Suryaa.co.in

Andhra Pradesh

ఎన్‌ఆర్‌ఐ వైద్యుడు ఉయ్యూరు లోకేశ్‌కు మళ్లీ చేదు అనుభవం

ఎన్‌ఆర్‌ఐ వైద్యుడు ఉయ్యూరు లోకేశ్‌కు మళ్లీ చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ఆయనను ఢిల్లీ ఎయిర్ పోర్టు పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే దీనికి ముందు ఆదివారం గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత ఆయనకు అరెస్ట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. తిరిగి అమెరికా వెళ్ళడం కోసం ఢిల్లీ వెళ్లిన డాక్టర్ లోకేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

డాక్టర్ లోకేష్ సీఎం జగన్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేశాడని లోకేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సమచారం పోలీసుల ద్వారా ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులకు అందింది. ఆ తరువాత నిన్న రాత్రి డాక్టర్ లోకేష్‌కు 41A CRPC కింద నోటీసులు జారీ చేశారు. ఈనెల 30న హాజరు కావాలని కూడా తెలిపారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేయడంతో డాక్టర్ లోకేష్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రావలసిందిగా అధికారులు తెలిపారు.

ఆయన అనుమతి లేకుండా శాటిలైట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలపై గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎన్‌ఆర్‌ఐ వైద్యుడు ఉయ్యూరు లోకేశ్‌ను ఆదివారం విమానాశ్రయ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీసులకు అప్పగించారు. అమెరికా పౌరుడు అయిన డాక్టర్ లోకేష్ అమెరికా వెళ్లే క్రమంలో ఢిల్లీ చేరుకునేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అతన్ని చెక్ ఇన్ చేస్తున్నప్పుడు విమానాశ్రయ భద్రతా సిబ్బంది అతని సామాను తనిఖీ చేసి శాటిలైట్ ఫోన్‌ను గుర్తించారు.

భారత్‌లో ఆ ఫోన్‌ను ఆపరేట్ చేయడానికి అతనికి ఎలాంటి అనుమతి లేదని వెల్లడించారు. ఆ తర్వాత అతడిని గన్నవరం పోలీసులకు అప్పగించారు. ఆ క్రమంలో తాను వర్జీనియాలో ఫోన్‌ను కొనుగోలు చేసి, తనతో పాటు భారత్‌కు తీసుకొచ్చానని పోలీసులకు చెప్పారు. విచారణకు సహకరిస్తానని హామీ ఇవ్వడంతో విడుదల చేశారు.

LEAVE A RESPONSE