Suryaa.co.in

Andhra Pradesh

తిక్కలోడి మూడు ముక్కలాటకు రాష్ట్రం బలైపోయింది

-నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. నా రాజధాని అమరావతి
-అమరావతికి మద్దతిచ్చిన వారికే ఓటు అని నినదించాలి
-మన ఆలోచనలు, మన కష్టం నుండే సంపద వస్తుంది
-విద్యావ్యవస్థను నాశనం చేసి ఉద్దరించానంటున్నాడు
-ఉద్యోగులకు మళ్లీ ఒకటో తేదీనే జీతాలిచ్చే పరిస్థితి తెస్తా
-రాజధానిలోని రోడ్లు తవ్వేసి మట్టి, ఇసుక కూడా దోచుకెళ్లిపోయారు
– తాడికొండ ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు

ఇది తాడికొండ కాదు. రాష్ట్ర రాజధాని అమరావతి. రాష్ట్రం నడిబొడ్డున నిలబడి చెబుతున్నా.. ఈ అమరావతిని ఇంచుకూడా కదపలేరు. ఇంకా రోజులే ఉన్నాయి. మే 13న లిఖించబోయే చరిత్ర కళ్ల ముందు కనిపిస్తోంది. ప్రజాభిమానం చూస్తుంటే.. జగన్ రెడ్డి సింగిల్ డిజిట్ దాటే పరిస్థితి లేదు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29 వేల మంది రైతులు, 35 వేల ఎకరాలు స్వచ్చందంగా ముందుకొచ్చి భూములిచ్చారు. మా భూములు తీసుకోండి. రాష్ట్రానికి రాజధాని కట్టుకోండని భూములిచ్చారు. అలాంటి త్యాగధనులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.

కేవలం మూడేళ్ల కాలంలో అభివృద్ధి పనులు శరవేగంగా పరుగులు పెట్టించాను. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్ అనే ట్విన్ సిటీస్ ఉంటే.. నేను సైబరాబాద్ నిర్మించి ట్రై సిటీస్ గా మార్చి అభివృద్ధి చేసి చూపించాను. అదే స్ఫూర్తితో అటు విజయవాడ, ఇటు గుంటూరుతో కలిపి అమరావతి అనే మహా నగరాన్ని నిర్మించాలనుకున్నాను. హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసింది నా కోసమా? ప్రజల కోసమా? ఆ రోజు తెలుగు జాతి కోసం ఆలోచించి టెక్నాలజీకి రూపమిచ్చాను. ఆ రోజు పుట్టని వారు కూడా ఈ రోజు అక్కడ లక్షల వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్నారు. రైతు కుటుంబాల్లో, కూలి చేసుకునే వారి కుటుంబాల్లో తెలివైన పిల్లలున్నారు. వారంతా అక్కడ లక్షల్లో వేతనాలు పొందుతున్నారు.

అమరావతి నుండి ప్రపంచాన్ని శాసించే పరిస్థితి రావాలి :
తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాం. ఉమ్మడి పార్లమెంటు సభ్యుడుగా పెమ్మసాని చంద్రశేఖర్, తాడికొండ ఎమ్మెల్యే అభ్యర్ధిగా తెనాలి శ్రావణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరినీ గెలిపించే బాధ్యత మీకే అప్పగిస్తున్నా. మన పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్న పెమ్మసాని ఇక్కడే పుట్టి పెరిగాడు. అమెరికా వెళ్లి కంపెనీ పెట్టి డబ్బు సంపాదించి, ప్రజల కోసం, మాతృ భూమికి సేవ చేయాలనే లక్ష్యంతో ఇక్కడకు వచ్చాడు. అమరావతి నిర్మాణం చేసి ఇలాంటి ఎంతో మందికి అండగా నిలవాలని తలిచాను.

