Suryaa.co.in

National

ఎన్నికలను నియంత్రించలేం

– వీవీప్యాట్‌ల కేసులో సుప్రీంకోర్ట్ సంచలన వ్యాఖ్యలు

వీవీప్యాట్ సిస్టమ్ ద్వారా జనరేట్ అయ్యే అన్ని పేపర్ స్లిప్‌ల సహాయంతో ఈవీఎంలో (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌) పోలైన అన్ని ఓట్లను క్షుణ్ణంగా క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఎన్నికలను నియంత్రించే అధికారం తమకు లేదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. రాజ్యాంగబద్ధమైన అధికార సంస్థగా ఉన్న ఎన్నికల సంఘం పనితీరును తాము నిర్దేశించలేమని స్పష్టం చేసింది. కేవలం అనుమానం ఆధారంగా వ్యవహరించలేమని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడా బెంచ్ తెలిపింది.

పిటిషనర్‌గా ఉన్న ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ తరఫున సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదించారు. ఆయన లేవనెత్తిన ఆందోళనలపై కోర్టు ఆసక్తికర కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ మీరు ముందస్తు ఆలోచన చేస్తున్నట్టయితే ఆ విషయంలో మీకు సాయం చేయలేము. మీ ఆలోచనా విధానాన్ని మార్చేందుకు మేము ఇక్కడ లేము’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. కాగా వీవీప్యాట్ స్లిప్పుల ద్వారా అన్ని ఓట్లను క్షుణ్ణంగా క్రాస్ వెరిఫికేషన్ చేయాలనే పిటిషన్‌పై తీర్పుని ప్రస్తుతానికి రిజర్వులో పెడుతున్నట్టుగా సుప్రీంకోర్టు తెలిపింది.

కాగా ఈవీఎంలపై పలు సందేహాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న పోల్ అయ్యే ప్రతి ఓటును వీవీప్యాట్ పేపర్ స్లిప్‌ల ద్వారా క్రాస్ వేరిఫై చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. కాగా గతంలో విచారణ సందర్భంగా ఈవీఎంలపై ప్రజలకు విశ్వాసం లేదనే అంశాన్ని పిటిషనర్లు లేవనెత్తారు.

యూరోపియన్ దేశాలు తిరిగి బ్యాలెట్ ఓటింగ్ వ్యవస్థకు వెళ్లాయని ప్రస్తావించారు. అయితే భారత్‌లో పరిస్థితులు వేరని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ వాదనలను కొట్టిపారేసింది. కాగా ప్రస్తుతం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన 5 ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులను మాత్రమే క్రాస్ వెరిఫికేషన్ చేస్తున్న విషయం తెలిసిందే.

LEAVE A RESPONSE