Suryaa.co.in

Telangana

బొగ్గు గనులు సింగరేణికే ఉండాలని కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదు?

-నీట్ పై సీఎం రేవంత్ వైఖరి ఏమిటో చెప్పాలి
-నీట్ ప్రశ్న పత్రాలను లక్షలు పెట్టి కొన్నారు.. ఈడీ జోక్యం చేసుకోదా ?
-గనులు ప్రైవేటు వారికి ధారదత్తం చేయాలని కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి పథకం
– మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

హైదరాబాద్: మేడి గడ్డ బ్యారేజ్ ను ఎవరు అధికారం లోకి వస్తే వారు మరమ్మత్తులు చేస్తారని అందరూ భావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రిపేర్ చేయక పోగా గత కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలు వేయడానికి ప్రయత్నించింది. విలువైన సమయాన్ని ప్రభుత్వం వృధా చేసింది.

ఇపుడు మరో కుట్ర కు కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపింది. మేడి గడ్డ బ్యారేజ్ నుంచి 92 లక్షల క్యూబిక్ మీటర్ల టన్నుల ఇసుక ను తరలించేందుకు టెండర్లు పిలిచారు. ఇది కాంగ్రెస్ నేతల జేబులు నింపడానికే. రేవంత్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునస్సమీక్షించాలి. ఈ టెండర్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధం. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే మేము కోర్టులను ఆశ్రయిస్తాం.

రైతులకు నీళ్లిచ్చే శ్రద్ద లేదు కానీ ఇసుక దొబ్బి పోయే ప్రణాళిక ను కాంగ్రెస్ నేతలు అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఇసుక సహా అన్ని దందాల్లో కూరుకుపోయారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖనిజాల వేలానికి డెడ్ లైన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. సింగరేణి విషయం లోనూ అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ గనులు సింగరేణి కి ఇవ్వాలని మేము డిమాండ్ చేశాం ..రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలి. కాంగ్రెస్ బీజేపీ లు ఒక్కటై సింగరేణి గనులను ప్రైవేటు పరం చేయాలని కుట్ర పన్నాయి.

ఈ నెల 21 న దేశ వ్యాప్తంగా 52 బొగ్గు బ్లాకులు వేలం వేస్తారని సమాచారం ఉంది. ఇందులో సింగరేణి బ్లాకులు కూడా ఉన్నాయని మాకు అనుమానం ఉంది. సింగరేణి బొగ్గు గనులు సింగరేణి కే ఉండాలని సీఎం రేవంత్ కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీకి సున్నపు రాయి గనులు , బయ్యారం స్టీల్ ప్లాంట్ కు ఇనుప ఖనిజం కేటాయించేలా కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి.

నీట్ పరీక్షను రద్దు చేసి తక్షణమే నిర్వహించాలి. నిన్న మా విద్యార్ధి విభాగం రాజ్ భవన్ ను ముట్టడించింది. గొర్రెల కొనుగోలు లో ఏవో అవకతవకలు జరిగాయని ఈడీ జోక్యం చేసుకుంది. నీట్ ప్రశ్న పత్రాలను లక్షలు పెట్టి కొన్నారు. అందులో ఈడీ జోక్యం చేసుకోదా ? నీట్ పై సీఎం రేవంత్ వైఖరి ఏమిటో చెప్పాలి. నీట్ పై కూడా కాంగ్రెస్ బీజేపీ లు కుమ్మక్కయ్యాయి.

రేవంత్ రెడ్డి కి కమీషన్ల మీదున్న శ్రద్ద ప్రజల సమస్యల మీద లేదు. తెలంగాణ లో అన్ని వర్గాలు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి లు అన్నదమ్ముల్లా తెలంగాణ గనులు ప్రైవేటు వారికి ధారదత్తం చేయాలని పథకం వేసినట్టు ఉన్నారు.

LEAVE A RESPONSE