– తీర్పుపై తెలుగుదేశం రెండంచల వ్యూహం
– బాబు బయటకు వస్తే భవిష్యత్తుకు గ్యారంటీ’ కొనసాగింపు
– రాకపోతే లోకేష్ కొనసాగించే యోచన
– బాబు అరెస్టుతో గుండెలాగిన కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ
– వారానికి మూడు కుటుంబాలను పరామర్శించేలా షెడ్యూల్
– పార్టీ కార్యక్రమాల్లో మరింత వేగం
– బాబు అరెస్టు తర్వాత వైసీపీకి అవకాశం ఇవ్వకూడదని నిర్ణయం
– అరెస్టుల సమయంలో తమ వ్యూహాలు అమలుచేస్తున్న వైసీపీ
– అలాంటి అవకాశం వైసీపీకి ఇవ్వకూడదని టీడీపీ నిర్ణయం
– పార్టీ నేతల భేటీలో కీలక నిర్ణయాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
టీడీపీ అధినేత-మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతర పరిణామాలు.. పార్టీ భవిష్యత్తు కార్యక్రమాల కొనసాగింపుపై, ద్విముఖ వ్యూహం అనుసరించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఆ ప్రకారంగా.. సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబునాయుడు బయటకు వస్తే ఒక వ్యూహం.. రాకపోతే మరొక వ్యూహం అమలుచేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగా చంద్రబాబు భార్య భువనేశ్వరి, ఇకపై జనంలోకి వెళ్లేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం… స్కిల్ కేసులో అరెస్టయి, గత 40 రోజుల నుంచి రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు ఆదేశాల ప్రకారం.. టీడీపీ నాయకత్వం ద్విముఖ వ్యూహానికి తెరలేపింది. చంద్రబాబునాయుడుకు అనుకూలంగా తీర్పు వస్తుందని, పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. ఆ మేరకు సుప్రీంకోర్టులో పార్టీ న్యాయవాదుల వాదనలు, జడ్జిల వ్యాఖ్యలను పరిశీలించిన సీనియర్లు.. తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ తీర్పు రావడం ఆలస్యమైతే.. ప్రజల్లోకి వెళ్లే మార్గాలపై పార్టీ నాయకత్వం, రెండవ వ్యూహం అమలు చేయాలని నిర్ణయించింది.
అందులో భాగంగా.. చంద్రబాబు అరెస్టు వార్తతో అనేకమంది గుండెలు ఆగి మరణించారు. వారి కుటుంబాలను పరామర్శించేందుకు, బాబు భార్య భువనేశ్వరి స్వయంగా వెళ్లాలని భావిస్తున్నారు. వారానికి మూడు కుటుంబాలను పరామర్శించి, వారి ధైర్యం చెప్పాలని భావిస్తున్నారు. పార్టీ పక్షాన వారికి కొంత ఆర్ధిక సాయం అందించాలని భావిస్తున్నారు. నిజానికి ముందు లోకేష్‌తో ఈ పరామర్శ కార్యక్రమం నిర్వహించాలనుకున్నా, తర్వాత ఆ నిర్ణయం మార్చుకున్నారు. బాబు అరెస్టు తర్వాత లీగల్ వ్యవహారాలను స్వయంగా ఆయనే చూసుకుంటున్నందున, భువనేశ్వరి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దానితోపాటు.. రాష్ట్రంలో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో భువనేశ్వరి పర్యటిస్తే బాగుంటుందన్న సూచన వ్యక్తమయింది.
ఇక చంద్రబాబు గతంలో నిర్వహించిన ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ ప్రచార కార్యక్రమాన్ని, యువనేత లోకేష్ కొనసాగించాలని భావిస్తున్నారు. చంద్రబాబు జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత, తిరిగి పాదయాత్ర కొనసాగించాలని.. ఆలోగా చంద్రబాబు అరెస్టుతో నిలిచిపోయిన ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమాన్ని లోకేష్‌తో కొనసాగిస్తే, సానుకూల ఫలితాలు వస్తాయని పార్టీ నాయకులు సూచించినట్లు తెలుస్తోంది.
ఇక చంద్రబాబు అరెస్టు తర్వాత పార్టీ క్యాడర్లో నెలకొన్న గందరగోళం, అనిశ్చితిని వైసీపీ సొమ్ము చేసుకుంటుందని గ్రహించిన పార్టీ నాయకత్వం.. ఇకపై వైసీపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించింది. ఓట్ల ప్రక్రియ, దొంగఓట్ల తొలగింపు, టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపులో పార్టీ యంత్రాంగం బిజీగా ఉన్న సమయంలో, చంద్రబాబు అరెస్టు జరిగింది. దీనితో స్థానిక పార్టీ యంత్రాంగం.. అటు నిరసన కార్యక్రమాలు, ఇటు పోలీసులతో పోరాటాలకు సమయం కేటాయిస్తున్నారు. దీనితోనే వారి సమయం సరిపోతోంది. ఫలితంగా ఓట్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. దానితో పార్టీలో ఉన్న అనిశ్చితి-క్యాడర్ బిజీని గమనించిన వైసీపీ.. తన అజెండాను అమలుచేస్తోందని పార్టీ నాయకత్వం గ్రహించింది. దానితో ఇక ఎక్కడికక్కడ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, క్యాడర్లో మళ్లీ చైతన్యం తీసుకురావాలని నాయకత్వం నిర్ణయించింది.