టీడీపీ అనుకూల పత్రికలకు ఏపీలో గుంతలేగాని రోడ్లు సహా ఇంకేవీ కనిపించవు!

ఎంపి విజయసాయిరెడ్డి

తెలుగుదేశం, ఈ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబం, ఆయన భజనపరులు, బంధుమిత్రుల ప్రయోజనాలే తమ ప్రయోజనాలుగా కొన్ని తెలుగు దినపత్రికలు భావిస్తాయి. ఉత్తమ జర్నలిజం సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ నిండా పసుపు పూసుకుని ఈ పత్రికలు అన్ని పరిణామాలను, దృశ్యాలను తమ కోణంలో వార్తలుగా ప్రచారం చేస్తాయి. ఈ పక్షపాత పత్రికలకు తాము చూడాలనుకున్నవే కనిపిస్తాయి.

పేద, సామాన్య ప్రజానీకానికి మేలు చేసే పరిణామాలు గాని, పథకాలుగాని ఈ తెలుగు పత్రికల కంట పడవు. 2019 వేసవిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఈ పసుపు పత్రికల వార్తలు చూస్తే ఎవరికైనా పై అభిప్రాయం కలుగుతుంది. అందుకే, ఏపీ ప్రభుత్వం విధానాల వల్ల లబ్ధిపొందిన సాధారణ ప్రజానీకం ఈ పచ్చ పత్రికల తప్పుడు వార్తలను, దుష్ప్రచారాన్ని నమ్మడం లేదు. ఈ పత్రికల వంకర చూపునకు, దృష్టి లోపానికి మంచి ఉదాహరణ రాష్ట్రంలోని రహదారుల స్థితిగతులపై నిరంతరం అవి చేస్తున్న వ్యతిరేక ప్రచారం.

ఈ పత్రికలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేసే మంచి సంక్షేమ, అభ్యుదయ పథకాలు కనిపించవు. మంచి నిర్వహణలోని రహదారులు ఎక్కడా కనపడవు. పెరుగుతున్న ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తి, ప్రగతి మార్గంలో సాగుతున్న వారి జీవనశైలి కూడా వాటి కంటపడవు. పరిపాలనకు సంబంధించి కొద్ది రంగాల్లో అక్కడక్కడా చాలా అరుదుగా జరిగే లోపాలు మాత్రమే ఈ మీడియా వార్తలకు ఆధారాలవుతాయి. మరీ ముఖ్యంగా రాష్ట్ర సర్కారు పరిధిలోకి వచ్చే రహదారులపైనే గత ఏడాది కాలంగా ఈ పత్రికలు పదే పదే వ్యతిరేక వార్తలు ప్రచురిస్తున్నాయి. అన్ని రహదారులూ వాటి కళ్లకు కనిపించవు. రోడ్లపై ఉన్న గుంతలు మాత్రమే అనేక వార్తాకథనాలు వండి వార్చడానికి ముడిసరుకు అవుతున్నాయి. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో అనేక రహదారులు అధ్వాన్నంగా ఉన్నా ఈ తెలుగు డైలీ పేపర్ల దృష్టికి రాలేదు.

ఇప్పుడేమో ఇలా వక్ర దృష్టితో వార్తలు అందించే ఈ పత్రికలు కేవలం రోడ్ల స్థితిగతుల ఆధారంగా నిరాధార వార్తలు ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీని సమాధి నుంచి లేపడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఒక శాతం కూడా లేని పరిస్థితుల్లో ఏపీ రహదారులను ఆయనకు ‘రాచబాట’గా మార్చాలని చూడడం ఈ పత్రికల ముర్ఖత్వమే తప్ప మరొకటి కాదు.

Leave a Reply