Suryaa.co.in

Andhra Pradesh

దళితులకు ఆర్థిక భరోసా కల్పించాలి

– ఆ దిశగా కార్యక్రమాలు రూపొందించండి అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

అమరావతి: ఆర్థికంగా అత్యంత వెనకబడి ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అత్యంత పేదరికంతో ఉండే ఈ వర్గానికి మళ్లీ ఊతంగా నిలవాల్సిన అవసరముందని.. వారికి పేదరికం నుంచి బయటపడేందుకు అవసరమైన కార్యక్రమాలను తయారుచేయాలని సూచించారు.

విద్య, ఉపాధి అవకాశాల ద్వారా వారి జీవితాల్లో మార్పులు తీసుకురావచ్చని స్పష్టం చేశారు. సాంఘిక సంక్షేమశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖ పనితీరు, వివిధ పథకాల అమలుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాల అందజేతపైనా చర్చ జరిగింది.

2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి, సివిల్ సర్వీసెస్ శిక్షణ కోసం ఎన్టీఆర్ విద్యోన్నతి, బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్, చంద్రన్న పెళ్లికానుక వంటి పథకాల ద్వారా వేల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని తెలిపారు. బడుగు, బలహీనవర్గాలను ఆర్థికంగా నిలబెట్టేందుకు ఉపయోగపడే, వారిని పేదరికం నుంచి బయటపడేసే పథకాలను రద్దుచేయడం వల్ల ఆ వర్గానికి తీరని నష్టం జరిగిందని వెల్లడించారు.

తెదేపా ప్రభుత్వ హయాంలో సాంఘిక సంక్షేమశాఖకు కేటాయించిన నిధుల్లో 83% ఖర్చు చేస్తే…. వైకాపా ప్రభుత్వ హయాంలో 67 శాతమే వెచ్చించారని తెలిపారు. ఆయా పథకాల కారణంగా దళిత కుటుంబాలకు నిర్దిష్టంగా కలిగే ప్రయోజనంపై కచ్చితమైన ప్రణాళికను సిద్ధం చేసుకు రావాలని అధికారులకు సూచించారు.

LEAVE A RESPONSE