ప్రపంచం మొత్తం మన తెలుగువారు ఉన్నారు. ఇకపై ఎక్కడో కాదు.. ఇక్కడే ఉండి ప్రపంచం అమరావతి వైపు చూడాలని భావించాను. సంపద సృష్టి కేంద్రంగా అమరావతి ఉండాలని భావించాను. కానీ, ఈ రోజు రాష్ట్రంలోని పిల్లలు ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ పుట్టిన వాళ్లు ఇక్కడే ఉండేలా చేయాలని అమరావతికి శ్రీకారం చుట్టాను. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావాలి, వారి ఆదాయం పెరగాలని తలిచాను.

తమిళనాడు తమ రాజధానిగా చెన్నైని చూపుతోంది. కర్నాటక తమ రాజధానిగా బెంగళూరు చూపుతోంది. తెలంగాణ తమ రాజధానిగా హైదరాబాద్ చూపిస్తోంది. కానీ, ఏపీ రాజధాని ఏదంటే బిక్కమొహం వేయాల్సి వస్తోంది. తిక్కలోడి మూడు ముక్కలాటకు రాష్ట్రం బలైపోయింది. మూడు రాజధానులు కట్టేశానంటూ వాగుతున్నాడు. అలాంటి తిక్కలోడికి వాతలు పెట్టడానికి ప్రజలంతా సిద్ధం కావాలి. అభివృద్ధి చేయడమంటే మోసం చేసినంత సులువు కాదు. రాజధాని అంటే నాలుగు బిల్డింగులంటూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు.

నాలుగు బిల్డింగులైతే ఎప్పుడో కట్టేశాను. రాజధాని అంటే ఒక రాష్ట్ర గౌరవం. ఒక రాష్ట్ర పొగరు. రాష్ట్ర ప్రజల విజయచిహ్నం. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. నా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే విషయం. అలాంటి రాజధానిపై తమాషాలు చేస్తున్నాడు. 2019 ఎన్నికల సమయంలో చెప్పాను.. జగన్ రెడ్డి గెలిస్తే రాజధాని ఉండదు, పోలవరం ఉండదు అని ముందే చెప్పాను. నెత్తిన చెయ్యి పెట్టి, బుగ్గలు నిమిరాడని జగన్ రెడ్డికి ఓటేశారు. ఒక్కసారి అని కరెంటు తీగను పట్టుకుంటామా అని కూడా అన్నాను. గతంలో 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నపుడు.. ఇటుక ఇటుక పేర్చాను. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను అద్యయనం చేశాను.

165 కిలోమీటర్ల ఔటర్ రింగు రోడ్డు నిర్మిస్తానంటే అందరూ ఆశ్చర్యంగా చూశారు. అసాధ్యమన్నారు. కానీ అసాధ్యం అనుకన్న దాన్ని 8 లైన్ల రోడ్డు వేసి సుసాధ్యం చేసి చూపించాను. రూపాయి ఖర్చు చేయకుండా రోడ్డు వేయించాను. 5 వేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ విమానాశ్రయం నిర్మిస్తానంటే.. అంత ఎందుకు అన్నారు. కానీ, ఆ రోజు తీసుకున్న చర్యలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో టాప్ 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. అంతకు మించిన రాజధానిగా అమరావతికి రూపకల్పన చేశాను. దిక్కుమాలినోడు వచ్చి మొత్తం నాశనం చేశాడు.

దేవతల రాజధాని ఈ అమరావతి
శాతవాహనుడు ధరని కోటను రాజధానిగా చేసుకుని పాలించారు. దేవతల రాజధాని అమరావతిగా భావించాను. దేశంలోని అన్ని పవిత్ర దేవస్థానాల నుండి మట్టి, అన్ని పవిత్ర నదుల నుండి జలం తీసుకొచ్చి పునీతం చేశాను. అందుకే జగన్ రెడ్డి లాంటి వంద మంది కాదు వెయ్యి మంది అరాచక శక్తులు వచ్చినా అమరావతిని ఇంచు కూడా కదపలేరు. ఇదీ అమరావతి స్థానబలం. అమరావతి జేఏసీ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. ఎన్ని రకాలుగా అవమానించారో చూశాం. అడుగడుగునా అవమానాలు. పోలీసుల హింస. స్టేషన్లో పెట్టి, జైల్లో పెట్టి చేసిన చిత్రవధ కన్నీరు తెప్పించింది. న్యాయస్థానం టు దేవస్థానం అని వెళ్తే.. భోజనాలు కూడా చేయనీయకుండా అడ్డుకున్నారు. అయినా మీరు తల వంచలేదు. అమరావతి కోసం పోరాడిన ప్రతి వీరనారికి రాష్ట్రం రుణపడి ఉంటుంది. మీ పోరాటంతోనే అమరవతి గెలిచింది. నిలిచింది.

