Suryaa.co.in

Telangana

తలిదండ్రులూ.. మీపిల్లలను ఓ కంట కనిపెట్టండి

-డ్రగ్స్ బారిన పడకుండా చూడటం అందరి బాధ్యత
-సర్కారుమీద బాధ్యత వదిలే స్తే సరిపోదు
-తలిదండ్రులు, టీచర్ల పైనా బాధ్యత
-సమాజం దారి తప్పకుండా చూద్దాం
-డ్రగ్స్‌పై రేవంత్ సర్కారు ఉక్కుపాదం
– మంత్రులు జూపల్లి, సీతక్క

హైదరాబాద్: అంత‌ర్జాతీయ మాద‌క ద్ర‌వ్యాల దుర‌ల‌వాటు – అక్ర‌మ ర‌వాణా వ్య‌తిరేక దినోత్స‌వం సంద‌ర్భంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, DEPWD ఆద్వ‌ర్యంలో శిల్పక‌ళా వేదిక‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఎక్సైజ్, ప్రొహిబిష‌న్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అన‌సూయ సీత‌క్క పాల్గొన్నారు.

యాంటీ డ్ర‌గ్ అవెర్నెస్ పై అగ్ర న‌టుడు, ప‌ద్మ‌ విభూష‌ణ్ చిరంజీవి.. సందేశంతో కూడిన థియోట్రిక‌ల్ అడ్వ‌టైజ్మెంట్ వీడియోను మంత్రులు ఆవిష్క‌రించారు. అనంత‌రం పోస్ట‌ర్ ను, టీజీ న్యాబ్ ఎస్పీ బాస్క‌ర్ ర‌చించిన… రామ్ మిర్యాల పాడగా.. సీనియ‌ర్ న‌టులు స‌మ‌న్ న‌టించిన … ప్ర‌జ‌ల తెలంగాణ పౌరులారా రండి అనే పాట‌ను మంత్రులు ఆవిష్క‌రించారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి ఏమన్నారంటే.. సకల జీవ కోటిలో మానవ జన్మ ఉత్కృష్టమైనది. కానీ చెడు అలవాట్ల ద్వారా అనారోగ్యం పాలై చాలా మంది అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. ఉగ్ర‌వాదం త‌ర్వాతప్ర‌పంచానికి మాద‌క ద్ర‌వ్యాల వినియోగం అంతటి పెను స‌వాలుగా మారింది. చాలా మంది తెలియకుండానే డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారు.

మాద‌క ద్రవ్యాలు, మ‌త్తు ప‌దార్థాలు.. శారీరక, మానసిక రుగ్మతలను కలిగించడమేకాక, సమాజంలో నైతిక విలువలను దారుణంగా దిగజారుస్తున్నాయి. మత్తు పదార్థాలు రకరకాల రూపంలో పాఠ‌శాల‌, కళాశాలల విద్యార్థులకు చేరడం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ధూమపానం మద్యపానంతో సరదాగా మొదలయ్యే అలవాటు క్రమంగా మాదక ద్రవ్యాల దాక విస్తరిస్తుంది.

తెలంగాణలో సీయం రేవంత్ రెడ్డి సార‌ద్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడానికి ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపోదించి.. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని చేయాలని భావించి ప్రత్యేక చర్యలు చేపట్టింది.

ఈ నేప‌థ్యంలోనే మాద‌క ద్ర‌వ్యాల నియంత్ర‌ణ‌కు Telangana Anti-Narcotics Bureau (TG-NAB) బ‌లోపేతం చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. TG-NAB, ఎక్సైజ్, పోలీస్, రైల్వే పోలీస్ శాఖ‌లు బహుముఖ వ్యూహంతో..స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే డ్ర‌గ్స్, అక్ర‌మ‌ మ‌ద్యం, క‌ల్లీ క‌ల్లు, గుడుంబా, దేశీదారు, గుట్కా, జ‌ర్ధా లాంటి ఇత‌ర మ‌త్తు ప‌దార్థాల నియంత్ర‌ణే లక్ష్యంగా కార్యాచ‌ర‌ణ‌ రూపొందించి అమలు చేస్తుంది.

నేరస్థులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. వాటి రవాణాను సమర్ధంగా నిరోధించడం, తయారీదారులు, రవాణా చేస్తున్న వారికి కఠిన శిక్షలు పడేలా ప్రత్యేక కార్యాచరణ అమ‌లు చేస్తాం. ఎన్ని చేసిన యువ‌త‌, విద్యార్థుల ఆలోచ‌న ధోర‌ణి మారాలి. పిల్ల‌లను.. త‌ల్లిదండ్రులు ఓ కంట క‌నిపెడుతుండాలి. విద్యార్థులు చ‌దువుతో పాటు ఆట పాట‌ల‌కు స‌మ‌యం కేటాయించాలి. ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించాలి.

ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌తో పాటు ఉపాధ్యాయుల, త‌ల్లిదండ్రుల ప‌ర్య‌వేక్ష‌ణ కూడా ఎంతో అవ‌స‌రం. మాద‌క ద్ర‌వ్యాలు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌.. వాటికి అల‌వాటు ప‌డ్డ‌వారి స‌మాచారాన్ని పోలీసుల‌కు చెర‌వేయాలి. మాద‌క ద్ర‌వ్యాల నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తుంది. ఎన్ని నిధులైన వెచ్చించ‌డానికి వెనుకాడేది లేదు.

ఈ సందర్భంగా మంత్రి అన‌సూయ సీతక్క ఏమన్నారంటే.. మాదకద్రవ్యాల మాఫియా ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. మాఫియా కోట్లాది రూపాయలు కొల్లగొడుతుంది. గంజాయి జాడ్యం గ్రామాలకు విస్తరించింది. యువత, విద్యార్థులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కుటుంబాలు చితికిపోతున్నాయి. మానసిక కుంగుబాటుతో పాటు అచేతనంగా మిగిలిపోతున్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే సమాజంలో తలెత్తుకు తిరగలేరు.

సమాజం మత్తు బానిసలను చీడపురుగుల చూస్తుంది అని గ్రహించాలి. గంజాయి మత్తులో లైంగిక దాడులు, హత్యలు చేస్తున్నారు.పెద్దపల్లి లో చిన్నారిపై లైంగిక దాడి, హత్య ఘటన బాధించింది. మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడాలి. విద్యార్థులు, యువత తల్లిదండ్రులు ఆశయాలకు అనుగుణంగా నడుచుకుని వారి కలలను సాకారం చేయాలి.

క్షణికావేశంలో చేసే తప్పిదాల వల్ల బంగారు భవిష్యత్ నాశనం అవుతుందని గుర్తెరిగి నడుచుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి… డ్రగ్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ లకు, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మాదక ద్రవ్యాలు సరపరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం
ఈ కార్య‌క్ర‌మంలో ఇండియ‌న్ విమెన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ ప‌ద్మ‌శ్రీ మిథాలి రాజ్, సీనియ‌ర్ న‌టులు సుమ‌న్, యువ హీరో (హ‌న్ మాన్ ఫేం) శ్రీ తేజ సజ్జ‌, డీజీపీ ర‌వి గుప్తా, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, టీజీ న్యాబ్ డైరెక్ట‌ర్ సందీప్ శాండిల్యా, ఎక్సైజ్ శాఖ క‌మిష‌న‌ర్ శ్రీధ‌ర్, డీసీఏ డైరెక్ట‌ర్ క‌మ‌లాస‌న్ రెడ్డి, DEPWD డైరెక్ట‌ర్ శైల‌జ‌, త‌దిత‌రులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE