్మోహన్‌రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన వీడియో, సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సహజంగా వ్యంగ్య ప్రసంగాలు చేయని చంద్రబాబు కూడా, జగనన్న జ్ఞానం కమ్ విజ్ఞానంపై ఒంటికాలితో విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు టాక్ ఆఫ్ ది ఏపీ!

LEAVE A RESPONSE