Suryaa.co.in

Andhra Pradesh

భార్య కోసం.. బస్సు చోరీ

– ముచ్చుమర్రి లో మరో సంచలనం
(బహదూర్)

విరహమో.. మమకారమో.. ప్రేమో? అనుమానమో? తక్షణమే ఆమెను చూడాలనే తపనతో ఏకంగా ఆర్టీసీ బస్సులో తస్కరించి అటు ఆర్టీసీ డ్రైవర్లకు , ఇటు పోలీసులకు ఓ లారీ డ్రైవరు ముచ్చెమటలు పట్టించాడు. బాలిక అదృశ్యం.. లాకప్ డెత్ తో పోలీసులను అల్లాడించిన ఈ ముచ్చుమర్రి గ్రామంలోనే ఈ ఘటన చోటు చేసుకోవటంతో.. ఖాకీలు నానా హైరానా పడిపోయారు. ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సంచలనాత్మక ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దరగయ్య ఓ లారీ డ్రైవర్. ముచ్చుమర్రి గ్రామానికి చెందిన మహిళతో వివాహం అయ్యింది. వీరికి ఓ బిడ్డ ఉంది. ఇక లారీ డ్రైవరు కావటంతో దరగయ్య ట్రిప్ కి వెళ్లాడు. శనివారం తెల్లవారుజామున ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్య, పిల్లలు లేరు. భర్త లారీ డ్రైవరుగా పని కి వెళ్లటంతో ఒంటరిగా ఉండలేక గత కొన్నిరోజులుగా భార్య ముచ్చుమర్రి గ్రామంలో ఉంటోంది. తన భార్యను కనపడక పోవటంతో ఆత్రుతగా ఆమెను కలిసేందుకు శనివారం తెల్లవారుజామున ఆత్మకూరు బస్టాండ్ కు దరగయ్య వెళ్లాడు. ముచ్చుమర్రి కి వెళ్లేందుకు వాహనాలు లేవు. దీంతో బస్టాండ్ లో బస్సును ఎక్కి చూశాడు. బస్సు తాళాలు కనిపించటంతో బస్సులోనే వెళ్లి భార్యను చూడాలనుకున్నాడు.

అంతే బస్సును నడుపుకుంటూ ముచ్చుమర్రికి బయలుదేరాడు. ఆత్మకూరు డిపోలో డ్రైవర్ వచ్చి చూడగా బస్పు కనిపించలేదు. ఈ విషయాన్ని ఆర్డీసీ డ్రైవర్ ఆత్మకూరు డిపో అధికారులకు తెలిపారు. వెంటనే బస్సు ఎటువెళ్లిందని సీసీ కెమెరాలు పరిశీలించారు. బస్సు నందికొట్కూరు వైపు వెళ్లిందని తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు. ముచ్చుమర్రి వైపు బస్సు వెళ్లిందని తెలిసి ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ కు ఆర్డీసీ అధికారులు పిర్యాదు చేశారు.

ముచ్చుమర్రి ఏ ఎస్ ఐ కృష్ణుడు బస్సును ఆపి దరగయ్యను అదుపులోకి తీసుకుని, బస్సును స్వాధీనం చేసుకున్నారు. దరగయ్యను విచారించగా భార్యను చూసేందుకు బస్సు తెచ్చానని ఒప్పుకున్నాడు. బస్సును ఆత్మకూరు డిపో వారికి అప్పగించినట్లు ఏ ఎస్ ఐ కృష్ణుడు తెలిపారు.. ఏది ఏమైనప్పటికి ఆత్మకూరు డిపోలో బస్సు కే తాళాలు పెట్టడం అక్కడ పని చేస్తున్న డ్రైవర్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు విమర్శిస్తున్నారు.

LEAVE A RESPONSE