Suryaa.co.in

Features

భారత్ లో వందేళ్ల కమ్యూనిస్టుల స్థితిగతులు

(వి. ఎల్. ప్రసాద్)

1942 లో గాంధీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇక్కడే కమ్యూనిస్టుల వ్యూహం దెబ్బతింది. వారి ఆలోచన వేరే విధంగా చేశారు. అప్పుడు వారు తీసుకున్న తప్పుడు నిర్ణయం నేటికీ వారిని వెంటాడుతోంది. తర్వాత కాలంలో చేసిన తప్పిదాన్ని గుర్తించి , వారి అధికారిక పత్రాల్లో తప్పిదంగా నమోదు చేసుకున్నారు.

అది రెండో ప్రపంచ యుద్ధ కాలం. నాజీ సేనలు సోవియట్ రష్యాను లక్ష్యంగా చేసుకుంది. సోవియట్ ప్రభావం భారత కమ్యూనిస్టు లపై బలంగా ఉండడంతో , ఆ యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా అభివర్ణించింది. ఇటలీ, జర్మనీ, జపాన్ ఒకవైపు ఉంటే ఫ్రాన్స్ , అమెరికా, సోవియట్, బ్రిటన్ మిత్రదేశాలుగా ఒక కూటమిగా వున్నాయి. ఆ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం చేస్తే , నాజీ సైన్యాలను ఓడించాలనే ఉమ్మడి లక్ష్యం దెబ్బ తీస్తుందని భారత కమ్యూనిస్ట్ లు భావించారు.

దానితో క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించారు. నాజీ సేనల పురోగతిని అడ్డుకోవడానికి జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని కూడా బ్రిటీష్ ప్రభుత్వాన్ని కోరారు. మరో పక్క గాంధీ నేతృత్వం లోని కాంగ్రెస్ పార్టీ ఇదే సరైన తరుణమని , బ్రిటీష్ మెడలు వంచే అద్భుత సమయమని భావించింది. కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం సోవియట్ ను సంప్రదించి క్విట్ ఇండియాను వ్యతిరేకించింది. జపాన్ సేనలు బర్మా వరకూ వచ్చాయి కావున వారు రాకుండా అడ్డుకునే ప్రయత్నా లను ఈ ఉద్యమం దెబ్బ తీస్తుందని చెప్పారు గానీ , ప్రజలకు అది నచ్చలేదు.

అప్పటి వరకు అన్ని స్వాతంత్ర్య ఉద్యమాల్లో ముందుండి నడి పారు గానీ , కీలక తరుణంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించడం వ్యూహాత్మక తప్పిదంగా పార్టీ నాయకులు కూడా అంగీకరించారు. అనేక ఉద్యమాల్లో వేలాదిగా జైళ్ల పాలయినా , ఈ ఒక్క ఉద్యమంలో పాల్గొనక పోవడం వార్ని చారిత్రక తప్పిదం అయ్యింది. తరువాత అదే సం.రం కమ్యూనిస్ట్ లపై ఉన్న నిషేధాన్ని బ్రిటీష్ ప్రభుత్వం ఎత్తివేసింది. కాంగ్రెస్ అనే పేరుమీద మొదటి సమావేశం , పార్టీ ఏర్పడిన తరువాత 23 సం.లకు 1943 లో బాంబే లో మొదటి సమావేశం జరిగింది. అనేక ఆంక్షలు ఉన్నా శ్రామికుల సమ్మెలు, రైతాంగ ఉద్యమాలలో పార్టీ గ్రూపులు పనిచేస్తూనే వస్తున్నాయి.

1947 ఆగస్ట్ 15 స్వాతంత్ర్యం వచ్చింది. నెహ్రూ పెద్ద సోషలిస్ట్ నాయకునిగా చలామణి అవుతున్నాడు. అంతా సోషలిస్ట్ పంథాలోనే ప్రభుత్వం నడుస్తోందని చెప్పు కుంటున్నారు. 1949 లో చైనా కు మావో నాయకత్వంలో విప్లవం విజయవంతమై స్వాతంత్ర్యం వచ్చింది. సోవియట్ స్థానాన్ని చైనా నిదానంగా ఆక్రమించడం మొదలు పెట్టింది. చైనా మన దేశ పాలనలో చిచ్చు రేపినట్లు అయ్యింది. సోషలిస్ట్ లక్ష్యంగా సాగే పార్టీ , కాంగ్రెస్ నేతృత్వంలో సాధించిన స్వాతంత్ర్యాన్ని ఎలా చూడాలని తొలి రోజుల్లో అంతా అయోమయంలో పడిపోయారు. నెహ్రూ ప్రభుత్వాన్ని ఏ విధంగా పరిగణించాలనేది మరో అయోమయ ప్రశ్న.

