(మార్తి సుబ్రహ్మణ్యం)
తనదాకా వస్తేగానీ తెలియదని పెద్దలు చెబుతుంటారు. ఒకప్పుడు తన రాజకీయ ప్రత్యర్థి టీడీపీ, దాని అధినేత చంద్రబాబునాయుడు, తనయుడు లోకేష్, రఘురామకృష్ణంరాజు, బాలకృష్ణ, రామోజీరావు, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, అయ్యన్నపాత్రుడు అండ్ అదర్స్పై ట్విట్టర్లో చెలరేగి.. వారిని బండబూతులు తిట్టిన వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి.. తనను లక్ష్యంగా చేసుకుని ఇప్పుడు మీడియా చేస్తున్న విమర్శలు-ఆరోపణలపై విలపిస్తుంటే, పెద్దలు చెప్పిన సామెత గుర్తుకురాక తప్పదు. అయితే అప్పట్లో ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను, సీఎంఓ నిర్వహించేదన్న ప్రచారం ఉండేది. అది వేరే విషయం.
దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అనే మహిళ కడుపులో బిడ్డకు.. విజయసాయిరెడ్డే తండ్రి అంటూ ఆమె భర్త మదన్మోహన్ చేసిన ఆరోపణ, గత రెండురోజుల నుంచి మీడియా-సోషల్‌మీడియా-రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. సహజంగా అలాంటి హాట్ అండ్ కాంట్రావర్సీ న్యూసులను స్టోరీలుగా మలిచి, చర్చలతో రచ్చ చేయడం ఇప్పుడే వచ్చిన సంప్రదాయమేమీ కాదు.
అది ఐదేళ్లపాటు ‘ఫ్యాను’కు చల్లని అదనపు గాలి ఇచ్చిన సాక్షి, ఎన్టీవీ, టీవీ9, 10టీవీ, ఇంకా తోకపత్రికలు-తోక చానెళ్లు చేసిన పనే. కాబట్టి దానిని తప్పుపట్టి, శాంతి ఎపిసోడ్‌ను చూపించకుండా ప్రేక్షకుల కళ్లు కప్పిన మిత్ర మీడియాను అభినందించడం అవివేకం. అన్యాయం.
వైసీపీలో ఉన్న వాళ్లలో విజయసాయిరెడ్డికి కొంచెం పెద్దమనిషన్న పేరు ఉంది. తారకరత్న మృతి తర్వాత విజయసాయిలో గుణాత్మక మార్పు కనిపించింది. కారణం.. ఆయన తన మరదలు భర్త కావడమే. అంటే కులాంతర వివాహమన్న మాట. ఆ ఘటనకు ముందు బాబు సహా టీడీపీ నేతలను తిట్టిపోసిన విజయసాయి.. తర్వాత ‘చంద్రబాబుగారు’ అని సంబోధించడం ప్రార ంభించారు. అప్పటినుంచే ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను సొంతగా చూసుకుంటారన్న మాట వినిపించింది. ఆరుపదులు ఎప్పుడో దాటిన విజయసాయి, చాలా సందర్భంలో బాబును ‘ముసలోడు’ అని ట్వీట్ చేసిన సందర్భాలు కోకొల్లలు.
సరే.. ఇప్పుడు శాంతి ఎపిసోడ్‌కు వెళితే- తన భార్యకు పుట్టిన బిడ్డకు తాను తండ్రి కాదని, ఆ బిడ్డ తండ్రి విజయసాయరెడ్డి, సుభాష్రెడ్డేనని ఆమె భర్త మదన్మోహన్ ఆరోపణ. ఆయన ఆ విషయాన్ని ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణకు లిఖితపూర్వక ఫిర్యాదు చేసి, శాంతి బిడ్డకు తండ్రెవరో విచారించమని అభ్యర్ధించారు. తర్వాత ఆ ఫిర్యాదు బయటకు లీకయి, మీడియా-సోషల్‌మీడియాలో చర్చతో మొదలయి రచ్చయింది. అప్పటికీ విజయసాయిగానీ, ఆయన పార్టీ నేతలు గానీ దానిపై స్పందించలేదు.
హటాత్తుగా శాంతి మీడియా ముందుకొచ్చి.. గిరిజన మహిళనయిన తనపై అభాండాలు వేయడం న్యాయమా? గిరిజన మహిళ మంచి బట్టలు వేసుకోకూడదా? తండ్రి లాంటి విజయసాయితో రంకు అంటకడతారా? అని ఆవేదన వెలిబుచ్చారు. తన పేరు బయటకు వచ్చింది కాబట్టి, తన ఆవేదన వెల్లడించడంలో తప్పేమీ లేదు. పైగా తన బిడ్డకు సుభాష్ తండ్రి అని, తామిద్దరం పెళ్లిచేసుకున్నామని ధైర్యంగా చెప్పడం మెచ్చదగిందే. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. ఆమె తన కులం కార్డు ప్రయోగించడం. ఈ వివాదంలో ఆమె బిడ్డకు తండ్రి ఎవరన్న పాయింటే తప్ప, ఆమె కులం గురించి ఎవరూ ప్రస్తావించలేదు. మీడియా కూడా దానిని స్పృశించలేదు.
