Suryaa.co.in

Andhra Pradesh

బిసిలను అవమానిస్తే జైలుకు !

-తప్పుడు ప్రచారాన్ని క్రైస్తవ సోదరులు నమ్మొద్దు
-పరదాలు కట్టుకుని తిరగను…చెప్పినవన్నీ చేస్తా
-రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్
-చినకాకాని లో లోకేష్ కు స్థానికుల బ్రహ్మరథం

మంగళగిరి: జగన్ ప్రభుత్వం బిసిలు, బిసిల బిడ్డలను దుర్మార్గంగా పొట్టనబెట్టుకుంటోంది, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిసిలను అవమానిస్తే జైలుకు పంపుతాం, ఇందుకోసం ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ చినకాకాని, యర్రబాలెం, తాడేపల్లి రూరల్ సీతానగరం గ్రామాల్లో జరిగిన రచ్చబండ సభల్లో లోకేష్ పాల్గొన్నారు.

చినకాకానిలో స్థానిక ప్రజలు యువనేతకు బ్రహ్మరథం పట్టారు. గ్రామంలోకి రాగానే హారతులు పడుతూ, పసుపు కాగితాలు విరజిమ్ముతూ ఘనస్వాగతం పలికారు. స్థానికుల జయజయధ్వానాల నడుమ లోకేష్ సెయింట్ జోసఫ్ చర్చిని సందర్శించారు. అక్కడ ఫాదర్ జోజయ్య యువనేతను ఆశీర్వదిస్తూ ప్రార్థనలు చేశారు.

అనంతరం రచ్చబండ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిసిలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. 26వేలమంది బిసిలపై తప్పుడు కేసులు బనాయించారు. రేపల్లెలో అక్కను అవమానించిన వైసిపి కిరాతకుడ్ని ప్రశ్నించినందుకు అమర్ నాథ్ గౌడ్ ను పెట్రోలుపోసి తగులబెట్టారు. బిసిలకు రక్షణ చట్టం తేవాలనే ఆరోజే నిర్ణయించాం. బిసిల సంక్షేమానికి చంద్రబాబు బిసి డిక్లరేషన్ ప్రకటించారు. 50సంవత్సరాలు నిండిన బిసిలకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తాం. బిసి కాలనీలకు సబ్ ప్లాన్ ద్వారా నిధులు కేటాయిస్తాం.

క్రైస్తవ సోదరులను గుండెల్లో పెట్టుకుంటాం
రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే బిజెపితో పొత్తుపెట్టుకున్నాం. కూటమి ప్రభుత్వం వస్తే క్రైస్తవులను ఇబ్బందులు పెడతామని వైసిపి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. క్రైస్తవ సోదరులను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాం. 2014లో బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా క్రైస్తవులకు ఎటువంటి సమస్యలు తలెత్తలేదు. క్రిస్మస్ కానుకలు, పాస్టర్లకు గౌరవవేతనం, చర్చిలకు అభివృద్ధికి నిధులు ఇచ్చాం. తెలుగుదేశం పార్టీకి కులం, మతం, ప్రాంతీయ భేదాలు లేవు. తెలుగువారి శ్రేయస్సే టిడిపి ధ్యేయం.

మతాలమధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలన్న జగన్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు. టిడిపిపై విషం చిమ్ముతున్న కాపు ముసుగు నేతలు రిజర్వేషన్లపై జగన్ ను ఎందుకు ప్రశ్నించలేదు, వైసిపి అధికారంలోకి వచ్చాక గతంలో మేం ఇచ్చిన నిధుల్లో 10శాతం కూడా కాపులకు ఇవ్వలేదు. నేను మరో 40ఏళ్లు రాజకీయాల్లో ఉంటా, పరదాలు కట్టుకొని తిరగాలని లేదు, తాను చెప్పిన పనులన్నీ చేసి మంగళగిరి రూపురేఖలు మారుస్తానని లోకేష్ చెప్పారు.

2019లో ఓటమి నాలో కసి పెంచింది, అప్పటినుంచి ప్రజల మనసులను గెలవాలని అహర్నిశలు కష్టపడ్డారు. అధికారంలో లేకపోయినా సొంత డబ్బుతో 29సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశాను. తనను గెలిపిస్తే ఎంత చేయగలనో మంగళగిరి ప్రజలు ఆలోచించాలి, రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించి నన్ను ఆశీర్వదించాలని లోకేష్ కోరారు.

లోకేష్ దృష్టికి చినకాకాని సమస్యలు
చినకాకాని ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ దృష్టికి తెచ్చారు. గ్రామంలో అండర్ పాస్ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం, బస్సు ఎక్కడానికి చాలా దూరం నడిచివెళ్లాల్సి వస్తోంది. చినకాకాని గ్రామాన్ని కార్పొరేషన్ లో కలపడం వల్ల ఇంటిపన్నులు భారీగా పెరిగాయి. తమ గ్రామాన్ని పంచాయితీగానే కొనసాగించాలి. శ్మశానానికి స్థలం కేటాయించాలి. ఎస్సీ కమ్యూనిటీ హాలు నిర్మించాలి. వేణుగోపాలస్వామి భూములను అనుభవిస్తున్న కౌలుదారులు సరిగా వేలం సొమ్ము చెల్లించకపోవడంతో జీతాల్లేక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.

