Suryaa.co.in

Andhra Pradesh

ఆంధ్రులు తలెత్తుకు తిరిగేలా అమరావతి నిర్మిస్తాం

-యుద్ధప్రాతిపదికన రాజధాని పనులు ప్రారంభిస్తాం
-మీ బిడ్డనంటున్నాడు… భూములు కొట్టేస్తాడు జాగ్రత్త
-మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారాలోకేష్

మంగళగిరి: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన అమరావతి పనులు చేపట్టి, 5కోట్ల ఆంధ్రులు తలెత్తుకు తిరిగేలా రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం నీరుకొండ ప్రజలతో యువనేత సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్ర భవిష్యత్తు కోసం విలువైన భూములిచ్చిన రైతులపై జగన్ కర్కశంగా వ్యవహరించారు, దళిత రైతులకు బేడీలు వేశారు, మహిళా రైతులను బూటుకాళ్లతో తొక్కించారు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా మొక్కవోని ధైర్యంతో ఉద్యమించారు, మరో నెలరోజుల్లో కూటమి ప్రభుత్వం రాగానే రైతులకు గత మూడేళ్లుగా చెల్లించాల్సిన కౌలు బకాయిలను వడ్డీతో సహా చెల్లిస్తాం, రాజధాని కూలీలకు రూ.5వేల పెన్షన్ ను పెండింగ్ లేకుండా ప్రతినెలా చెల్లిస్తాం. అమరావతి ప్రాంతంలో అసంపూర్తి భవనాలు చూస్తే బాధేస్తోంది.

జగన్ ఎన్ని కుట్రలు చేసినా ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని – జై అమరావతి అన్నదే మా నినాదం. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడిన జగన్ ఒక్క ఇటుక వేయకలేదు, విశాఖలో భూ కుంభకోణాలు తప్ప ఒక్క అభివృద్ధి జరగలేదు. అమరావతి రాజధాని పనులు కొనసాగించి ఉంటే లక్షమందికి ఉపాధి లభించేది. జగన్ అండ్ కో తో రాజమౌళి సినిమా తీస్తే ఆస్కార్ అవార్డు రావడం గ్యారంటీ. 2019లో కోడికత్తి ఘటన జరిగాక బాబాయి శవం లేచింది. తాజాగా స్పెషల్ గులకరాయి సిఎంతోపాటు వెల్లంపల్లి రెండుకళ్లకు తగిలింది. జగన్ బస్సు యాత్ర సాగినంత సేపు నుదుటిపై బ్యాండేజ్ రోజురోజుకు పెద్దదైంది. యాత్ర పూర్తికాగానే గాయం ఆటోమేటిక్ గా మాయమైంది.

ఇక ఇటువంటి డ్రామాలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. మీ బిడ్డనంటూ పదేపదే అంటున్న జగన్ ప్రజల భూములు కొట్టేసేందుకు నయా ప్లాన్ వేశారు. ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తారట. ఆయన ఆస్తులు ఇచ్చినట్లు పత్రాలపై ఫోటో వేసుకుంటున్నాడు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా విలువైన ఆస్తులు లాగేస్తారు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతున్నా.

అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచుతాం. వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తాం. జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వ సహకారం అవసరం. విజనరీ లీడర్ చంద్రబాబునేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నదే మా లక్ష్యం. అందరం కలసికట్టుగా కష్టపడి రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి చేసుకుందామని నారా లోకేష్ పేర్కొన్నారు

LEAVE A RESPONSE