Suryaa.co.in

Andhra Pradesh

రాజకీయ లబ్ది కోసమే వైసీపీ నీచ రాజకీయం

  • విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ఉన్న జగన్ పేరును ఎవరో ఆగంతకులు తొలగిస్తే వైసీపీ నేతలు నానా యాగీ చేస్తున్నారు

  • ఈ ఘటనకు ప్రభుత్వానికి ఎలాంటి సంబందం లేదు

  • విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు మార్చి జగన్ తన పేరు పెట్టకున్నపుడు వైసీపీ దళిత నేతలు ఎందుకు నోరు మెదపలేదు?

  • రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి

విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ఉన్న జగన్ పేరును ఎవరో ఆగంతకులు తొలగిస్తే… నానా యాగీ చేస్తున్న వైసీపీ నేతలు నాడు విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు మార్చి జగన్ తన పేరు పెట్టుకుంటే ఎందుకు నోరు మెదపలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు.

శుక్రవారం నాడు ఆయన ఒంగోలు పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ….విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ఉన్న జగన్ పేరును అర్దరాత్రి ఎవరో ఆగంతకులు తొలగిస్తే వైసీపీ నేతలు సిగ్గులేకుండా నానా యాగీ చేస్తున్నారు. కానీ నాడు విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తొలగించి జగన్ తన పేరు పెట్టుకుంటే వైసీపీ దళిత నేతలు ఎందుకు నోరు మెదపలేదు? అంబేద్కర్ విగ్రహంపై చిన్న గీత కూడా పడలేదు.

కానీ అంబేద్కర్ విగ్రహం ద్వంసం చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేయటం సిగ్గుచేటు. దీన్ని ప్రభుత్వానికి ఆపాదించటం సరికాదు. దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబందం లేదు. ప్రభుత్వంపై బురద చల్లే పనులు మానుకోవాలి. ప్రభుత్వం ఎవరి పేరు తొలగించలేదు. మేం అలాంటి పనులు చేయాల్సిన అవసరం మాకు లేదు.

వైసీపీలో దళిత మంత్రులు 5 ఏళ్లు అధికారంలో ఉండి ఎప్పుడూ జగన్ మెప్పు కోసం పాకులాడటం తప్ప దళితులకు చేసిందేంటి? నాడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన మేరుగ నాగార్జున, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ ఏం ఒరగబెట్టారు? ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు అధ్వానంగా ఉన్నాయి. విద్యార్దులకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారు.

జాతి ప్రయోజనాలు పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడే వారిని జాతి క్షమించదు. జగన్ ఎస్సీ కార్పోరేషన్ నిర్వీర్యం చేశారు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు పెట్టారు. దళితుల్ని, గిరిజనుల్ని జగన్ దారుణంగా మోసం చేశారని మంత్రి విమర్శించారు.

నాడు ఈవీఎంలు సూపర్ అన్న జగన్ నేడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటున్నారు. నాడు సంఖ్యాబలం లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన జగన్ నేడు ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించటమే. మాట తప్పడం మడప తిప్పడం జగన్ కి అలవాటే.

ఒంగోలులో కొన్ని స్ధానాల్లో రీకౌంటింగ్ జరపాలని వైసీపీ నేతలు అంటున్నారు. ఏం చేసినా ప్రజలిచ్చిన తీర్పును ఎవరూ మార్చలేరు. వాలంటీర్లు నా సైన్యం అన్న జగన్ 2023 ఆగస్టు నుంచి వారిని రెన్యూవల్ చేయకుండా ద్రోహం చేశాడు. వాలంటీర్లను మేం రెన్యూవల్ చేస్తామని మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.

LEAVE A RESPONSE