– తెలంగాణ భక్తులకు తిరుపతి దర్శనభాగ్యం ఎప్పుడు?
– తెలంగాణ ఎమ్మెల్యే లేఖలకూ విలువ ఇవ్వాలని వినతి
-తిరుమలలో కాటేజీలకు స్థలం అడిగిన సీఎం రేవంత్‌రెడ్డి
– బాబును కలసి లేఖ ఇచ్చిన మంత్రి తుమ్మల
– తెలంగాణ భక్తుల మనోభావాలు గౌరవించాలని వినతి
– తెలంగాణ ఎమ్మెల్యే, ఎంపీలదీ అదే కోరిక
– జగన్ హయాంలో ఒత్తిడి చేయని కేసీఆర్
– కేసీఆర్ కోరి ఉంటే జగన్ అప్పుడే చేసేవారన్న భావన
– తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలపై గతంలో హరీష్ ప్రకటన
– రాష్ట్రం విడిపోయినా దర్శనాలకు మినహాయింపేల?
– తెలంగాణలోనూ టీటీడీ ఆస్తులు
– తెలంగాణ నుంచి తిరుపతికి లక్షల సంఖ్యలో భక్తులు
– భద్రాచలం, యాదాద్రి, బాసరలో తమ లేఖలకు విలువ ఇవ్వాలంటున్న ఏపీ ఎమ్మెల్యేలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఈ సమస్య వింటే ‘వినండి మనుషుల గోల.. కనండి దేవుడి లీల.. గోవిందా హరి గోవింద’’ అన్న ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా పాట గుర్తుకు రాక మానదు. దేవదేవుడైన తిరుపతి వెంకన్న దర్శనంపై, తెలంగాణ ప్రజాప్రతినిధుల ఆవేదన ఎవరు ఆలకిస్తారన్న చర్చకు తెరలేచింది. ప్రతిరోజూ వేల సంఖ్యలో, నెలకు లక్షల సంఖ్యలో తిరుపతికి వెళుతున్న తెలంగాణ భక్తుల నుంచి ఆదాయం కూడా భారీగా వస్తోంది. అయితే తిరుపతి సిఫార్సు లే(క)ఖ.. భక్తులు అగచాట్లు పడుతున్న వైనం ఇటీవలి కాలంలో చర్చనీయాంశమయింది.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యేకు రోజుకు ఒక సిఫార్సు లేఖను టీటీడీ ఆమోదించేది. ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రొటోకాల్ దర్శనాలు ఉండేవి. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఎమ్మెల్యే, ఎంపీల సిఫార్సు లేఖలను టీటీడీ పరిగణనలోకి తీసుకోవడం మానేసింది. అదృష్టం ఉన్నవాళ్లకు 300 రూపాయల టికెట్లు ఇస్తున్నారు. దానితో దర్శనం సరిగా జరగదన్నది భక్తుల వేదన. కానీ ఎమ్మెల్యేలు స్వయంగా వెళితే మాత్రం దర్శనానికి ఏర్పాటుచేస్తున్నారు. అయితే ఈ విషయం తెలియని భక్తులు, ఎమ్మెల్యేల వద్ద టీటీడీ సిఫార్సు లేఖలు తీసుకునేందుకు వారి కార్యాలయాకు తరలివెళుతున్నారు.
వారు కూడా అసలు విషయం చెప్పకుండా, సిఫార్సు లేఖ ఇచ్చి భారం తగ్గించుకుంటున్నారు. తీరా టీటీడీ జేఈఓ ఆఫీసుకు వెళితే, ఆ లేఖలు చెల్లవని చావుకబురు చల్లగా చెబుతున్నారు. మరీ బ్రతిమిలాడితే కొందరికి రూములు ఇస్తున్నారట. ఇంకొన్ని సార్లు 300 రూపాయల టికెట్లు ఇస్తున్నారు. అంతా దైవాధీనం! తిరుపతి నుంచి స్వస్థలాలకు వచ్చే భక్తులు, ఎమ్మెల్యేగారి లెటర్లు పనిచేయడం లేదని నలుగురికీ చెబుతుండటంతో ఎమ్మెల్యేల పరువుపోతోంది.
కొంతమంది ధైర్యం చేసి ‘మీ లెటర్లు నడవకపోయినా మాకు ఎందుకు ఇస్తున్నారు‘ అని ప్రశ్నిస్తే.. ‘మీరు అడిగారు మేం ఇచ్చాం. అది మాధర్మం. మీరు అక్కడ ట్రై చేసుకోవాలి’ అని, ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది అసలు విషయం చెబుతున్నారు. ఇదీ ఎమ్మెల్యేల వేదన. దానితో హైదరాబాద్‌లో ఉండే భక్తులు, ఏపీకి చెందిన వారితో మాట్లాడుకుని తిరుపతి సిఫార్సు లెటర్లు తీసుకువెళుతున్న పరిస్థితి. హైదరాబాద్‌లో ఉండే టీటీడీ బోర్డు మెంబర్ల లేఖలతో, మరికొందరు దర్శనం చేసుకుని వస్తున్నారు.