విశాఖపట్నాన్ని, కర్నూలును అభివృద్ధి చేస్తాను. గతంలో విశాఖను ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి చేసి చూపిస్తా. కర్నూలును హార్టీకల్చర్, సీడ్ క్యాపిటల్ గా మార్చి చూపిస్తాను. రాష్ట్ర ప్రజల ఆశ ఈ అమరావతి చిరస్థాయిగా నిలుస్తుంది. అలా చేయగల సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం. పట్టుదల, తపన కలిగిన వ్యక్తులంతా కూటమిగా ఏర్పడ్డాం. ఎన్నికల ఫలితాలు వచ్చిన జూన్ 4న సగర్వంగా అమరావతే రాజధాని అని మీరు ఉత్సవాలు చేసుకోండి. అదే రోజున జగనాసుర వధ జరుగుతుంది. ప్రజలు గెలవాలి.. జగన్ పోవాలి. జరుగు జగన్ నీ పని అయిపోయిందని ప్రతి ఒక్కరూ నినదించాలి.

కనీసం ఇంగితం ఉండే ఎవడైనా.. రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టిన నిర్మాణాలు కూల్చేస్తాడా? ముఖ్యమంత్రిగా ఎవరైనా మంచి పనితో కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కానీ, ఇలాంటి విధ్వంసకారుడు ప్రజావేదిక కూల్చి పాలన ప్రారంభించాడు. అప్పుడే అర్ధమైంది.. ఇతని పాలన ఎలా ఉండబోతోందో. అధికారంలోకి రాగానే.. ప్రజావేదికను నిర్మిస్తా. ప్రజా పాలనకు నాంది పలుకుతాం. కౌరవ సభ నుండి బయటకు వస్తూ చెప్పా. గెలిచిన తర్వాత గౌరవ సభగా మార్చి జూన్ 4న సభలో అడుగు పెడతాను.

బిర్యానీ, మద్యం పంచినా జగన్ సభలకు జనం లేరు :
ఒక్కో మీటింగ్ కి 1500 బస్సులు, బిర్యానీ ప్యాకెట్లు, మద్యం ఏరులై పారించినా.. జగన్ రెడ్డి సభలకు ప్రజలు రావడం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ సభలకు స్వచ్ఛందంగా వస్తున్నారు. అమరావతికే కాదు.. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది. తెలుగుదేశం దాదాపు 22 సంవత్సరాలు అధికారంలో ఉంది. తర్వాత ఎంతో మంది వచ్చారు. కానీ, జగన్ రెడ్డి చేసినంత విధ్వంసం ఎవరూ చేయలేదు. రాష్ట్రాన్ని సర్వం నాశనం చేశాడు. వచ్చే 30 రోజులు ప్రజలంతా స్వచ్ఛందంగా పని చేయండి. కూటమి గెలుపుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పండి.

