Water flowing along the street curb during heavy rain. Close up of splashing raindrops and air bubbles.
ఎండల నుంచి ఉపశమనం
హైదరాబాద్లో మాత్రం నో రెయిన్
(వెంకట్)
హైదరాబాద్: గత కొన్ని రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 9 అయ్యిందంటే చాలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అత్యవసరం అయితేనే బయటకు వస్తున్నారు. ఎండల వేడితో అల్లాడుతున్న వారికి హైదరాబాద్ వాతావరణ శాఖ తీపి కబురు తెలియజేసింది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని చల్లని సమాచారం ఇచ్చింది.
ఆదివారం (ఏప్రిల్ 7వ తేదీ) నుంచి మంగళవారం వరకు వర్ష ప్రభావం ఉంటుందని పేర్కొంది.
ఏప్రిల్ 8 సోమవారం రోజున ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో వర్ష ప్రభావం ఉండనుంది. ఆ మరుసటి రోజు కామారెడ్డిలో వర్షం కురవనుందని పేర్కొంది. వర్షమే కాదు ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయని వాతావరణ శాఖ తెలిపింది..
మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురవవు. కొన్ని చోట్ల మాత్రమే వర్ష ప్రభావం ఉంటుంది. రాజధాని నగరం హైదరాబాద్లో వర్ష ప్రభావం లేదు. మిగతా చోట్ల వర్షం పడటంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. గురువారం నాడు హైదరాబాద్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండలో 43.5 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యింది.