– ప్రధాన ప్రతిపక్ష హోదా లేని వైనం
– 22 స్థానాలతో జనసేన
– 11మంది ఎమ్మెల్యేల వైసీపీకి సీటెక్కడ కేటాయిస్తారు?
– ఫ్లోర్‌లీడర్‌గా జగన్‌కు మొదటి వరస ఉంటుందా?
– జగన్‌కు మాట్లాడే అవకాశం ఉంటుందా?
– 19 తర్వాత అసెంబ్లీ సమావేశాలు?
– అందరి చూపూ అసెంబ్లీ వైపే?
– అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షనేత ఎవరు?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ అసెంబ్లీ సమావేశాల కోసం యావత్ తెలుగు ప్రజలు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కారణం వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి. అసెంబ్లీలో జగన్-ఆయన పార్టీకి ఏ వరసలో సీట్లు కేటాయిస్తారన్నదే ఆ ఉత్కంఠకు కారణం.
నిబంధనల ప్రకారం చూస్తే.. అసెంబ్లీలో బలాబలాల ప్రకారమే సీట్లు కేటాయిస్తుంటారు. ప్రధాన ప్రతిపక్షనేత హోదా దక్కాలంటే, అందుకు తగిన సంఖ్యాబలం అసెంబ్లీలో ఉండాలి. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభాపక్ష నేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో, కాంగ్రెస్ పక్ష నేతగా పి.జనార్దన్‌రెడ్డి ఉండేవారు. అప్పుడు కాంగ్రెస్ సంఖ్య 26. కానీ 29 సీట్లు వస్తే గానీ ప్రధాన ప్రతిపక్షనేత హోదాతోపాటు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా దక్కని పరిస్థితి. దానితో పిజెఆర్ కేవలం ఫ్లోర్‌లీడర్‌గానే వ్యవహరించారే తప్ప,ప్రధాన ప్రతిపక్షనేత కాలేకపోయారు.
ఆ తర్వాత కేసీఆర్ శాసనసభాపక్ష నేతగా ఉన్నప్పుడు.. తెలంగాణ శాసనసభలో మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ గానీ, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క గానీ.. వారి పార్టీల ఫ్లోర్ లీడర్లుగా వ్యవహరించేరే తప్ప, ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. ఆవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేత లేకుండానే తెలంగాణ అసెంబ్లీ నడిచింది.
ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్న నేతకు క్యాబినెట్ హోదా దక్కుతుంది. పీఎస్-పీఎలు నియమించుకోవచ్చు. వారి సంఖ్య ప్రకారం అసెంబ్లీ లాబీల్లో వారికి ఆఫీసులు కేటాయిస్తుంటారు. గతంలో వైఎస్, చంద్రబాబునాయుడుకు అలాగే ఆఫీసులు కేటాయించారు. ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షనేతకు ప్రొటోకాల్ ఉంటుంది. అసెంబ్లీలో అటు వైపు ఆయనకు, మొదటి వరసలో ఇద్దరు ఉన్న సీటు కేటాయిస్తారు. ఇది అసెంబ్లీ వ్యవహారాలు చూసే వారికి తెలిసిన విషయాలే.
కానీ ఇప్పుడు ఏపీలో ఒక విచిత్రమైన అంశం తెరపైకి వచ్చింది. టీడీపీ తర్వాత 22 సీట్లు సాధించిన పార్టీగా జనసేన అవతరించింది. సాధారణంగా అయితే ఆ పార్టీకే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలి. కానీ జనసేన ఎన్నికలకు ముందే టీడీపీతో కలసి మిత్రపక్షంగా ఉంటూ, అదే పద్ధతిలో ఎన్నికల్లో పోటీ చేసింది. పైగా తాజా మంత్రివర్గంలో ఆ పార్టీ భాగస్వామిగా ఉంది.
కాబట్టి సాంకేతికంగా జనసేన మితపక్షమే తప్ప ప్రధాన ప్రతిపక్షం కాదు. అలాగని 11 సీట్లు మాత్రమే సాధించిన వైసీపీ కూడా ప్రధాన ప్రతిపక్షం కాదు. దాని నేత జగన్ కేవలం ఫ్లోర్ లీడర్ మాత్రమేప్ప, ప్రధాన ప్రతిపక్షనేత కాదు. ఈ పరిస్థితిలో అసలు ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరు? అన్నది ఆసక్తికరంగా మారింది.
దానితోపాటు మాజీ సీఎం, వైసీపీ పక్ష నేత జగన్‌కు ఏ వరసలో సీట్లు కేటాయిస్తారు? ఆ పార్టీ సభ్యులకు సీట్లు ఎక్కడ కేటాయిస్తారు? జగన్ మాట్లాడేందుకు ఎంత సమయం కేటాయిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. సహజంగా సభలో ఆయా పార్టీల బలాబలాలను బట్టి వారికి మాట్లాడే అవకాశం ఇస్తారు. అది బీఏసీలో ఖరారవుతుంది.
మామూలుగా అయితే ఎక్కువ సంఖ్యా బలం ఉన్న వారికి ఎక్కువ సమయం కేటాయిస్తే, ప్రధాన ప్రతిపక్షానికి ఆ సంఖ్య ప్రకారం మాట్లాడే అవకాశం ఇస్తారు. ఇప్పుడు జగన్ పార్టీకి వచ్చింది కేవలం 11 సీట్లే కాబట్టి, వైసీపీకి పెద్దగా మాట్లాడే అవకాశం- సమయం ఇవ్వరు. ఏదైనా కీలకమైన ప్రజాసమస్యల అంశం ఉంటే.. అది కూడా స్పీకర్ దయతలిస్తే కొంత సమయం అదనంగా కేటాయిస్తుంటారు. లేదంటే బయటకు వచ్చి మీడియా పాయింట్ వద్ద మాట్లాడాల్సిందే.
అయితే ఇప్పుడు జగన్‌కు అటు వైపు మొదటి వరసలో సీటు కేటాయిస్తారా? సంఖ్యాబలం ప్రకారం వెనుక సీట్లు కేటాయిస్తారా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఫ్లోర్‌లీడర్ కాబట్టి, జగన్‌కు అటు వైపు మొదటి సీటు కేటాయించవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇక వైసీపీకి కేవలం 11 స్థానాలే వచ్చినందున, ఆ పార్టీకి లోపల ఒక చిన్న గది మాత్రమే కేటాయించే అవకాశాలున్నాయి. తమకు పెద్ద ఆఫీసు కేటాయించాలని ఆ పార్టీ స్పీకర్‌కు లేఖ రాసినా, దాన్ని పట్టించుకునే అవకాశాలు కూడా ఉండవు.
జగన్ తొలిసారి విపక్ష నేతగా ఉన్నప్పుడు, ఆ పార్టీకి స్పీకర్ కోడెల పెద్ద ఆఫీసునే కేటాయించారు. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీకి, అందులో సగం విస్తీర్ణం ఉన్న గది కూడా కేటాయించకపోవచ్చని చెబుతున్నారు. కాగా ఈనెల 19న జనసేన దళపతి పవన్, మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో.. అసెంబ్లీ సమావేశాలు 20 తర్వాత ఉండవచ్చంటున్నారు.