ఇది స్వాతంత్ర్యం కాదని , కేవలం అధికార మార్పిడే అని కమ్యూనిస్ట్ లు ప్రకటించారు. అప్పటికి భారత్ తో సహా చాలా దేశాలు సోవియట్ ప్రభావంలో ఉన్నాయి. అంటే ఆయా దేశాల విధి విధానాలను శాసించే స్థితిలో సోవియట్ ఉంది. సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం భారత ప్రభుత్వం బూర్జువా పెద్దల నేతృత్వంలో ఉంది , దానిపై పోరాటం చెయ్యాలని భారత కమ్యూనిస్ట్ పార్టీకి సలహా ఇచ్చింది. భారత కమ్యూనిస్టు లను సోవియట్ కావాలనే ఏమార్చింది అనుకోవాలి. ఇక నెహ్రూ స్వతంత్రంగా వ్యవహరించడం మొదలు పెట్టాడు.

సోషలిస్ట్ పంథానే నాది అని నెహ్రూ బహిరంగంగా ప్రకటించడంతో కాంగ్రెస్ లోని వామపక్ష సమూహాలతో కలసి పనిచేస్తూ వారిని తమ దారికి తెచ్చుకోవా లని ఒక వర్గం వాదిస్తే , ఇది అర్ధ వలస రాజ్యం , వచ్చింది సరైన స్వాతంత్రం కాదు , చైనా బాటలో పోరాడాలి అని రెండో వర్గం వాదించింది. కమ్యూనిస్ట్ సమూహాలు రెండు శిబిరాలుగా చీలిపోయాయి. పోరాడి సాధించుకున్న స్వాతంత్రాన్ని ఎలా చూడాలి అనే దానిపైన , సోవియట్ – చైనా బాటల్లో దేన్ని అనుసరించాలి అనే దానిపైనా రెండు శిబిరాలు మద్య విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం , ఇతర పోరాటాల వల్ల గ్రామీణ రైతాంగం వారివెంట నడిచిన తీరు , అందులోని బలమైన వర్గం చైనా వైపు మళ్లేలా చేసింది.

తెలంగాణాలో 3 వేల గ్రామాలు నిజాం పాలన నుండి విముక్తి పొంది , కమ్యూనిస్ట్ గ్రామ కమిటీల చేతుల్లోకి ఆ గ్రామాలు రావడం చైనా మార్గం వారికి ఉత్సాహాన్నిచ్చింది. అదే ఉపుతోటి పోరాటాలు చేస్తే దేశంలో సోషలిజం సాధించ వచ్చు అని అంచనా వేశారు. నిజాం సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం వేరు, భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం వేరు అని ఆ తర్వాత గుర్తించారు. అప్పటికే కమ్యూనిస్టు ఇంటర్ నేషనల్ నుండి కొమిఫామ్ గా పేరు మార్చుకున్న అంతర్జాతీయ కమ్యూనిస్ట్ సంస్థ చైనా మార్గాన్నే ప్రతి పాదించింది. భారత కమ్యూనిస్టు పార్టీలో చైనా లైన్ ఆధిపత్యం సాధించినట్లు అయ్యింది.

1951 లో బి.టి. రణధీవే ను దించి , చండ్ర రాజేశ్వర రావు పార్టీ నాయకత్వం చేపట్టాడు. అప్పటికే తెలంగాణా సాయుధ పోరాటం విరమణ జరిగింది. అంతక ముందు సాయుధ పోరాటం విరమించాలా , కొన సాగించాలా అనే చర్చ జరిగి , ఏకాభిప్రాయం కుదరక పంచాయితీ సోవియట్ కు మారింది. రష్యా సలహా కోసం బసవ పున్నయ్య, అజయ్ ఘోష్ , డాంగే , చండ్ర రాజేశ్వర రావుల నలుగురు బృందం సోవియట్ రష్యా వెళ్లి స్టాలిన్ తో చర్చించి , సలహా తీసుకుని , తిరిగివచ్చి సాయుధ పోరాటాన్ని విరమింప జేశారు. దరిమిలా 1952 సార్వత్రిక ఎన్నికల్లో పొటీ చెయ్యాలని కమ్యూనిస్ట్ లు నిర్ణయించారు.

