– ఉద్యోగుల పోస్టల్ ఓట్లపై సర్కారు ఉక్కుపాదం
– గెజిటెడ్ సంతకం లేని పోస్టల్ ఓట్లు చెల్లకుండా వైసీపీ వ్యూహం
– మొహమాటపు ముసుగుతీసి ఉద్యోగులపై కత్తి దూసిన వైసీపీ
– గెజిటెడ్ సంతకానికి మినహాయింపు ఇచ్చిన సీఈఓ
– ఈసీ నిర్ణయంపై హైకోర్టుకు వెళతామన్న వైవి సుబ్బారెడ్డి
– పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై సంతకం చేయించాల్సిన బాధ్యత ఎవరిది?
– ఆర్వోలను గుప్పెట్లో పెట్టుకుని గందరగోళం సృష్టించిందెవరు?
– చిలకలూరిపేట ఘటనలో ఆర్వోపై సీఎస్ ఎందుకు చర్య తీసుకోలేదు?
– ఇప్పుడు డిక్లరేషన్పై గెజిటెడ్ మెలికతో ఓట్లు తగ్గించాలన్న కుట్ర
– మేం అధికారుల ముందే బ్యాలెట్ వేశాం కదా అంటున్న ఉద్యోగులు
– ఆర్వోల వైఫల్యానికి తామెలా బాధ్యులమని ఉద్యోగుల ప్రశ్న
-ఉద్యోగ సంఘ నేతల వైఫల్యంపై ఉద్యోగుల కన్నెర్ర
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఐదులక్షల పైచిలుకు ఉద్యోగుల నిర్ణయాన్ని వెక్కిరిస్తూ.. వైసీపీ చేస్తున్న ప్రకటనలపై ఉద్యోగులు మండిపడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన ఉద్యోగులు, మిగిలిన ఉద్యోగులతోపాటు, రిటైరయిన ఉద్యోగులు తమకు వ్యతిరేకంగా ఓటు వేశారన్న ఆగ్రహంతో రగిలిపోతున్న వైసీపీ.. అసలు ఏకంగా వారి ఓట్లే చెల్లకుండా చేసే మయోపాయానికి తెరలేపింది. వారి కుటుంబాలకు సంబంధించిన ఓట్లు దాదాపు 35 లక్షల నుంచి 50 లక్షల వరకూ ఉండవచ్చన్నది ఒక అంచనా.
ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ వెనుక గెజిటెడ్ అధికారి సంతకం లేకపోతే, ఆ ఓటు చెల్లనట్లు పరిగణించాలన్న డిమాండ్కు వైసీపీ పదునుపెడుతోంది. ఆ రకంగా తమ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసిన వారి ఓట్లు, చెల్లుబాటు కాకుండా చేయాలన్నదే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే తమ ఉద్యోగుల ఓట్లకు కత్తెర వేసేందుకు.. పాలకపార్టీ ఇన్ని కుయుక్తులు పన్నుతున్నా, ఉద్యోగసంఘ నేతలు ముసుగుతన్ని పడుకోవడాన్ని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు.
తమకు సకాలంలో గెజిటెడ్ అధికారి సంతకం పెట్టేలా చూడటమే కాకుండా, ఎలాంటి అడ్డంకులు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. గెజిటెడ్ సంతకంపై, సత్వర నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదే బాధ్యత అని వారు స్పష్టం చేస్తున్నారు. అసలు తొలుత ఈ విషయంలో అశ్రద్ధ వహించిన చిలకలూరిపేట ఆర్వోపై, సీఎస్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు.
చాలాచోట్ల తమకు అనుకూలమైన ఆర్వోలను వ్యూహాత్మకంగా నియమించుకోవడం ద్వారా, ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారాన్ని కావాలనే గందరగోళంగా మార్చారంటున్నారు. దీనితో పోస్టల్ బ్యాలెట్ దాఖలుకు ముందురోజు వరకూ సంతకం వ్యవహారాన్ని సాగదీశారంటున్నారు. అయితే ఈ విషయంలో సీఈఓ జోక్యం చేసుకుని, డిక్లరేషన్పై గెజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా, పోస్టల్ బ్యాలెట్ ఓటు చెల్లుతుందని స్పష్టం చేయడంతో, ఉద్యోగులు ఊపిరిపీల్చుకున్నారు.
