Suryaa.co.in

Editorial

హలో ఏపీ.. బైబై వైసీపీ

– టీడీపీ విజయతాండవం
– ఫ్యాన్ తునాతునకలు
– వికసించిన ‘కమలం’
– మెరిసిన ‘గ్లాసు’
– టీడీపీకి ఒంటరిగానే 136 సీట్లు
16 లోక్‌సభ స్థానాల్లో గెలుపు
– 10తో సరిపెట్టుకున్న వైకాపా
– 4 లోక్‌సభ స్ధానాల్లో గెలుపు
– 21కి 21 సీట్లు గెలిచేసిన జనసేన
– 2 లోక్‌సభ స్థానాల్లో విజయం
– బీజేపీకి 8 అసెంబ్లీ, 3 లోక్‌సభ
( మార్తి సుబ్రహ్మణ్యం)

విధ్వంసం ఎలా ఉంటుంది?.. ఊచకోత ఎలా ఉంటుంది?.. భూకంపం ఎలా ఉంటుంది?.. సునామీ ఎలా ఉంటుంది?.. ప్రళయం ఎలా ఉంటుంది?.. మహోత్పాతం ఎలా ఉంటుంది?..కంటికి కనిపించని భూతం విరుచుకుపడితే ఎలా ఉంటుంది? వందటన్నుల ఆటంబాబు ఒక్కసారి ఒక్కచోటనే పేలితే ఎలా ఉంటుంది? పిడుగులన్నీ కూడబలుక్కుని ఒకే చోట గర్జిస్తే ఎలా ఉంటుంది? ప్రశాంతంగా సాగే ప్రయాణంలో ల్యాండ్‌మైన్ పేలితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే.. ఏపీలో ప్రజాగర్జనలా ఉంటుంది. ఎన్డీయే కూటమి రూపంలో, ప్రత్యర్ధి వైసీపీపై విరుచుకుపడిన జనసునామీలా ఉంటుంది. అవును ఇదో ప్రజావిప్లవం. ఇదో ఉవ్వెత్తున పడిలేచిన చైతన్య కెరటం. జనపెనుగర్జనకు వైసీపీ ‘ఫ్యాను’ తునాతునకలయిన సందర్భం. అన్ని వర్గాలూ ఒక గొంతుకతో కూటమిని నినదిస్తూ గర్జించిన సమయం. ఐదేళ్ల జగన్ నియంత పాలనకు ముసుగేసి, రోడ్డుమీద నిర్దయగా ఈడ్చుకెళ్లిన తిరుగుబాటుకు నిలువెత్తు సంకేతం.

అవును.. బ్రహ్మాండం బద్ధలయిదంటామే. ఏపీలో నిజంగా అదే జరిగింది. 151 స్థానాల తిరుగులేని బలంతో విర్రవీగి.. ప్రజాస్వామ్యాన్ని పరిహసించి… అంబేద్కర్ రాజ్యాంగానికి పాతరేసి.. రాజారెడ్డిస్వామాన్ని స్థాపించి.. వికృత వికటాట్టహాసంతో జనాలను వేధించిన, నయా పులకేసి జగన్మోహన్‌రెడ్డి పాలనను ప్రజలు నిలువుపాతరేశారు. ఒకప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకే సాహసించని టీడీపీని ప్రజలు నెత్తినపెట్టుకున్నారు. ఫలితాలు వెలువడినప్పటి నుంచీ కూటమి ప్రభంజనం సునామీలా వెల్లువెత్తింది. ఆరా మస్తాన్, పరిపూర్ణానంద స్వామి, వేణుస్వామి, ప్రోఫెసర్ నాగేశ్వర్, తెలికెపల్లి రవి, జకీర్, ప్రసాద్ అండ్ అదర్స్ చెప్పినట్లు వైసీపీకి 120 సీట్లు కాదు కదా.. కనీసం 12 కూడా దక్కకపోవడమే విషాదం. పోనీ సజ్జల చెప్పినట్లు ‘మా సెక్షన్ ఆఫ్ ఓటర్స్’ వేరనుకున్నా.. ఆ సెక్షన్ వాళ్లు ఓటు వేసినందుకే, వైసీపీకి ఈ మాత్రం సీట్లయినా దక్కి ఉండాలి.

