Suryaa.co.in

Telangana

రేవంత్-బాబు భేటీకి అధిష్టానం అనుమతి ఉందా?

-ఏదో ఒక సాకుతో ఆపే అవకాశం?
-ఢిల్లీ చేతుల్లో సీఎం రేవంత్ బందీ
-రాజ్యాంగేతర శక్తిగా మారిన దీపాదాస్ మున్షీ
-సైంధవ పాత్రలో కేసీఆర్, ఉత్తమ్ కుమార్
-నలుగురి మధ్య నలిగిపోతున్న తెలంగాణ
-పరిపాలిస్తున్నది రేవంత్ రెడ్డా ? కాంగ్రెస్ పార్టీ -అధిష్టానమా?
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

హైదరాబాద్: రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని హడావుడి చేస్తూ.. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో మంత్రివర ఏర్పాటు అంశంలో రాజ్యాంగ బద్దంగా ముఖ్యమంత్రికి విశేషమైన అధికారాలు ఉన్నా.. మంత్రివర్గ విస్తరణ కోసం రేవంత్ రెడ్డి ఇన్ని సార్లు ఢిల్లీకి ప్రాధేయపడాల్సిన అవసరం ఏం ఉందంటూ సూటిగా ప్రశ్నించారు.

రాజ్యాంగ పరిరక్షకులు, రాజ్యాంగాన్ని మేమే రక్షిస్తున్నామని మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్యాంగ పరంగా ముఖ్యమంత్రికి ఉన్న అధికారాలను నిర్వహించుకునే విషయంలో ఏమాత్రం ముందుకు సాగనీయడం లేదని వారి ద్వంద ప్రమాణాలకు నిదర్శనమన్నారు.

కాంగ్రెస్ పార్టీ సొంత బలంతో అధికారంలో వచ్చి… ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం తర్వాత కేబీనేట్ లోని కీలక శాఖలన్నీ ఆయన వద్దే ఉండడంతో పరిపాలన కుంటుపడుతున్నా మంత్రి వర్గ విస్తరణ ముందుకు పడడం లేదని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ఉండి అధిష్టానాన్ని ఎంత ప్రసన్నం చేసుకుందామనుకున్నా కూడా, పాలనాపరమైన నిర్ణయాలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వేఛ్చ లేదన్నది నిజమన్నారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఇప్పటి తెలంగాణలో ముఖ్యమంత్రులను అవమానించడం లో కాంగ్రెస్ పార్టీకి కొత్తేం కాదంటూ ..పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఘనత ప్రతీసారి ఢిల్లీకి వెళ్తున్న రేవంత్ రెడ్డి ని చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతోందని విమర్శలు గుప్పించారు.

మూడు నెలల్లోనే సొంత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ని ముప్పుతిప్పలు పెట్టి.. ఆరు నెలలు దాటినా కూడా అడుగు ముందుకు వేయకుండా అడ్డుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే అని స్పష్టం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి దీపాదాస్ మున్షి ఒక రాజ్యాంగేతర శక్తిగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. ముందటి కాళ్లకు బంధం వేసి ముఖ్యమంత్రి సొంత నిర్ణయాలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విజయవంతం అయిందన్నారు.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేసిన తర్వాత రెండు రోజులకే సవరణ చేస్తారని ఫైనల్ గా వివరణ ఇచ్చి అక్కడికే ముగించేస్తారని చెప్పారు.

ఇందుకు ఉదాహరణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమానికి సోనియా గాంధీ ముఖ్య అతిధిగా వస్తారని చెప్పి, ఆ తర్వాత సవరణ చేసి వివరణ ఇచ్చి కథ ముగించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి హామీలుగానే అధిష్టానం భావిస్తోందన్నారు.

రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి, ఉత్తం కుమార్ రెడ్డి, కేసీఆర్ ఈ నలుగురి నాయకుల మధ్యలో తెలంగాణ రాష్ట్రం నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి సొంత బలం ఉండగానే మూడు చేరికలు ఆరు అలకలు మాదిరిగా కథ సాగుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి విషయం కూడా అలానే ముందుకు సాగుతోందని, పాలనాపరమైన విషయంలో కూడా ఒక అడుగు మందుకు, ఆరు అడుగులు వెనక్కి అనే ధోరణిలో ఆరు నెలల కాలం గడిచిపోయినా సర్కారు మేలుకోవడం లేదని చురకలు అంటించారు.

రాష్ట్రంలో రోజురోజుకు హత్యలు, రైతుల ఆత్మహత్యలు, మహిళల పట్ల మానభంగాలు, క్షీణించిన శాంతిభద్రతలను సమీక్షించకుండా ఢిల్లీకి వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవమానిస్తోందన్నారు.

అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని వ్యంగ్యంగా అన్నారు.

4 కోట్ల తెలంగాణ ప్రజలు సమస్యలతో తల్లిడిల్లుతున్నారు. కొత్తగా నలుగురు మంత్రులను తీసుకుంటే ఎంతా తీసుకోకపోతే ఎంతా..? అని ప్రశ్నించారు. మంత్రి వర్గ విస్తరణ కోసం పాలన పడకేసింది. శాంతి భద్రతలు క్షీణించాయి. ఈనెల 6వ తేదీన జరగబోయే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో విభజన చట్టంలోని హామీల పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ భేటీకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతి ఉందా ? లేక, ఏదో ఒక కారణం చెప్పి ఈ కార్యక్రమాన్ని ఆపే అవకాశం ఉంది అనుమానం వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర హెంమంత్రి అమిత్ షా ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజకీయ మిత్రులు కేసీఆర్ , జగన్ రెడ్డి కలవలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది రేవంత్ రెడ్డా లేకా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానమా అని ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ సూటిగా ప్రశ్నించారు.

LEAVE A RESPONSE