ముంపు మండలాలిచ్చే వరకు ప్రమాణం చేయనని పట్టుబట్టా :
ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి రాష్ట్రం పట్ల బాధ్యతగా ఉండాలి. ముఖ్యమంత్రిగా తొలి రోజు ఢిల్లీ వెళ్లి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన ఏడు మండలాలు ఏపీకి ఇవ్వకుంటే ప్రమాణ స్వీకారం కూడా చేయనని చెప్పాను. కేబినెట్ సమావేశం పెట్టి, ఆర్డినెన్స్ తెచ్చి ఏడు మండలాలు ఏపీకి ఇచ్చిన తర్వాతే పార్లమెంటు పెట్టారు. తర్వాత పోలవరం పనులు పరుగులు పెటించాను. పట్టి సీమ నిర్మించి ఒకే సీజన్లో ఏకంగా 140 టీఎంసీలు తరలించి చరిత్ర సృష్టించాను. 72 శాతం పోలవరం పనులు పూర్తి చేశాను. నేను మళ్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఉంటే.. 2020 పోలవరం పూర్తయ్యేది.

తాడికొండకు కూడా నీటి సదుపాయం లేదు. వైకుంఠపురం ప్రాజెక్టు కట్టి నకరికల్లులో వదిలి అక్కడ నుండి నాగార్జున సాగర్ కుడి కాల్వకు వదిలితే.. ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమయ్యేది. మరోవైపు పోలవరం పూర్తి చేసి నదులన్నీ అనుసంధానిస్తే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరివ్వొచ్చు. అది నా కల. ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరివ్వాలనేది నా కల. కానీ, ప్రజలు జగన్ రెడ్డి మోసపూరిత మాటలు నమ్మి మోసపోయారు. పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతు లాంటి జగన్ రెడ్డిని గెలిపించుకున్నాం. దాని ఫలితం.. గత ఐదు సంవత్సరాలుగా అవస్థలు పడుతున్నాం. ఇప్పుడు ప్రజలంతా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు.

రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా ఉద్యోగాలొచ్చాయా?
జాబ్ క్యాలెండర్ అన్నాడు. మెగా డీఎస్సీ అన్నాడు. ఉన్న పరిశ్రమలు తరిమేశాడు. మెడపై కత్తి పెట్టి పారిశ్రామిక వేత్తల్ని బెదిరిస్తున్నాడు. బెదిరించి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరిమేస్తున్నాడు. అమరరాజా, లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి ఎన్నో సంస్థలు తరలిపోయాయి. నేను హమీ ఇస్తున్నా.. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఇస్తా. తొలి సంతకంతో మెగా డీఎస్సీ ఇస్తా. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాను. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెలా రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తా. అమరావతిని ఉద్యోగ కల్పనలో దేశంలోనే నెం.వన్ స్థానంలో నిలబెడతా.

ఉద్యోగులకు జీతాలివ్వలేని దద్దమ్మ ఈ జగన్ :
గతంలో విభజన కష్టాలను సైతం భరించి మరీ 43 శాతం పీఆర్సీ ఇచ్చాను. జగన్ రెడ్డి గతంలో సీపీఎస్ రద్దు చేసేస్తానన్నాడు. అధికారంలోకి వచ్చాక కనీసం పీఆర్సీ లేదు. టీఏ, డీఏలు కూడా లేవు. కనీసం పెన్షన్ కూడా ఇచ్చే దిక్కు లేదు. పోలీసులకు వీక్లీ ఆఫ్ లేదు. సరెండర్ లీవ్స్ లేవు. కనీసం జీతాలు కూడా సకాలంలో రావడం లేదు. దాచుకున్న సొమ్ము కూడా ఇవ్వకుండా వేధిస్తున్నాడు. ఇప్పటికైనా పోలీసు సిబ్బంది మారాలి. ఈ ప్రభుత్వంలో ఎవరికైనా ఉద్యోగాలొచ్చాయా? 26 వేల పోలీస్ ఉద్యోగాలిస్తామన్నాడు. ఒక్కటి కూడా ఇవ్వకుండా ఉన్న వారికి పనిభారం పెంచాడు.