జగన్ స్వయంగా వేదనాభరిత హృదయంతో చెప్పినట్లు.. అటు పథకాలు తీసుకున్న అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు కూడా జగనన్నకు ఓటేయలేదు. అంటే దీన్నిబట్టి ప్రజలు జగన్ పాలనపై ఎంత కసితో ఓటేశారో సుస్పష్టం. సూటిగా చెప్పాలంటే జగన్ నియంత పాలనను బండకేసి బాదారు. ఆరా మస్తాన్ చెప్పినట్లు.. బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వారంతా టీడీపీకి మాత్రమే ఓట్లు వేయకుండా, వైసీపీకి ఓటు వేసినట్లయితే కనీసం 20 సీట్లయినా దక్కి ఉండాలి కదా? వీరంతా జగనన్న కళ్లలో ఆనందపు మెరుపుల కోసమే.. ‘స్వకుచమర్దన కమ్ పరకుచమర్దన’ చేసుకున్నట్లు స్పష్టమయింది.

ఇక టీడీపీ 135 అసెంబ్లీ-16 లోక్‌సభ స్థానాల్లో విజయదుందిభి మోగించింది. వైసీపీ 11 అసెంబ్లీ-4 లోక్‌సభ స్థానాలతో సంతృప్తి చెందింది. ఇక జనసేన తాను పోటీ చేసిన 21 స్థానాల్లో 100 శాతం విజయంతో 21 అసెంబ్లీ స్థానాలతోపాటు, 2 లోక్‌సభ సీట్లు కైవసం చేసుకుంది. 10 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 8 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. జగన్ క్యాబినెట్‌లోని మంత్రులు ఇంటిబాట పట్టగా.. ఐదేళ్లపాటు టీడీపీపై నోరుపారేసుకున్న మంత్రులు-మాజీ మంత్రులకూ పరాభవం తప్పలేదు. ప్రధానంగా ఎగిరిపడిన వంశీ, కొడాలి నాని, రోజా, స్పీకర్ తమ్మినేని సహా ప్రముఖులంతా ఓటమిపాలయ్యారు. జగన్‌కు తన పులివెందులలో మెజారిటీ తగ్గటం విశేషం.

టీడీపీ-జనసేన-బీజేపీకి చెందిన కొందరు అభ్యర్ధులు ఖాయంగా ఓడిపోతారన్న అంచనా ఆయా పార్టీలలో ఉండేది. ఉదాహరణకు ఎచ్చెర్ల, తుని, నరసరావుపేట, కడప వంటి స్థానాల్లో కూటమి అభ్యర్ధులు గెలవరన్న భావన సొంత పార్టీ శ్రేణుల్లోనూ ఎన్నికల ముందు వరకూ బలంగా ఉండేది. ఫలితాల్లో వారు సైతం విజయఢంకా మ్రోగించారంటే..ఓటర్లు జగన్ పాలనపై ఎంత విరక్తి చెందారో.. చంద్రబాబునాయుడు పాలన కోసం, ఎంత తపించారో స్పష్టమవుతుంది.

ఈ ఫలితాలు పరిశీలిస్తే అన్ని వర్గాలు కూటమికే జైకొట్టి, జగన్‌కు ఝలక్ ఇచ్చిన ట్లు కనిపించింది. వైసీపీకి సీట్లు రాకపోయినా, 40 శాతం ఓట్లు రావడం బట్టి.. క్రైస్తవ, మాల వర్గాలు ఆ పార్టీ వెంట ఉన్నట్లు స్పష్టమయింది. లేకపోతే అన్ని శాత ం ఓట్లు రావడం కష్టం. విచిత్రంగా ఈసారి టీడీపీలోని రెడ్ల అభ్యర్ధులలో ఎక్కువశాతం విజయం సాధించడం బట్టి.. రెడ్లు కూడా జగన్‌కు ఝలక్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.

LEAVE A RESPONSE