Suryaa.co.in

National

ఆరోగ్య పథకాల పేర్లు మారుస్తూ మోడీ అంకెల గారడీ

– వైద్య ఆరోగ్య పద్దులో అరకొర కేటాయింపులపై లోక్ సభలో గళమెత్తిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

ఢిల్లీ: యూపీఏ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్య పథకాల పేర్లు మారుస్తూ మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంకెల గారడి చేస్తూ పబ్బం గడుపుతున్నదని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్ లో వైద్య ఆరోగ్య పద్దులపై శుక్రవారం పార్లమెంట్ లో కాంగ్రెస్ పక్షాన ఎంపీ డాక్టర్ కడియం కావ్య చర్చలో పాల్గొన్నారు.

ఆయుష్మాన్ భారత్ పేరిట నెలకొల్పిన పథకం పేదల ఆయుష్షు పెరిగేందుకు ఉపకరించడం లేదని, అరకొర నిధులు వారిని ఆరోగ్యవంతులని చేసేలా లేవని కావ్య అభిప్రాయపడ్డారు. కేంద్రం కోవిడ్ మేనేజ్మెంట్ లో అనూహ్య విజయం సాధించిందని జబ్బలు చరుచుకుంటున్న అధికార పార్టీ, సాధారణ ఆరోగ్య రంగంలో చేస్తున్నది ఏమీ లేదని డాక్టర్ కడియం కావ్య ఎద్దేవ చేశారు.

పలు ప్రధాన అంశాలలో వైద్య ఆరోగ్య సేవలను విస్తరింప చేయాలని జరిగిన కేటాయింపులు అరకొరగా ఉన్నాయని వీటి విషయంలో వైద్య ఆరోగ్యశాఖ సరైన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ప్రధానమని ఈ విషయంలో మరింత వ్యూహాత్మకంగా చర్యలు తీసుకోవాలని ఎంపీ సూచించారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బాలికల ప్రధాన సమస్యల పట్ల ఉన్న చిత్తశుద్ధిని కొనియాడుతూ గతంలో తెలంగాణలో కూడా
మెనుస్ట్రవల్ హైజీన్ విషయంలో తమ తండ్రి కడియం శ్రీహరి మంత్రిగా ఉన్నపుడు చేపట్టిన చర్యలను ఉదహరించారు. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల విషయంలో కుటుంబాలు ఇల్లు గుల్ల అవుతాయని, వారి ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని క్యాన్సర్ నిర్ధారక పరీక్షలు మొదలుకొని నివారణ వరకు చేపట్టే చర్యల్లో రాయితీలు కల్పించాలని డాక్టర్ కడియం కావ్య సూచించారు.

నీట్ పరీక్ష పై ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని డాక్టర్ కావ్య దుయ్యబట్టారు. ఇది ఒక ప్రయోగాత్మక లీకేజీకి ఉదాహరణగా ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి లీకేజీ యోజన రూపంలో కూడా పథకాలు వస్తాయేమోనని వ్యంగంగా అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ లో అంతర్జాతీయ స్థాయిలో 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు కడియం కావ్య వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ వైద్య మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన 323 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

కాజీపేట కేంద్రంగా గల రైల్వే జంక్షన్ 54 రైల్వే స్టేషన్లకు న్యూక్లియస్ గా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఇక్కడి రైల్వే ఉద్యోగులకు ప్రస్తుతం ఇక్కడ ఉన్న హాస్పిటల్ ద్వారా అందుతున్న సేవలు పరిమితంగా ఉన్నాయని ఎంపీ డాక్టర్ కావ్య తెలిపారు. నిన్న ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రాష్ట్రాలకు అధికారం ఇస్తూ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు. వర్గీకరణకు కృషి చేసిన ప్రతి ఒక్కరు అభినందనీయులని పార్లమెంట్ లో డాక్టర్ కడియం కావ్య ప్రస్తావించారు.

LEAVE A RESPONSE