నిజానికి ఆమె చెప్పేవరకూ శాంతి గిరిజన మహిళ అని ప్రపంచానికి తెలియదు. ఏదైనా వివాదాస్పద వ్యవహారాలు బయటపడినప్పుడు.. కులం కార్డు వాడుకోవడం రాజకీయ నాయకులకే కాదు. అధికారులకూ అలవాటయింది. తాజాగా రఘురామకృష్ణంరాజును కస్టోడియల్ టార్చర్ చేశారంటూ కేసు నమోదైన వ్యవహారం మరో ఉదాహరణ. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ ఎపిసోడ్లో, ఆయనకు బలపరిచే మాలసంఘాలు కూడా కులం కార్డును ప్రయోగించాయి. ఆయనకు మద్దతుగా దళిత సామాజికవర్గానికి చెందిన మాజీ ఐపిఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ట్వీట్ చేశారు.
ఇక గిరిజన మహిళ శాంతిని వేధిస్తున్నందుకు తాను.. దళిత-గిరిజన-మహిళా సంఘాలను పోగేసి రచ్చ చేస్తానని, విజయసాయిరెడ్డి నిర్భయంగానే ప్రకటించారు. జాతీయ ఎస్టీ కమిషన్, మహిళా హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయిస్తానని చెప్పారు. సో.. రేపటి నుంచి ఆ సంఘాలన్నీ ఆ పనిలో ఉంటాయని అర్ధమవుతూనే ఉంది. విజయసాయి ఆవేశంలో చేసిన ఈ లీక్‌తో ఇక వారి ఉద్యమాన్ని జనం పట్టించుకోరు. అంతపెద్ద ఆడిటర్ ఇంత చిన్న లాజిక్కు మిస్సవడమే ఆశ్చర్యం. అయితే కొంపతీసి వైసీపీపై అభిమానంతో.. అప్పుడెప్పుడో ఫిల్మ్చాంబరు దగ్గర ఓపెన్షో చేసిన శ్రీరెడ్డి గాని వచ్చి, ‘తాను సైతం’ అంటూ పిడికిలి బిగిస్తే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న.
ఇక విజయవాడలో శాంతి మీడియా ముందుకువచ్చిన మరుసటిరోజునే, విజయసాయి విశాఖలో మీడియా ముందుకొచ్చారు. తప్పులేదు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయడం, తనపై పడ్డ నింద తొలగించుకునేందుకు ప్రయత్నించడం ఆయనకున్న హక్కు. దానిని ఆక్షేపించడం అవివేకం. ఆ సందర్భంలో ఆయన ఎంపీగా సమస్యల పరిష్కారం కోసం, తనవద్దకు వచ్చే వారిలో శాంతి కూడా ఉండవచ్చని, అంతమాత్రాన రంకు అంటకడతారా? అని మీడియాను ప్రశ్నించారు. అదేమీ తప్పు కాదు. ఆయన ప్రశ్న అర్ధం చేసుకోదగ్గదే.
కానీ ఆ ఆవేశంలో ఒక సామాజికవర్గమంటూ.. కమ్మ కులానికి చెందిన టీవీచానెళ్లు-పత్రికలను తిట్టిపోయడమే ఆశ్చర్యం. ఆ వరసలో కొందరి పేర్లు ప్రత్యేకంగా ప్రస్తావించి, వారి సంగతి తేలుస్తానని, ప్రివిలేజ్ మోషన్ ఇస్తానని, ప్రెస్‌కౌన్సిల్- ఎడిటర్స్గిల్డ్కు వెళతానని హెచ్చరించారు. తాను రామోజీకే భయపడలేదు. మీరెంత అన్నారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో.. వాటిని ఖండించే క్రమంలో మీడియాను తిట్టిపోయడం, జర్నలిస్టులను విమర్శించడం ఆయన హోదాకు తగనిపని.