అసలు నిజానికి గతంలో పోస్టల్ బ్యాలెట్ ఓటు, బ్యాలెట్ బాక్సులో వేసే విధానం ఉండేది కాదు. దానిని తమను సంతృప్తిపరిచిన రాజకీయ పార్టీల ప్రతినిధుల చేతికే ఇచ్చేవారు. కానీ ఈసారి ఆ సంప్రదాయం మారిపోయి, బ్యాలెట్ పేపర్ ఇచ్చి దానిని తమ ఎదుటే బాక్సులో వేసే పద్దతికి ఈసీ తెరలేపింది. ఫలితంగా ఉద్యోగులను బ్రతిమిలాడి-ప్రలోభపెట్టి-బెదిరించి వారి బ్యాలెట్ పేపర్లు తీసుకుని, తామే ఓటు వేయాలనుకున్న అధికార పార్టీ ఆశలు అడ్డం తిరిగాయి. దానితో ‘ సర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఉద్యోగుల ఓట్లు, చెల్లుబాటు కాని వ్యూహానికి అధికార పార్టీ తెరలేపింది.
ఆ మేరకు ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా.. హైకోర్టుకు వెళతామన్న వైసీపీ ఎంపి వైవి సుబ్బారెడ్డి ప్రకటనపై ఉద్యోగులు కారాలు, మిరియాలు నూరుతున్నారు. దీనిపై వారు సీఎస్కు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రభుత్వం తప్పు చేసి తమకు శిక్ష వేయడం ఏమిటని నిలదీస్తున్నారు.
“మా ఓటు హక్కుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత సీఎస్. గెజిటెడ్ సంతకాలు కావాలని తొలుత చెప్పాల్సింది. దానిపై వీలైనంత జాప్యం-గందరగోళం సృష్టించింది మేం కాదు. అసలు చిలకలూరిపేట ఘటనలో బాధ్యుడైన ఆర్వోపై సీఎస్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? తమ విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆర్వోలను సీఎస్ ఎందుకు కాపాడారు? సీఎస్ విఫలమైతేనే కదా ఈసీ జోక్యం చేసుకుని మాకు న్యాయం చేసింది? అయినా మేమేమీ దొంగఓట్లు వేయలేదు కదా? అధికారులు, పోలీసుల ఎదుటే మా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నాం. 12-డి, 13-ఏ, 13–బి, 13–సి అన్నీ ఆర్వోల సమక్షంలో పూర్తి చేసి, 13-ఏ,13-బి కలిపి ఒకే కవర్లో బాక్సులో వేశాం కదా? అప్పుడు మా ఓట్లు చెల్లకుండా ఎందుకు పోతాయి? మాకు సకాలంలో గెజిటెడ్ అధికారుల సంతకం చేసి, ఓటు వేసే వెసులుబాటు కల్పించాల్సిన సీఎస్ తన బాధ్యతల్లో విలమమైతే, మాకు శిక్ష ఎలా వేస్తారు? అంటే తప్పు సీఎస్. శిక్ష మాకా ?” అని ఉద్యోగులు విరుచుకుపడుతున్నారు.
ఏదేమైనా ఎన్నికల ముందు వరకూ ‘మాది ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. వారి వ్యతిరేక ప్రభుత్వం కాద’ని మీడియాముందుకొచ్చి చెప్పిన వైసీపీ.. ఇప్పుడు బాహాటంగానే వారి ఓట్లు చెల్లకుండా చేసేందుకు, తన మొహమాటపు ముసుగు తొలగించింది. అంటే ఉద్యోగులకు వ్యతిరేకంగా వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చింది. డి క్లరేషన్పై గెజిటెడ్ అధికారి సంతకం లేని పోస్టల్ ఓటును, చెల్లకుండా చేసేందుకు వైసీపీ హైకోర్టు గడప తొక్కేందుకు సిద్ధమవుతోంది.
కాగా తమ పోస్టల్ ఓట్లకు గండికొట్టేందుకు.. వైసీపీ సర్కారు కుట్ర స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, తమ సంఘం నేతలు ప్రతిఘటించకుండా బెల్లంకొట్టిన రాయిలా కూర్చోవడాన్ని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటివరకూ జగన్ సర్కారుకు భట్రాజులు సైతం ఈర్ష్యపడేలా భజన చేసిన సంఘాలు, తమకు జరుగుతున్న అన్యాయంపై సీఎస్ను కలసి ఆయనపై పోరాడేందుకు ఎందుకు భయపడుతున్నాయి? హైకోర్టుకు వెళతామన్న వైవి సుబ్బారెడ్డి ప్రకటనను ఖండించేందుకు ఎందుకు భయపడుతున్నాయి? అని ఉద్యోగులు విరుచుకుపడుతున్నారు.