-అంతా కలిసి మంగళగిరిలో వార్ వన్ సైడ్ చేయాలి
-ఆరు నెలల్లో అమరావతిలో అంతర్గత రోడ్ల నిర్మాణం
-మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్
మంగళగిరి: రాబోయే ఎన్నికల్లో మంగళగిరి ప్రజలంతా వార్ వన్ సైడ్ గా మార్చి తనకు ఘనవిజయం చేకూర్చాలని, అహర్నిశలు శ్రమించి నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్ గా మారుస్తానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం నీరుకొండ గ్రామ ప్రజలతో యువనేత సమావేశమయ్యారు. గ్రామంలోని రాములవారి గుడిలో లోకేష్ పూజలు నిర్వహించి, ఆశీర్వచనాలు అందుకున్నారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… అయిదేళ్లలో చెప్పిన పనులన్నీ చేసి శభాష్ అన్పించుకుంటా, ప్రజలందరి సహకారంతో ఎంపి అభ్యర్థి పెమ్మసాని, తాను డబుల్ ఇంజన్ లా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయినా ప్రజల మనసు గెలవాలని సొంత డబ్బుతో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. తాగునీటికి ఇబ్బంది వస్తే ట్యాంకర్లు పంపించాను, సేదదీరడానికి సిమెంటు బల్లలు, స్వయం ఉపాధికి తోపుడు బళ్లు ఇచ్చాను. మహిళల స్వయం ఉపాధికి స్త్రీశక్తి ద్వారా శిక్షణ ఇవ్వడమేగాక కుట్టుమిషన్లు ఇచ్చా.
పేదల ఇంట్లో పెళ్లిళ్లు జరిగితే పెళ్లికానుక పంపించాను. 25ఏళ్లుగా మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన రెండు కుటుంబాలు నేను చేసిన సంక్షేమంలో పదోవంతు చేయగలిగారా? పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆర్కే ఏనాడు గ్రామాల్లోకి రాలేదు, ప్రజల సమస్యలను గాలికొదిలేశారు. యువగళానికి ముందు నేను పాదయాత్ర చేసినపుడు నీరుకొండలో 6గంటలపాటు వీధివీధి తిరిగాను. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో రాజధాని అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని పూర్తిచేస్తాం.
ఏడాదిలో భూగర్భ డ్రైనేజి పూర్తిచేస్తాం. పైప్ లైన్ ద్వారా కృష్ణాజలాలను రప్పించి ప్రతిగడపకు కుళాయిల ద్వారా తాగునీరు అందిస్తాం. నియోజకవర్గంలో ఇళ్లులేని నిరుపేదలకు 20వేల ఇళ్ల నిర్మాణం చేపట్టి తాళాలు అందజేసే బాధ్యత నాది. గతంలో మాదిరి మంగళగిరికి ఐటి పరిశ్రమలు రప్పించి యువతకు ఉద్యోగాలు కల్పిస్తా.
దళితులపై జగన్ సర్కారు ఊచకోత
జగన్ అధికారంలోకి వచ్చాక దళితులను ఊచకోత కోస్తున్నాడు. ఇదివరకెన్నడూ లేనివిధంగా దళితులపై దాడులు పెరిగాయి. దళితడ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును జగన్ పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు. పుంగనూరులో మద్యం అక్రమాలపై ప్రశ్నించిన ఓంప్రతాప్ ను పాపాల పెద్దిరెడ్డి చంపించారు. తూర్పుగోదావరిలో ఇసుక అక్రమాలపై ప్రశ్నించిన వరప్రసాద్ కు గుండుకొట్టించారు.
దళితబిడ్డల కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీవిద్య, పిజి ఫీజ్ రీఎంబర్స్ మెంట్ తోసహా 27 పథకాలను జగన్ రద్దుచేశారు. జగన్ కు రెండు బటన్లు ఉంటాయి. పదిరూపాయలు వంద కొట్టేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటిపన్ను, చెత్తపన్ను, పెట్రోలు, డీజిల్ ధరలతో ప్రజలనెత్తిన మోయలేని భారాలు మోపాడు. అధికారంలోకి వచ్చాక దళితులకు జగన్ రద్దుచేసిన 27సంక్షేమ పథకాలను పునరుద్దరిస్తాం. వృద్ధులకు 3వేల పెన్షన్ ను 4వేలు చేస్తాం.
యువనేత దృష్టికి నీరుకొండ గ్రామ సమస్యలు
నీరుకొండ గ్రామస్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత లోకేష్ దృష్టికి తెచ్చారు. గ్రామంలో హిందూ శ్మశానవాటిక చెరువుకట్టపైన, క్రిస్టియన్ శ్మశానవాటికి ఊరిమధ్యలో ఉంది. ఈ రెండింటికీ స్థలాలు కేటాయించి మౌలిక వసతులు కల్పించాలి. రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించాలి. విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చిందని పెన్షన్ కట్ చేస్తున్నారు. చాలచాలని వేతనంతో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అందించాలి.
గ్రామ యువత ఆడుకోవడానికి ప్లేగ్రౌండ్ లేదు. రైతుకూలీలకు 3నెలలకోసారి పెన్షన్ ఇస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. ప్రతినెలా పెన్షన్ సొమ్ము ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. యువనేత లోకేష్ స్పందిస్తూ… రాజధాని రైతులకు చెల్లించాల్సిన కౌలు బకాయిలు వడ్డీతో సహా చెల్లిస్తాం. రైతుకూలీలకు ప్రతినెలా రూ.5వేల పెన్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. భూసేకరణ చేసి శ్మశానవాటికలను పూర్తి సదుపాయాలతో మహాప్రస్థానం మోడల్ లో అభివృద్ధి చేస్తాం.
కుంటిసాకులతో పెన్షన్లు కట్ చేసే విధానం లేకుండా అర్హులైన వారందరికీ పెన్షన్లు అందజేస్తాం. గ్రామంలో ప్లేగ్రౌండ్, వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తనను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి పంపిస్తే అయిదేళ్లలో ప్రజలు శభాష్ అనేలా అభివృద్ధి చేసి చూపిస్తానని లోకేష్ పేర్కొన్నారు.