పెదవడ్లపూడి హైలెవల్ చానల్ కింద తమ గ్రామానికి చెందిన 250ఎకరాల ఆయకట్టు ఉంది. ఎత్తిపోతల పథకం పూర్తిచేయాలి. కెనాల్ వద్ద దిమ్మెలస్థానంలో లాకులు ఏర్పాటుచేయాలి. 35ఏళ్లుగా చెరువుకట్టపై నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలు అందజేయాలి. గ్రామశివార్లలో రైతులు పొలాలకు వెళ్లేందుకు ఉపకరించేలా బ్రిడ్జిని పునర్నిర్మించాలి. జాతీయరహదారి నుంచి రాజధానికి కనెక్టివిటీ రోడ్డు నిర్మాణం పూర్తిచేయాలి. గ్రామంలోని పశువుల ఆసుపత్రిలో డాక్టర్ ను నియమించాలి. టిడ్కో గృహసముదాయాల్లో పేర్లు మార్చేసి ఇళ్లు ఉన్నవారికే మళ్లీ ఇచ్చారు. వాస్తవంగా ఇళ్లులేని వారికి ఇళ్లు ఇవ్వాలి. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది, డ్రమ్ముల్లో నీళ్లు పట్టుకోవాల్సి వస్తోంది.

గుంటూరు కెనాల్ కు ఆనుకొని ఉన్న భూములను 21ఎలో ఉంచడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ 50ఇళ్లు ఉన్నాయి. యువనేత లోకేష్ స్పందిస్తూ… అండర్ పాస్ విషయమై కేంద్రప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాం. చినకాకానిలో పంచాయితీగా మార్చే విషయంలో మెజారిటీ ప్రజల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటాం. జనాభా దామాషా ప్రాతిపదికన భూసేకరణ చేసి శ్మశానానికి స్థలం కేటాయిస్తాం.

పెదవడ్లపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి రైతుల నీటి కష్టాలు తొలగిస్తాం. ఇళ్లులేని వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం. కృష్ణానది నుంచి పైప్ లైన్ వేసి తాగునీటి సమస్యకు చెక్ పెడతాం. ఈ ఎన్నికల్లో మంగళగిరి ప్రజలు ఇచ్చే మెజారిటీనే నాకు కొండంత బలాన్నిస్తుంది. చంద్రబాబు, పవన్ తో పోరాడి మంగళగిరి అభివృద్ధికి నిధులు తెస్తానని లోకేష్ చెప్పారు.

రాజధాని రైతులు వైసీపీ నేతలను నిలదీయండి
యర్రబాలెం రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ… అమరావతి కోసం పోరాడిన మహిళలను బూటుకాళ్లతో తొక్కించారు, అక్రమ కేసులు బనాయించారు, సచివాలయానికి జగన్ పరదాలు కట్టుకొని వెళ్తున్నాడు. అమరావతి పనులు కొనసాగించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేదా? ఏ మొఖం పెట్టుకుని ఇప్పుడు రాజధాని రైతులను ఓట్లు అడుగుతారు? అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మబలికి ఆర్కే వెన్నుపోటు పొడిచారు. కేవలం అసంపూర్తిగా నిర్మించిన 5శాతం రాజధాని పనులు పూర్తిచేసి ఉంటే అమరావతిలో లక్షలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవి. అమరావతి ప్రాంతంలో ఇసుక, కంకర, మట్టితో సహా దోచుకెళ్లారు.

పెద్దదొంగను స్థానికంగా ఉండే చిన్నదొంగలు ఆదర్శంగా తీసుకున్నారు. ఈ ప్రాంతానికి వైసిపినేతలు వస్తే రైతులు నిలదీయాలి. కౌలు, రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలను వందరోజుల్లో బకాయిలు ఇస్తాం, కౌలు బకాయిలన్నీ చెల్లిస్తాం. రాజధాని పనులు కొనసాగించి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తాం, రాజధానిలోని పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యర్రబాలెం ప్రజలు స్థానిక సమస్యలను లోకేష్ దృష్టికి తెచ్చారు. రాజధానికి భూములిచ్చామని కక్షగట్టి పెన్షన్లు తీసేశారు, కౌలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఎసైన్డ్ భూముల్లో నివసించేవారికి పట్టాలు ఇవ్వాలి.

దళితులకు కమ్యూనిటీ హాలు నిర్మించాలి. యర్రబాలెంలో జాతీయ బ్యాంకు శాఖ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించాలి. టిడ్కో ఇళ్లను ఉచితంగా అందించాలి. కొత్తరేషన్ కార్డులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అమరావతి ప్రాంతంలో నివసించే కూలీలు పనుల్లేక ఇబ్బంది పడుతున్నారు. ల్యాండ్ పూలింగ్ లో భూములిచ్చిన పిల్లలకు ఉచిత విద్య, ఉద్యోగాలు ఇవ్వాలి.

లోకేష్ స్పందిస్తూ… అధికారంలోకి వచ్చాక కోతల్లేకుండా పెన్షన్లు ఇస్తాం, కొండపోరంబోకు, ప్రభుత్వ భూముల్లో నివసించే వారికి శాశ్వత పట్టాలిస్తాం. భూగర్భ డ్రైనేజి, తాగునీరు, రోడ్ల నిర్మాణం చేపడతామని అన్నారు

LEAVE A RESPONSE