Suryaa.co.in

Telangana

నాణ్య‌మైన విద్య‌తో పాటు భోజ‌నం అందించాలి

-అల‌స‌త్వం వ‌హిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు
-పెంట్ల‌వెల్లి లాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూడాలి
-మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

కొల్లాపూర్: కేజీబీవీ పాఠ‌శాలల్లో చ‌దువుతున్న విద్యార్థులకు నాణ్య‌మైన విద్య‌తో పాటు భోజనం అందించాల‌ని, అలసత్వం వహిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఎక్సైజ్, ప‌ర్యాట‌క, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హెచ్చరించారు. పెంట్ల‌వెల్లి కేజీబీవీలో క‌లుషిత ఆహారం – విద్యార్థినిల‌కు అస్వ‌స్త ఘ‌ట‌న‌ను మంత్రి జూప‌ల్లి సీరియ‌స్ గా తీసుకున్నారు.

దీన్ని దృష్టిలో ఉంచుకుని సోమ‌వారం కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలోని ఓ ఫంక్ష‌న్ హాల్ లో కేజీబీవీ పాఠ‌శాల‌ల విద్యార్థినులు, బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బందికి అవ‌గాహ‌న స‌దస్సులో మంత్రి జూప‌ల్లి పాల్గొని దిశానిర్ధేశం చేశారు. భ‌విష్య‌త్ లో ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, లేక‌పోతే సంబంధిత అధికారులు, బియ్యం, ప‌ప్పులు, ఇత‌ర వంట సామాగ్రిని, కూర‌గాయాలు స‌ర‌ఫ‌రా చేసే అధికారులు, ఎజెన్సీల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామని స్ప‌ష్టం చేశారు.

విద్యార్థినుల‌కు కేవలం తరగతి పాఠాలే కాక వ్యక్తిత్వ వికాసం నేర్పించ‌డం, ఆటలు, ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌లో ప్రోత్సహించాల‌ని. వారిపై ఎలాంటి ఒత్తిడి ప్రభావం లేకుండా తీర్చిదిద్దాల‌ని, ప్రతి విద్యార్థినిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాల‌ని సూచించారు. ఇంట్లో పిల్లలను ఎలాగైతే శ్రద్ధగా చూసుకుంటామో ఇక్కడ ఉన్న పిల్లలను కూడా మీ పిల్లలుగా భావించి అంతే జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ మెనూ ప్రకారం శుచి అయిన పౌష్ఠిక ఆహారం అందించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల కాలం పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం విద్యార్థినిలకు నాణ్యమైన విద్య, వసతి, పౌష్ఠిక ఆహారం అందిస్తోందని, విద్యార్థినిల విద్యా ఆరోగ్యం పట్ల రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు.

నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి వినియోగించే నిధుల‌ను పాఠ‌శాల‌లు, హ‌స్ట‌ల్స్ లో మెరుగైన సౌక‌ర్యాల కోసం కేటాయిస్తాన‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి తెలిపారు. క‌లుషిత నీరు, పురుగుల బియ్యం, కుల్లిపోయిన కూర‌గాయాలు స‌ప్లై చేసే ఎజెన్సీల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోరు అని అధికారుల‌పై ఆగ్రహాం వ్య‌క్తం చేశారు. తాగునీటిని శుద్ధి చేయాల‌ని, టెస్టింగ్ మిష‌న్ ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. అవ‌స‌ర‌మైన చోట త్వ‌ర‌లోనే ఆర్వో ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు.

వసతి గృహంలో సౌకర్యాలపై మంత్రి జూప‌ల్లి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సురక్షిత మంచి నీళ్ళు వస్తున్నాయా? లైబ్ర‌రీలో పుస్త‌కాలు అందుబాటులో ఉంటున్నాయా అని ఆరా తీశారు. విద్యార్థులు ల‌క్ష్యానుగుణంగా విద్య‌ను అభ్య‌సించాల‌ని, ఆలోచ‌న తీరు కూడా గొప్ప‌గా ఉండాల‌ని.. అప్పుడే ఉన్న‌త స్థానాల‌కు చేరుకునే అవ‌కాశం ల‌భిస్తుందని మార్గ‌నిర్ధేశం చేశారు.

చ‌దువుకు వ‌య‌సుతో సంబంధం లేద‌ని, అది నిరంత‌ర ప్ర‌క్రియ అని, స‌మాజంలో ప‌ది మందికి ఉప‌యోగ‌ప‌డే విధంగా విద్య‌ను అభ్య‌సించి ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకోవాల‌ని హిత‌బోధ చేశారు.

కేజీబీవీల్లో ఏమైనా స‌మ‌స్య ఉంటే నేరుగా త‌న‌కు గాని, క‌లెక్ట‌ర్ కు కానీ ఫోన్ చేయాల‌ని చెప్పి… త‌న నంబ‌ర్ ను విద్యార్థుల‌కు ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ బ‌దావ‌త్ సంతోష్ , విద్యా శాఖ అధికారులు, బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A RESPONSE