-మంత్రి అనగాని
– ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు హర్షదాయకం
అమరావతి: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు రాష్ర్ట రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం సమపాళ్లలో అందాలన్నదే టీడీపీ ధ్యేయమని అన్నారు. 30 ఏళ్ల క్రితమే చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అమలు చేశారని గుర్తు చేశారు.
అప్పట్లో రాష్ర్టపతి ఉత్తర్వుల ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ అమలు కారణంగా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎన్నికల హామీగా పెట్టామని, అందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల్లో ఉన్న అన్ని కులాలకు న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యక్తం చేశారు.