సలహాదారు పదవికి మురళీ రాజీనామా?

– తెలంగాణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే యోచన
– బీఎస్పీలో క్రియాశీలపాత్ర పోషించే అవకాశం?
– ఏపీలో నాడు-నేడు పథకంలో కీలకపాత్ర
– ముక్కుసూటి అధికారిగా పేరు
– అగ్రకులాలు, బయటవారికే కీలక పోస్టింగులని విమర్శ
– కేసీఆర్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన తొలి ఐఏఎస్‌గా పేరు
– పదవిలో ఉండగనే రాజీనామా చేసి సంచలనం
– కాళేశ్వరం ప్రాజెక్టు తెరవెనుక రహస్యాలు బయటపెట్టిన మురళీ
– ఏపీలో సలహాదారు పదవి ఇక పొడిగింపు కోరకూడదని నిర్ణయం
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ క్యాడర్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి, ప్రస్తుత ఏపీ ప్రభుత్వంలో నాడు-నేడు పథకానికి సలహాదారయిన ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేయనున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఆరంగేట్రం చేసే లక్ష్యంలో భాగంగానే ఆయన, తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. మురళీ చాలాకాలం నుంచీ ఏపీలో నాడు-నేడు పథకానికి రెండేళ్లకు పైగా సలహాదారు హోదాలో కొనసాగుతున్నారు. ఆయన హయాంలోనే ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ- అభివృద్ధి చెందాయి.

తెలంగాణలో సీఎం కేసీఆర్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తొలి ఐఏఎస్‌ అధికారిగా మురళీ సంచలనం సృష్టించారు. ముక్కుసూటి అధికారిగా పేరున్న ఆయన.. కీలకమైన పోస్టింగులన్నీ ఒక వర్గానికి చెందిన అధికారికే ఇస్తున్నారని, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యతాపరమైన పోస్టింగులు దక్కడం లేదంటూ మురళీ చేసిన వ్యాఖ్యలు, అధికార వర్గాల్లో సంచలనం సృష్టించాయి. కేసీఆర్‌ విధానాలు నచ్చని ఆయన, చివరకు తన ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చారు.

అయితే, మురళీ సేవలను ఏపీలో జగన్‌ ప్రభుత్వం వినియోగించుకుంది. ప్రభుత్వ పాఠశాలలను సంస్కరించాలని యోచిస్తున్న జగన్‌, ఆ బాధ్యతను మురళీకి అప్పగించారు. ఆ మేరకు ఆయనకు సలహాదారు పదవి ఇచ్చారు. నాడు- నేడు సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన మురళీ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కష్టపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించే బాధ్యత స్వీకరించిన మురళీ, అందులో విజయవంతం అయ్యారు. ఆయన హయాంలోనే టెండర్లు పూర్తయి, బిల్లుల చెల్లింపులు కూడా జరిగాయి. ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం, మంచినీటి సౌకర్యం, భవనాలకు మరమ్మతులు, రంగులు, ఆవరణలో మొక్కలు, ఇతర కనీస సౌకర్యాల కల్పనపై మురళీ దృష్టి సారించారు. ఫలితంగా ఏపీలో నాడు-నేడు కింద చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో.. తమ పిల్లలను చేర్పించేందుకు తలిదండ్రులు పోటీలు పడ్డారంటే, వాటిపై మురళీ ఏ స్థాయిలో దృష్టి సారించారో స్పష్టమవుతుంది.

అయితే తాజాగా ఆయన తెలంగాణ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగా ప్రవీణ్‌కుమార్‌ నాయకత్వంలో బీఎస్పీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన పలు సెమినార్లలో కూడా ఆయన పాల్గొని, ప్రభుత్వ విధానాలను తూర్పారపడుతున్నారు. గోదావరి వరదల్లో దెబ్బతిన్న కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన ఆయనను పోలీసులు అడ్డుకుని, అదుపులో తీసుకున్నారు. రక్షణగా ఉండే వాల్‌ కూలిపోవడం వల్లే నీళ్లు లోపలికి వచ్చాయే తప్ప, వరదల వల్ల అది కూలలేదన్న రహస్యం బయటపెట్టారు. గోడ నాసిరకంగా ఉండటం వల్లే కూలిపోయి పంప్‌హౌసులు మునిగిపోయాయన్న మరో సంచలనాన్ని వెల్లడించారు.నిజానికి మురళీ పదవీకాలం ఇంకా ఉంది. క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నందున, ఇకపై తనకు పొడిగింపు ఇవ్వవద్దని ఆయన ఏపీ ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం.
బీఎస్పీలో క్రియాశీల పాత్ర పోషించడమే కాకుండా, విద్యార్ధులను ఆ పార్టీలోకి ఆకర్షించే బాధ్యత మురళీకి అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Leave a Reply