దీనితో పరువుపోతున్న ఎమ్మెల్యేలు, గతంలో మాదిరిగానే తమ లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని, కనీసం వారానికి మూడు లేఖ అయినా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. నిజానికి టీటీడీకి తెలంగాణలో కూడా ఆస్తులు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాగా ఈ సమస్యను గుర్తించిన తెలంగాణ వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబును కలిసి, తెలంగాణ భక్తుల తిరుపతి దర్శన సమస్యను వివరించారు. తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్ధించారు.
అంతకుముందు దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ సైతం తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలను పట్టించుకోవడం లేదని, మీరు ఏపీ సీఎం జగన్‌తో ఒకసారి మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు. దానికి స్పందించిన రేవంత్.. సీఎస్‌ను ఏపీ సీఎస్‌తో మాట్లాడాలని ఆదేశించారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం పోయి చంద్రబాబు సర్కారు వచ్చింది. ఇటీవల విభజన సమస్యలపై బాబు-రేవంత్ చర్చించిన సమయంలో, తిరుమలలో దర్శనాల సమస్య ప్రస్తావించారు. రోజూ తెలంగాణ నుంచి వేలాదిమంది భక్తులు తిరుమలకు వెళుతున్నందున, అక్కడ వారికి వసతి సమస్య ఏర్పడుతోందని బాబుకు వివరించారు. అందువల్ల కొండపైన తెలంగాణకు స్థలం కేటాయిస్తే కాటేజీలు నిర్మిస్తామని కోరారు.
‘రాష్ట్రం విడిపోయినంత మాత్రాన దేవుడి దగ్గర ప్రాంతీయ భావాలెందుకు? తిరుపతికి వెళ్లాలనుకునే తెలంగాణ భక్తులకు మా లేఖలు అక్కరకొస్తే మాకూ పుణ్యమే కదా? అయినా ఇక్కడ కూడా టీటీడీకి ఆస్తులు ఉన్న విషయాన్ని మర్చిపోతే ఎలా? తెలంగాణ భక్తుల మనోభావాలు గుర్తించి, మా సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుంద’ని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
ఇదే అంశంపై గతంలో-ఇటీవల బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు కూడా స్పందించారు. తెలంగాణ భక్తులకు ఎమ్మెల్యే లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన గతంలో కూడా డిమాండ్ చేశారు.
అయితే.. అసలు తన మిత్రుడైన జగన్ సీఎంగా ఉన్నప్పుడే కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించి, తెలంగాణ ఎమ్మెల్యే లేఖలనూ పరిగణనలోకి తీసుకోవాలని కోరి ఉంటే, జగన్ దానిపై అప్పుడే సానుకూల నిర్ణయం తీసుకునేవారని కాంగ్రెస్-బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పుడు మౌనంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు దర్శనాల గురించి మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. కేసీఆర్-జగన్ మిత్రులైనందున.. అప్పుడే జగన్‌పై ఒత్తిడి చేసి ఉంటే, ఈపాటికి తెలంగాణ ఎమ్మెల్యేలు భక్తులకు సిఫార్సు లేఖలు ఇచ్చేవారని విశ్లేషిస్తున్నారు.
ఇదిలా ఉండగా తెలంగాణలోని అన్ని దేవాలయాలు కాకపోయినా.. భద్రాచలం, యాదాద్రి, బాసరకు ఏపీ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తీసుకోవడం లేదని, అటు ఏపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. తాము వెళ్లినప్పుడు మంచి మర్యాదలే చేస్తున్నప్పటికీ, తాము ఇచ్చే సిఫార్సు లేఖలను పట్టించుకోవటం లేదని వాపోతున్నారు.
యాదాద్రికి వచ్చే ఏపీ భక్తుల సంఖ్య తక్కువే అయినప్పటికీ.. భద్రాచలం ఆలయానికి వేల సంఖ్యలోనే వస్తుంటారు. ఇక తమ పిల్లల అక్షరాభ్యాసం బాసరలో చేస్తే, ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకంతో వేలాదిమంది ఏపీ భక్తులు బాసరలోనే అక్షరాభాస్యం చేయించేందుకు ఆసక్తిచూపుతున్నారు. కానీ వారికి ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు చెల్లడం లేదు.
ఈ విధంగా తిరుపతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలు.. తెలంగాణ దేవాలయాలలో ఏపీ ఎమ్మెల్యే లేఖలు చెల్లుబాటుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక దేవుడిదే భారం! గోవిందా.. గోవింద!