– టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి: కూటమి ప్రభుత్వ హయాంలో దర్శి రూపురేఖలు మారుస్తానని టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శి నగర పంచాయతీ 12వ వార్డులో సిమెంటు రోడ్డు నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. దర్శి అభివృద్ధి బాధ్యత నేను తీసుకున్నాను. ఇప్పటికే నేను ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతున్నానని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ 50 రోజుల ప్రజా ప్రభుత్వ పాలనలో అనేక అద్భుతాలు ఆచరణలో చూపించగలిగారన్నారు. ప్రభుత్వం అంటే సేవ అని నిరూపించగలిగారని పేర్కొన్నారు. జిల్లా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, జిల్లా అధికార యంత్రాంగం, స్థానిక అధికారుల సహకారంతో ఈ ఐదేళ్ల కాలంలో దర్శి అభివృద్ధి చేయాలన్నదే నా లక్ష్యమని చెప్పారు.
గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ప్రజలు నేరుగా నా దగ్గరకు వచ్చి మీ సమస్యలు తెలియజేయవచ్చు. దర్శిని సుందరంగా తీర్చిదిద్దేందుకు రోడ్లు, డ్రైన్లు, మంచినీరు, పార్కుల సుందరీ కరణ, విద్య, వైద్యం కోసం మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
దర్శి ప్రాంతంలో వలసలు నివారించేందుకు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాస్ రెడ్డి సహకారంతో కేంద్ర నిధులతో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా దర్శి ప్రజలకు మేలు జరుగుతుందని ఆమె వివరించారు.
కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు నారపుశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, మున్సిపల్ కమిషనర్ మహేష్, మున్సిపల్ సిబ్బంది, తదితర నేతలు ఉన్నారు.