చైనా మార్గం మా మార్గం అని కూడా ప్రకటించారు. భారత రాజకీయాలలో కుదురు కోవాలంటే రెండు మార్గాలను ప్రతిపాదించారు కమ్యూనిస్ట్ నాయకులు. సుదీర్ఘ సాయుధ పోరాటం ఒక పద్ధతి , రాజకీయ పంథా అంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చెయ్యడం రెండో పద్దతి. మాధురై లో జరిగిన పార్టీ సమావేశంలో నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిపాదించారు. ఆ తరువాత కూడా పార్టీలో సోవియట్ – చైనా రెండు మార్గాల పోరాటాలు కొనసాగుతూ వచ్చాయి. ఎవరి ఆధిపత్యంలో పార్టీ ఉంటే వారి పంథాను అనుసరించే విధానాలు రూపొందుతూ వచ్చాయి. మెజారిటీ , మైనారిటీ అభిప్రాయాలని ఘర్షణ కొన సాగుతూ వచ్చింది.

1952 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 1955 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం తథ్యం అని భావించే తరుణంలో అప్పుడు అపోహలతో కూడిన భయానక విస్తృత ప్రచారం వల్ల, అంచనాలు తలకిందు లయ్యాయి. కానీ 1957 లో కేరళలో నంబూద్రిపాద్ నాయకత్వంలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియలో కమ్యూనిస్టు పార్టీ అధికారం లోకి రావడం ప్రపంచ వింతలో ఒకటి.

ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ కూడా అధికారంలోకి రావొచ్చు అనే భావనలు క్రమేపీ బలపడ సాగాయి. దీనికి తోడు సోవియట్ లో స్టాలిన్ తరువాత కృశ్చేవ్ అధికారంలోకి వచ్చి శాంతియుత పాలనను ప్రతిపాదించాడు. చైనా మార్గమే మా మార్గంకు తోడుగా కేరళ మార్గమే మా మార్గం కూడా తోడయ్యింది. సాయుధ పోరాటం అనే గత ఎజెండా స్థానంలో ఎన్నికల పోరాటం కూడా ప్రధాన ఎజండాగా ముందుకు వచ్చింది.

నంబూద్రిపాద్ భూ సంస్కరణలు , వేతన సంస్కరణలు అమలు చెయ్యడం మొదలు పెట్టాడు. దానితో మత సంస్థలు , ఇతర సమూహాలతో కలసి అలజడులు రేపుతూ నంబూద్రికి వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టారు. వివాదాల నడుమ ప్రధాని ఇందిర కేరళ పర్యటించి నంబూద్రి ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేసింది. అంతకు ముందు ఒకసారి 1959 లో నెహ్రూ ప్రభుత్వం కూడా నంబూద్రి ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేసింది.

ఆ బర్త్ రఫ్ వెనుక అమెరికా వుందని అప్పటి నుండీ ఆరోపణ చేస్తూనే ఉన్నారు. సోవియట్ – చైనా ల వైపు అనేక దేశాల కమ్యూనిస్టు ప్రభుత్వాలు చీలిపోయాయి. 1962 లో భారత – చైనా యుద్ధం కీలక మలుపు తీసుకుంది. యుద్ధంలో చైనాను సమర్థించారని , సి.పి. ఐ లోని లెఫ్టిస్ట్ లను జైళ్లకు పంపారు. పార్టీలో కూడా రెండు దారులు మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి.

1963 లో తెనాలి లో ఒక రైస్ మిల్లులో సమావేశమైన అసమ్మతి నేతలు తమ దారిలో ముందుకు వెళ్లాలని తీర్మానించారు. మొట్ట మొదటి సారిగా అక్కడ మావో చిత్ర పటాన్ని బహిరంగంగా ప్రదర్శించారు. దాదాపుగా సి.పి.ఎం కు ఏర్పాట్లు అక్కడే పురుడు పోసుకున్నాయని చెబుతారు.

తర్వాత 1964 లో పార్టీ రెండుగా చీలింది. ఏడవ సమావేశం విడివిడిగా కలకత్తా , బాంబే లో జరిగాయి. చైనా దారి తీసుకున్న సీనియర్ నేతలు 9 మందితో పాలిట్ బ్యూరో సభ్యులుగా ఎన్నికై సి.పి.ఎం పార్టీగా కలకత్తాలో అవతరించింది. ప్రధాన కార్యదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్య ఎన్నికయ్యాడు.

బాంబే సమావేశంలో రెండవ సమూహ సమావేశం సి.పి.ఐ గానే కొనసాగారు. ఒక విషయం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. అంతకు ముందు పట్టణ ప్రాంతాలలో క్రియాశీలకంగా ఉన్న పార్టీశ్రేణులు , ఇప్పుడు గ్రామీణ రైతాంగం వైపు మరలడం కనిపించింది. ఇది చైనా మార్గంగా భావించవచ్చు.

LEAVE A RESPONSE