Suryaa.co.in

Editorial

బల్లికురువలో దర్జాగా వెలిగిపోతున్న అవినాష్ క్వారీ బిజినెస్

– చీమకుర్తిలోనూ ఆగని మైనింగ్ మెరుపులు
– ప్రకాశంలో వెలిగిపోతున్న వైసీపీ నేతల వ్యాపారాలు
– సర్కారు మారినా బేఫికర్‌గా బిజినెస్
– వైసీపీ జమానాలో టీడీపీ నేతల వ్యాపారాలకు వేధింపులు
– క్వారీ, మైనింగ్‌లను బలవంతంగా స్వాధీనం చేసుకున్న దాదాగిరి
– నాటి మంత్రికి వ్యాపారాల్లో వాటాలు
– ఇవ్వని వారి వ్యాపారాలకు అడ్డంకులు, విజిలెన్స్ వేధింపులు
– గొట్టిపాటి రవి వ్యాపారాలకూ కోట్ల నష్టం
– ఇప్పుడు టీడీపీ వచ్చినా వైసీపీ వ్యాపారాలకు బేఫికర్
– అడ్డేలేని అవినాష్‌రెడ్డి కుటుంబ వ్యాపారాలు
– టీడీపీ శ్రేణుల విస్మయం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ప్రకాశం జిల్లా పేరు చెప్పగనే మొదట గుర్తుకొచ్చేది చీమకుర్తి. తర్వాత బలికురవ. ఎందుకంటే ఇక్కడే వేలకోట్ల రూపాయల మైనింగ్, క్వారీ వ్యాపారాలు జరుగుతుంటాయి. దొంగబిల్లులతో కోట్లకు పడగలెత్తిన బడాబాబుల సంఖ్య డజన్లపైనే ఉంటుంది. ఒకటే బిల్లుతో ఎగుమతి చేసే మైనింగ్ వ్యాపారంలో పోలీసు-విజిలెన్సు-అధికారపార్టీ-మీడియా.. అందరూ భాగస్వాములే. వీరి లోడు చేసే లారీలకు ఎక్కడా తనిఖీలుండవు.

అటు నెల్లూరు తడ వైపు.. ఇటు మాచర్ల వైపు వరకూ ఏ చెక్ పోస్టు దగ్గరా చెకింగ్ ఉండదు. చిన్న స్లిప్పు చూపిస్తే చాలు. వాటికి రాజప్రవేశమే. చదివింపులన్నీ ఇక్కడ పూర్తయిన తర్వాతే వాటికి పచ్చజెండా. కారణం.. మూమూలే! ఇక పోర్టుల్లో అయితే చెప్పే పనేలేదు. టాక్సులు ఎలా ఎగ్గొట్టాలో వీరికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఎవరైనా విజిలెన్సు-పోలీసు అధికారి ఈ వ్యాపారాలపై కన్నేస్తే, వారిని తక్షణమే శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. అంత పవర్‌ఫుల్ లాబీ అది.

అలాంటి జిల్లాలో గత ఐదేళ్లు చక్రం తిప్పిన కడప వైసీపీ ఎంపి, మాజీ సీఎం జగన్ సోదరుడు అవినాష్‌రెడ్డి కుటుంబం హవా పార్టీ అధికారం కోల్పోయినా ఇంకా దేదీప్యమానంగా వెలగడమే తమ్ముళ్ల విస్మయానికి కారణం. ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, బల్లికురువ, మార్టూరు, గురిజేపల్లి, వేమవరం, సంతమాగులూరు గ్రామాలు మైనింగ్, క్వారీలకు ప్రసిద్ధి. ఇక్కడి క్వార్డ్జ్, గెలాక్సీ, బ్లాక్‌స్టోన్ చైనాకు సైతం ఎగుమతి అవుతాయి. కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న ఈ ప్రాంతాలు, రాజకీయ పార్టీలకు ప్రధాన ఆదాయ వనరన్నది బహిరంగ రహస్యం. ఇక్కడి మైనింగ్ జిల్లా అధికారి పోస్టింగ్ కోసం భారీ స్థాయిలో పైరవీలు జరుగుతుంటాయి.

ఏ పార్టీ అధికారంలో ఉంటే, విపక్షాల మైనింగ్ వ్యాపారాలపై దాడులు, వేధింపులు జరుగుతుండటం వైఎస్ జమానా నుంచి మొదలయింది. అప్పట్లో టీడీపీలో ఉన్న శిద్దా రాఘవరావు కుటుంబాన్ని వైఎస్ సర్కారు ఆర్ధికంగా దెబ్బతీసింది. అక్కడ జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రులు ఎవరన్నా వారు నిమిత్తమాత్రులే. ‘‘పై స్థాయిలోనే మాట ముచ్చట’’ జరుగుతుంటుంది.