అయితే కొంతమంది జర్నలిస్టులకు సంబంధించి.. విజయసాయి కురిపించిన విమర్శల వర్షంలో, కొంతమేరకు నిజం లేకపోలేదని, అది బహిరంగ రహస్యమేనన్నది పాత్రికేయ సమాజం అభిప్రాయం. ప్రతి వ్యవస్థలో మంచివాళ్లు ఉన్నట్లే, చెడ్డవారూ.. జాతిరత్నాలు- చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకునేవారూ ఉంటారు. అంతమాత్రాన వ్యవస్థను తిట్టిపోయడం సహేతుకం కాదు. ఇప్పటి మీడియాలో ప్రతభ లేకపోయినా.. ప్రముఖుల అవతారమెత్తాలంటే కులమైనా ఉండాలి. వెనుక దన్నయినా ఉండాలి. అవి ఉంటే పుల్లిగాడు కూడా పుల్లారావుగారవుతారు.
ఆ మాటకొస్తే తన పార్టీ అధికార మీడియా, దాని అనుబంధ మీడియా గత ఐదేళ్లలో చేసిన పనేమిటి? విపక్షాలు, విపక్ష నేతలను వ్యక్తిత్వ హననం చేసి మార్ఫింగ్ ఫొటోలు గాలిలోకి వదిలిపెట్టలేదా? జగన్ వ్యూహబృందం పంపిన కథలను గాల్లోకి వదల్లేదా? ఆరోజుకు టీడీపీ-చంద్రబాబుపై ఏమేమి కథలు వండివార్చాలో, టీవీ స్టుడియోల్లో తీరికూర్చుని బురదచల్లించలేదా?
ఇప్పటి మంత్రి లోకేష్ పుట్టుక గురించి వైసీపీ సోషల్‌మీడియా అసభ్యంగా ప్రచారం చేయలేదా? ఆయన విదేశాల్లో చదువుకున్నప్పటి స్విమ్మింగ్ ఫూల్ ఫొటోలతో అల్లరి చేయలేదా? అప్పటి తెలుగుదేశం మహిళా నేతతో ఉన్నట్లు ఫోటోలు మార్ఫింగ్ చే సి వ్యక్తిత్వ హననానికి పాల్పడలేదా? అంతెందుకు.. స్వయంగా విజయసాయిరెడ్డి ‘ఈనాడు’ అధిపతి రామోజీ పుట్టుక గురించి అసభ్యంగా ట్వీట్ చేయలేదా? రామోజీ అనే పేరు తెలుగువారికి ఉండదని, ఆయన తల్లి సురభి నాటకాలకు వెళ్లి ఆ పేరు పెట్టిందన్న దారుణ పదజాలం వాడలేదా?
అప్పటి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు.. చంద్రబాబు ఎంపి సుజనాచౌదరి బ్రోకరేజీ చేసి 20 కోట్లు ఇచ్చారంటూ బట్టకాల్చి నెత్తినేసిన సంగతి మర్చిపోతే ఎలా? విశాఖ ఎపిసోడ్లో పురందేశ్వరిని విమర్శించలేదా?.. ఇంకా చెప్పుకుంటూ పోతే విజయసాయి చేసిన దారుణ ట్వీట్లు కోకొల్లలు. మరి అప్పుడు వారెంత బాధపడి ఉండాలి? ఇప్పుడు తన వంతు వచ్చేసరికి, ఎదుటివారిని అసభ్యంగా తిట్టిపోయడం 60 ఏళ్లు దాటిన విజయసాయికి త గని పని అన్నది విజ్ఞుల మనోగతం.
ఇక్కడ విజయసాయి మర్చిపోతున్న అంశం ఒకటి ఉంది. అసలు శాంతి ఎపిసోడ్లో మీడియా పాత్ర సున్నా. ఆమె భర్త ఎండోమెంట్ కమిషనర్‌కు చేసిన ఫిర్యాదుతోనే ఈ గత్తర మొదలయింది. దానిని పనికిమాలిన ఆ ఆఫీసరు గుంభనంగా ఉంచి, విచారించకుండా ఎలా లీక్ చేశారన్న విజయసాయి వాదన వింటే నవ్వురాక తప్పదు. ఇలాంటి లీకులు తన పార్టీ మీడియా, దాని అనుబంధ మీడియా కొన్ని వందలసార్లు ఇచ్చిందని మర్చిపోతే ఎలా? అది మీడియా స్వభావం.
శాంతి భర్త ఫిర్యాదు ఆధారంగానే మీడియా చానెళ్లు, కొన్ని పత్రికలూ ఆ అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ఒక వివాదాస్పద అంశం వెలుగులోకి వచ్చినప్పుడు, దానిని కథనాలు-చర్చలుగా మలచడం కొత్తేమీ కాదు. కాకపోతే కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహం ప్రదర్శిస్తే, మరికొన్ని మీడియా సంస్థలు బాధితులను హైలెట్ చేస్తుంటాయి. శాంతి ఎపిసోడ్లో మీడియా సంస్థలు చేసిన పని అదే. కాకపోతే కొన్ని సంస్థలు అత్యుత్సాహం ప్రదర్శించి ఉండవచ్చు. వాటి అజెండా వేరయి ఉండవచ్చు.
