Suryaa.co.in

Andhra Pradesh

టిడిపిలో చేరిన ఇస్లామిక్ ఫ్రంట్ కీలకనేత అక్రమ్

లోకేష్ సమక్షంలో 200మందితో పార్టీలో చేరిక

అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో వైకాపాకు మరో షాక్ తగిలింది. మంగళగిరి సమగ్రాభివృద్ధికి కలిసి రావాలన్న యువనేత నారా లోకేష్ పిలుపుతో పలువురు ప్రముఖులు టిడిపిలో చేరుతున్నారు. మంగళగిరి పట్టణానికి చెందిన వైసీపీ నేత, ఇస్లామిక్ ఫ్రంట్ కన్వీనర్ షేక్ అక్రమ్ 200 మంది అనుచరులతో తెలుగుదేశం పార్టీలో చేరారు. తాడేపల్లి పట్టణ 22వ వార్డు అధ్యక్షులు షేక్ బుడే ఆధ్వర్యంలో షేక్ ఖాజా, షేక్ బాషా, షేక్ ముక్తియార్ సహా 22 ముస్లీం మైనార్టీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఉండవల్లి నివాసంలో యువనేత లోకేష్ వీరందరికీ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీలకు మొట్టమొదటి సారిగా కార్పోరేషన్ ఏర్పాటుచేసింది అన్న ఎన్టీఆర్. తర్వాత చంద్రబాబునాయుడు హజ్ హౌస్ నిర్మించారు. మైనార్టీల్లో పేదలు ఎక్కువగా ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ముస్లీం మైనార్టీల కోసం రంజాన్ తోఫా, దుల్హన్, హజ్ యాత్రకు సబ్సీడీ, రంజాన్ సమయంలో మసీదులకు రంగుల కోసం నిధులు, షాదీ ఖానాల నిర్మాణం, విదేశీ విద్య, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టాం.

జగన్ వచ్చిన తర్వాత అవన్నీ రద్దు చేశారు. అధికారంలోకి వచ్చాక ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుచేసి పేద ముస్లింలకు సబ్సిడీ రుణాలు అందజేస్తాం. మైనార్టీ విద్యార్థుల కోసం కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటుచేస్తాం. తాడేపల్లి ప్యాలెస్ లో పెద్ద సైకో, మంగళగిరిలో చిన్న సైకో ఉన్నారు. గత నెలరోజులుగా అక్రమ్ గారిని వేధిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక మైనారిటీలపై తప్పుడు కేసులు ఎత్తివేసి గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని లోకేష్ భరోసా ఇచ్చారు

LEAVE A RESPONSE