చెడు అని తెలిసినా, పై అధికారుల ఒత్తిడి కారణంగా, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. మానసిక క్షోభ అనుభవించారు. కానీ, కొంత మంది జగన్ రెడ్డి అనే సైకోకి వత్తాసు పలుకుతున్నారు. కొంత మంది అయితే ఏకంగా నా దగ్గరకొచ్చి వారి సమస్యలు ఏకరవు పెడుతున్నారు. సార్ మా పిల్లల పెళ్లి సమయంలో అరెస్టు చేస్తామని బెదిరించడంతో.. వారు చెప్పినట్లు తప్పులు చేయాల్సి వచ్చిందన్నారు. ఉద్యోగులందరికీ చెబుతున్నా.. సకాలంలో జీతాలిచ్చే రోజులు త్వరలోనే వస్తాయి. పోలీసులకు పనిభారం తగ్గించి, అన్ని సదుపాయాలు కల్పిస్తాను. పూర్వ వైభవం కల్పించే బాధ్యత నాది.

స్కూల్ బిల్డింగులు కడితే చదువెలా వస్తుంది జగన్ :
జగన్ రెడ్డి వచ్చాక విద్యా వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేశాడు. స్కూల్ బిల్డింగులకు రంగులేస్తే చదువొస్తుందా? స్కూలుకు రంగులు కొట్టి, కుర్చీలు మార్చి డబ్బులు కొట్టేశాడు. జగన్ రెడ్డి చేసిన ఏ పని చూసినా అందులో ఒక కుంభకోణం ఉంటుంది. మనం విట్, ఎస్ఆర్ఎం, అమృత్ లాంటి అంతర్జాతీయ ప్రమాణాలున్న విద్యా సంస్థల్ని తీసుకొచ్చాను. దేశంలో టాప్ 10 యూనివర్శిటీల్లో 7-8 అమరావతిలో ఉండాలని కష్టబడ్డాను.

మంచి స్కూల్స్, కాలేజీలు, ఆస్పత్రులు ఏర్పాటై అమరావతి నాలెడ్జి హబ్ గా మారాలని ఆలోచించాను. జగన్ రెడ్డి వచ్చాక మొత్తం నాశనం చేశాడు. పోస్టు గ్రాడ్యుయేట్ చదివే విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా రద్దు చేశాడు. ఇంటర్ పిల్లలకు భోజనం కూడా పెట్టకుండా రద్దు చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్య లాంటి పథకాలు రద్దు చేశాడు. విద్యా వ్యవస్థను నాశనం చేశాడు. వైద్యారోగ్య రంగాన్ని భ్రష్టు పట్టించాడు.

మన ఆలోచనలు, మన కష్టం నుండే సంపద వస్తుంది :
ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని బాగు చేయాలంటే తెలుగుదేశం రావాలి. నాకు ధృడ సంకల్పం ఉంది. సంక్షోభాలను అవకాశంగా మార్చుకోవడం నాకు అలవాటైపోయింది. నాశనమైపోయిన వ్యవస్థల్ని బాగు చేసుకుందాం. రోడ్లపై గుంతలు పూడ్చలేని ఈ సైకో మూడు రాజధానులు కడతాడంట. అమరావతిలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో రూ.4-5 లక్షల కోట్లు జగన్ రెడ్డి దూరం చేశాడు. సంపద అంటే ఆకాశం నుండి రాదు. మన ఆలోచనల నుండి, మన కష్టం నుండి వస్తుంది. మంచి రోడ్డు వేస్తే పరిశ్రమలొస్తాయి.

మంచి సిటీ కడితే ఉద్యోగాలొస్తాయి. దాని వల్ల ఆర్ధిక వ్యవస్థ బాగుపడుతుది. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ప్రజల ఆదాయం పెరగాలంటే.. అభివృద్ధి జరగాలి. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఎవరి ఆదాయం అయినా పెరిగిందా? కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, పన్నులు పెరిగాయి. మద్యం ధరలు కూడా పెరిగాయి తప్ప.. ప్రజల ఆదాయం పెరగలేదు. రూ.60 ఉండే క్వార్టర్ రూ.200 చేసి ప్రజల జేబుకు కన్నం పెట్టాడు. ఇలా ధరలు పెంచడం అభివృద్ధా?