ఇక విజయసాయి చెప్పినట్లు.. టీవీ9, ఎన్టీవీ, సాక్షి, టెన్టీవీలు శాంతి ఎపిసోడ్‌ను చూపించ లేదంటే… అవి చూపిస్తే ఆశ్చర్యం గానీ, చూపించకపోతే ఏం ఆశ్చర్యం అన్నది పాత్రికేయవర్గాల వ్యాఖ్య. అసలు ఈ వివాదంతో సంబంధం లేని మీడియాను తిట్టిపోయడం, వాటికి కులం అంటగట్టడమే వింత. అసలు ఈ మొత్తం వ్యవహారంలో శాంతి గానీ, ఆమె భర్త గానీ, సుభాష్గానీ ఎవరూ విజయసాయి చెప్పిన కమ్మ కులం వారు కాదు.
ఆ మాటకొస్తే.. విజయసాయి చెప్పినట్లు.. శాంతి ఎపిసోడ్ జోలికి వెళ్లని ఎన్టీవీ యాజమాన్యం, టీవీ9ని వెలిగిస్తున్న పెద్ద జర్నలిస్టు, టెన్‌టీవీని వెలిగిస్తున్న మరో పెద్ద జర్నలిస్టు.. సాక్షిలో ఉదయం షిక్కటి షిరునవ్వులు షిందిస్తూ, జగనన్న సర్కారులో కొలువుచేసిన ఇంకో సీనియరు మోస్టు జర్నలిస్టూ.. విజయసాయి చెప్పిన ఆ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారేనని మర్చిపోతే ఎలా? కాబట్టి ఆవేశంలో ఏదేదో మాట్లాడి విచక్షణ కోల్పోతే, పోయేది విజయసాయి పరువే.
ఎందుకంటే.. ఇప్పుడు విజయసాయి కొన్ని మీడియా సంస్థలు-వ్యక్తులను తిట్టిపోశారు. అయితే ఆయన దురదృష్టం కొద్దీ, అదేరోజు హైదరాబాద్‌లో శాంతి భర్త మదన్ ప్రెస్‌మీట్ పెట్టి.. విజయసాయి డీఎన్ఏకు సిద్ధమా అని సవాల్ చేశారు. శాంతి విల్లా కొనుగోలు కోసం విజయసాయి కోటిరూపాయలిచ్చారని, తానే విజయసాయి ఫామ్‌హౌస్‌కు వెళ్లి, ఆయన భార్య నుంచి 60 లక్షలు తీసుకున్నానని చెప్పారు. విజయసాయికి పిల్లలు లేనందున, మగపిల్లాడిని కనాలని అనుకున్న తన భార్య కోరికను మీడియా ముందు నిర్లజ్జగా బయటపెట్టారు. తన భార్య బిడ్డకు కచ్చితంగా విజయసాయిరెడ్డే తండ్రి అని మరోమారు వాదించారు.
ఇక రేపటినుంచి విజయసాయి తిట్టిపోసిన ఆ మీడియా సంస్థలు.. శాంతి భర్త మదన్‌తో ఇంటర్వ్యూలు చేయడం ప్రారంభిస్తాయి. అవన్నీ విజయసాయి వ్యక్తిత్వహనానికి గురిచేసేవేనని, మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. అసలు విజయసాయికి డీఎన్ఏ టెస్టు చేయించాలన్న భర్త డిమాండును పదునుపెట్టి.. మహిళా సంఘ నారీమణులను మీడియా పేరంటానికి పిలిచి గబ్బులేపి, దానిని ప్రపంచం మీదకు వదిలినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. ఈ ఎపిసోడ్‌ను ఢిల్లీ జంతర్‌మంతర్ ముందుకో.. లేదా పార్లమెంటు ముందున్న విజయ్‌చౌక్ దగ్గరకో తీసుకువెళ్లి, విజయసాయిని తల్తెత్తుకోకుండా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈ మొత్తం వ్యవహారంలో జగనన్న ఎలా స్పందిస్తారో తెలియదు. ‘విజయసాయి మిత్రుడ’యిన మాజీ సలహాదారు, ఏం మంత్రాంగం నడుపుతారో తెలియదు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులను గంపగుత్తగా బీజేపీలో చేర్పించే మంత్రాంగం పసిగట్టిన జగనన్న, మాజీ సలహాదారే.. అసలు ఈ ‘శాంతి’కథకు స్క్రీన్‌ప్లే రచించారని సోషల్‌మీడియా కోడై కూస్తోంది. అడుసుతొక్కనేల? కాలు కడగనేల