గురిజేపల్లి, బల్లికురవ, మార్టూరు, వేమవరం, సంతమాగులూరులో పెద్ద క్వారీలు ఉన్నాయి. చీమకుర్తిలో మైనింగ్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలోని బిగ్‌షాట్స్ అందరికీ చీమకుర్తిలోనే గానైట్ కంపెనీలుండతటం విశేషం. నెల్లూరు-ప్రకాశం జిల్లాకు చెందిన వారే ఇందులో ఎక్కువగా ఉండగా.. అందులో రెడ్లు మొదటి వరసలో, కమ్మ వర్గం రెండో వరసలో నిలుస్తారు. వీరిని తట్టుకుని నిలబడిన వర్గంలో వైశ్యులు ఉండటమే విశేషం.

వైఎస్ సీఎం కానంతవరకూ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ , పార్టీలతో సంబంధం లేకుండా మైనింగ్ వ్యాపారాలు చేసుకునే సంప్రదాయం ఉండేది. అంటే అధికారంలో ఉన్న పార్టీకి విరాళాలు ఇవ్వడమో, లేక ఆ పార్టీ అగ్రనేతలను సంతృప్తిపరచడమో జరిగేది. ఏదేమైనా రాజకీయాలతో వ్యాపారాలకు సంబంధం ఉండేది కాదు. కక్షసాధింపులు వినిపించేవి కాదు. అందరూ లౌక్యంగా వ్యాపారాలు చేసుకునేవారు. చివరకు మీడియాను సైతం ‘సంతృప్తి’పరిచేవారు. జర్నలిస్టు సంఘాల జిల్లా-రాష్ట్ర సమావేశాలు, సావనీర్లు, ఆయా మీడియా సంస్థల క్యాలెండర్లకు యాడ్లు.. ఇలా అన్నీ చూసుకునేవారు.

కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంప్రదాయం అటకెక్కింది. కాదు.. అటకెక్కించేశారు. తన పార్టీ కాని వారిని వేధించేవారు. తరచూ వారి క్వారీల్లోకి వెళ్లి, ఎక్కువ తవ్వారని నోటీసులిచ్చి, మూసివేయించేవారు. కేసులు పెట్టేవారు. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా పర్మిట్లు ఇచ్చేవారు కాదు. ఈ వేధింపులకు తాళలేని వ్యాపారులు, విధిలేక క్వారీలను వైసీపీ నేతలకు వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పటి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒక్కడే దైర్యంగా వారిని ఎదుర్కొని వ్యాపారాలు కాపాడుకున్నప్పటికీ, జగన్ జమానాలో వ్యాపారం చేసుకోలేకపోయారు. ఆవిధంగా ఆయన కొన్ని కోట్ల రూపాయల ఆదాయం పోగొట్టుకున్నారు.

తన దారికి రాని క్వారీలను వేధించి, పెనాల్టీలు విధించి దారికి తెచ్చుకున్న వైసీపీ నేతలు అడ్డగోలుగా రాయిని తవ్వి ట్రాన్సుపోర్టు చేసి, వందలకోట్లకు పడగలెత్తారు. ఆవిధంగా జిల్లాలో టీడీపీకి సంబంధించిన క్వారీ వ్యాపారాలను దాదాపు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో జిల్లా మంత్రి ఒకరు తమ కుటుంబసభ్యుల పేరిట కంపెనీల్లో షేర్లు బలవంతంగా రాయించుకున్నారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. సదరు మంత్రికి కప్పం కడితే చాలు, లారీలను ఎవరూ ఆపేవారు కాదు. ఒక రెడ్డిగారు ఈ వసూళ్ల వ్యవహారం చూసేవారు. అయితే మధ్యలో ఒక బాధితుడు.. తాను మంత్రిగారికి డబ్బిచ్చినా, తన లారీ ఆపేసి పెనాల్టీ వేశారంటూ మాట్లాడిన ఆడియో ఒకటి హల్‌చల్ చేసింది.

