విమానాల్లో తిరుగుతూ విలాసవంతమైన హోటళ్లలో బస
గాంధీనగర్: గుజరాత్ పోలీసులు ఇటీవల ఓ చోరీ కేసులో రోహిత్ కానుభాయ్ సోలంకి అనే దొంగను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా వెల్లడైన విషయాలు వారిని విస్తుపోయేలా చేశాయి. రోహిత్‌ను వివిధ రాష్ట్రాల్లో జరిగిన 19 దొంగతనాల్లో నిందితుడిగా గుర్తించారు.
ఇందులో తెలంగాణాలో రెండు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు చోరీ కేసులు కూడా ఉన్నాయి. ముంబయిలో నిందితుడికి కోటి రూపాయలకు పైగా విలువచేసే ఫ్లాటు, ఆడీ కారు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇతడు విమానాల్లో వివిధ రాష్ట్రాలకు తిరుగుతూ, అక్కడున్న విలాసవంతమైన హోటళ్లలో బస చేస్తాడని తెలిపారు.
పగటిపూట ఆయా ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి రాత్రిళ్లు దొంగతనాలకు పాల్పడుతుంటాడన్నారు. ముంబయిలోని డ్యాన్స్ బార్‌లు, నైట్‌క్లబ్‌లకు అలవాటుపడిన రోహిత్ డ్రగ్స్ తీసుకుంటాడని చెప్పారు. అంతేకాదు.. ఓ ముస్లిం మహిళను పెళ్లి చేసుకునేందుకు తన పేరు అర్హన్‌గా మార్చుకున్నాడు. ఇంత దర్జాగా చోరీలకు పాల్పడుతూ వచ్చిన రోహిత్ ఓ ఇంట్లో రూ.లక్ష చోరీ చేసిన కేసులో గుజరాత్ పోలీసులకు చిక్కాడు.