హైటెక్ సిటీ కట్టేటప్పుడు ఎకరా లక్ష.. ఇప్పుడు రూ.100 కోట్లు :
హైటెక్ సిటీ ప్రారంభించే సమయంలో అక్కడ ఎకరా లక్ష మాత్రమే. రోడ్లు లేవు. కారు కూడా పోయే పరిస్థితి లేదు. కానీ, ఇప్పుడు అక్కడ ఎకరం రూ.100 కోట్లు పలుకుతోంది. అంటే ఏకంగా 10 వేల రెట్లు పెరిగింది. అదీ సంపద సృష్టించే విధానం. అమరావతి పూర్తై ఉంటే.. రాష్ట్ర సంపద పెరిగేది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. పేద రిక నిర్మూలన నా ధ్యేయం. అందుకే ప్రతి ఆడబిడ్డకీ నెలకు రూ.1500 ఇస్తా, తల్లికి వందనంతో ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తా, ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తా, ప్రతి బిడ్డ భవిష్యత్తుకు తోడుగా నిలుస్తాను. రైతులకు ఏటా రూ.20 వేల ఆర్ధిక సాయం, ఉచితంగా మంచినీరు, బీసీలక రక్షణ చట్టం, బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేస్తా. మరోవైపు ప్రతి నెలా ఒకటో తేదీన రూ.4000 ఇంటి వద్దకు తెచ్చి అందిస్తాను. ఏప్రిల్ నెల నుండే పెంచిన పెన్షన్ జూన్ నెలలో అందించే బాధ్యత నాది.

రాజధానిలోని రోడ్లు తవ్వేసి మట్టి, ఇసుక కూడా దోచుకెళ్లిపోయారు. తాడికొండలో మంచినీటి సమస్య ఉందని తెనలి శ్రావణ్ చెప్పారు. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాను. ఏడాది పూర్తయ్యేలోగా ప్రతి ఇంటికీ తాగునీరు ఇచ్చే బాధ్యత నాది. ఇళ్లు, షాపులు కూల్చేసిన వారికి నష్టపరిహారం అందిస్తాను. మల్లిఖార్జున స్వామి దేవాలయానికి ఘాట్ రోడ్డు నిర్మిస్తాను. మాల మాదిగ శ్మశాన వాటికకు స్థలం కేటాయిస్తాను. ఫిరంగిపురం కొండకు ఘాట్ రోడ్డు పనుల్ని పూర్తి చేస్తాను.

రాజధాని లేని రాష్ట్రానికి పెట్టుబడులెలా వస్తాయి?
రాజధాని వచ్చి ఉంటే.. ఈ ప్రాంత అభివృద్ధి ఎలా ఉండేది? అమరావతి అంటే కులాల సమ్మేళనం. అన్ని కులాలూ బాగుపడేవి. జగన్ రెడ్డి అరాచకానికి ప్రజలంతా బాధితులే. పట్టుదల ఉందా లేదా? మీ పొట్ట కొట్టిన ఫ్యాన్ ను చిత్తు చిత్తు చేసి చెత్తకుప్పలో పడేయాలి. రాజధానికి అందరూ కట్టుబడి ఉండాలి. అలా కాని నాయకుల్ని ఇక్కడకు రానీయకుండా బాయ్ కాట్ చేయాలి. అప్పుడే మన భవిష్యత్తు బాగుపడుతుంది.

అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు కూడా అదే ధృడ సంకల్పంతో పని చేయాలి. ఈ నియోజకవర్గంలో పూర్తిగా బాయ్ కాట్ చేసినపుడే రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వేసుకున్నట్లు అవుతుంది. నాది ఆంధ్ర ప్రదేశ్ .. నా రాజధాని అమరావతి అని చెప్పేవారే ఇక్కడ పోటీ చేయాలి. అమరావతి ద్రోహుల్ని తరిమికొడదాం

LEAVE A RESPONSE