నిజానికి ఇక్కడి క్వారీ, మైనింగ్ వ్యాపారులు ఒకటే బిల్లుతో వ్యాపారం చేస్తుంటారన్నది బహిరంగ రహస్యం. జీఎస్టీ కోసం సెకండ్ బిల్లులు సృష్టించి, లారీలు పంపిస్తుంటారు. ఇక్కడి రాయి ఎక్కువగా తెలంగాణ,మహారాష్ట్రకు రవాణా అవుతుంటుంది. అటు చెన్నై, కర్నాటక మీదుగా కూడా లారీలు వెళుతుంటాయి. ఇక కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే లారీలు.. బిల్లుల మాయ అదో పెద్ద కథ.

ఇక్కడే వసూళ్ల దందా ప్రారంభమవుతుంది. జగన్ జమానా ఉన్నంతవరకూ ఒక్కో లారీకి 8 వేల రూపాయల చొప్పున.. ఎన్నికల ముందు వరకూ వైసీపీ ఇన్చార్జిగా ఉండి, తర్వాత టీడీపీలో చేరిన యవనేతకు సమర్పించుకోవాలి. తర్వాత తెలంగాణ సరిహద్దు దగ్గర ఉన్న చెక్‌పోస్టు దగ్గర.. ఇటీవల జైలుకెళ్లిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి 12 వేలు సమర్పించుకోవాలి. ఇవి కాకుండా బిల్లులు ఇతరత్రా పనులకు మరో 10 వేలు సమర్పించుకోవాలి. ఇక పోలీసులు, విజిలెన్సు అధికారుల మామూళ్లు వేరు. ఆ ప్రకారంగా ఒ్క లారీకే దాదాపు 40 వేలు వసూలు చేస్తారన్నమాట. ఆరకంగా ప్రతిరోజు తెలంగాణ వైపు 100 నుంచి 150 లారీల వరకూ వెళతాయి. అంటే ప్రతిరోజూ రాజకీయ నేతలు-అధికారులకు ప్రకాశం జిల్లా నుంచి వెళ్లే రాయి, ఎన్ని కోట్లు సంపాదించిపెడుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇవన్నీ గత ఐదేళ్లు వైసీపీ నేతలే దర్జాగా అనుభవించారు.

ఇప్పుడు అధికారం మారింది. వైసీపీ పోయి టీడీపీ వచ్చింది. కాబట్టి వైసీపీ నేతల గుప్పెట్లోకి వెళ్లిన క్వారీ వ్యాపారాలను మూసివేయిస్తారని టీడీపీ వర్గాలు ఆశించడం సహజం. అయినప్పటికీ జిల్లాలో మైనింగ్ వ్యాపారాలన్నీ ఇంకా వైసీపీ నేతల చేతుల్లోనే ఉండటం టీడీపీ వర్గాలను విస్మయపరుస్తోంది. ఆవిధంగా అధికారం మారినా దర్జాగా వ్యాపారాలు చేసుకుంటున్న వారిలో కడప ఎంపి, వైసీపీ అధినేత జగన్ సోదరుడు అవినాష్‌రెడ్డి కుటుంబం ఒకటి కావడమే టీడీపీ నేతల ఆశ్చర్యానికి కారణం.

గురిజేపల్లిలో ఆయన కుటుంబానికి చెందిన వీరశివా గ్రానైట్స్, చీమకుర్తిలోని వీరభద్ర గ్రానైట్స్‌కు ఎలాంటి అడ్డంకులు లేకుండా వ్యాపారం జరిగిపోతుండటం చూసి.. గతంలో వైసీపీ బాధిత టీడీపీ మైనింగ్ వ్యాపారులు నోరెళ్లబెడుతున్నారు. చీమకుర్తిలోని వీరభద్ర గ్రానైట్స్ రాయి అడుగు 200 రూపాయలుంటే, గురిజేపల్లిలోని రాయి ఖరీదు అడుగు 100 రూపాయలుంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.

ఇక గత ఎన్నికల్లో వైసీపీ అద్దంకి ఇన్చార్జిగా ఉన్న మారం వెంకటరెడ్డి, కాశిరెడ్డితోపాటు.. ఇంకా అనేమంది వైసీపీ నేతలు .. తమ మైనింగ్ వ్యాపారాలను నిక్షేపంగా చేసుకోవడం చూసి, టీడీపీ వర్గాలు అవాక్కవుతున్నాయి. వీరికి ఇప్పటివరకూ ఒక్క నోటీసు గాని ఇవ్వకపోవడమే దానికి కారణమట. తెరవెనుక ఏం జరుగుతుందన్నది ఇప్పుడు వారి అనుమానం!

LEAVE A RESPONSE