ముంబయి, ఆగస్టు 8:విశ్లేషకుల అంచనాలకు అనుగుణం గానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. మంగళవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు. రెపోరేటు (Repo rate) ను 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు దీన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది తొమ్మిదో సారి.. ఎంపీసీ కీలక నిర్ణయాలు..
ముఖ్యాంశాలు:
- మార్కెట్ అంచనాలు మరియు RBI విధానాలకు సయోధ్య కుదురుతోంది. ద్రవ్యోల్బణం ఏప్రిల్-మేలో స్థిరంగా ఉండగా, జూన్‌లో ఆహార ధరల పెరుగుదల కారణంగా మరోసారి పెరిగింది.
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విస్తరణ అసమతుల్యంగా ఉంది. కొంతమంది కేంద్ర బ్యాంకులు కఠిన విధానాలను కొనసాగిస్తుండగా, పెరుగుతున్న అప్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సవాల్‌గా మారాయి.
- భారత సేవా రంగ కార్య కలాపాలు బలంగా ఉండటం విశేషం. బ్యాంకు రుణాల విస్తరణతో ప్రైవేటు కార్పొరేట్ పెట్టుబడులు ఊపందుకుంటున్నాయి. బ్యాంకులు, కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్లు ఆరోగ్యకరంగా ఉన్నాయి. ప్రభుత్వం మూలధనం వ్యయాలపై దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడి అవకాశాలు ఆశాజనకంగా ఉన్నట్లు గవర్నర్ పేర్కొన్నారు.
- 2024-25 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉండే అవకాశం ఉంది. ఒకటి, రెండు, నాలుగో త్రైమాసికంలో 7.2 శాతం, మూడో క్వార్టర్‌లో 7.3 శాతంగా ఉండే అవకాశం ఉంది.
- 2024-25లో ద్రవ్యోల్బణం 4.5 శాతంగా అంచనా వేస్తున్నారు. రెండో త్రైమాసికంలో 4.4%, మూడో త్రైమాసికంలో 4.7%, నాలుగో త్రైమాసికంలో 4.3 శాతంగా ఉండే అవకాశం ఉంది.
- నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆహార ద్రవ్యోల్బణం తగ్గవచ్చని RBI ఆశాభావం వ్యక్తం చేసింది.
- ఆగస్టు 2 నాటికి భారత విదేశీ మారక నిల్వలు 675 బిలియన్ డాలర్ల వద్ద రికార్డు స్థాయికి చేరాయి.
- బ్యాంకుల డిపాజిట్లు తగ్గుతున్న నేపథ్యంలో క్రెడిట్ డిమాండ్‌ను అందుకోవడంలో బ్యాంకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో కుటుంబాల పొదుపులను ఆకర్షించడంపై బ్యాంకులు దృష్టి సారించాలని సూచించారు.
- వ్యక్తిగత రుణ వితరణలో గణనీయ వృద్ధి నమోదవుతుండగా, దీన్ని జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని RBI తెలిపింది.
- యూపీఐ పన్ను చెల్లింపు పరిమితి రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
- నిరంతర చెక్ క్లియరింగ్‌ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు.
- 2022-23లో 2 శాతంగా ఉన్న కరెంటు ఖాతా లోటు 2023-24 నాటికి 0.7 శాతానికి తగ్గింది.