Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ రౌడీల బారి నుంచి రక్షించండి!

– 29వ రోజు మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ కు విన్నపాల వెల్లువ
– సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ

అమరావతి: ప్రజాసమస్యల పరిష్కార వేదిక విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ కు బుధవారం విన్నపాలు వెల్లువెత్తాయి. ఉండవల్లిలోని నివాసంలో 29వ రోజు కార్యక్రమానికి మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను విన్నవించారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్ అందించాలని, వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని, భూకబ్జాదారులను తరిమివేయాలని, సొంతింటి కల నెరవేర్చాలని, విద్య, ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయా విన్నపాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విన్నపాలు

వైసీపీ రౌడీలు గొంతుపై కత్తిపెట్టి ఇంటిని, పొలాన్ని కబ్జా చేశారు
వైసీపీ రౌడీలు తన గొంతుపై కత్తిపెట్టి ఇంటిని, పొలాన్ని కబ్జా చేశారని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రిటైర్డ్ రైల్వే డ్రైవర్ పిల్లి అబ్రహాం, కుమార్తె పిల్లి సుధారాణి మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత, దుగ్గిరాల జడ్పీటీసీ దాసరి వీరయ్య, అతని అనుచరులైన రౌడీషీటర్, తెనాలి వన్ టౌన్ వైసీపీ కౌన్సిలర్ గెడ్డేటి సురేంద్ర, గెడ్డేటి బాలయ్య, రౌడీషీటర్ మహంకాళి, పిల్లి తిరుపతయ్య, మహేష్ లు కలిసి వేధిస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. వృద్ధుడినైన తనపై దాడిచేసి చంపుతామని బెదిరిస్తున్నారని, ఇంటిని ధ్వంసం చేసి బయటకు గెంటేశారని వాపోయారు. దిక్కుతోచని స్థితిలో పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. పలు భూకబ్జాలు, హత్యలు, సెటిల్ మెంట్ల కేసుల్లో ముద్దాయిలైన వైసీపీ రౌడీల బారి నుంచి ప్రాణరక్షణ కల్పించి, తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

కోవిడ్ సమయంలో భర్త చనిపోయారని, కూలి పనులు చేసుకుని జీవనం సాగించే తనకు కుటుంబ పోషణ భారంగా మారిందని, బీమా అందించడంతో పాటు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడికి చెందిన బి.భారతి కోరారు.

వైసీపీ ప్రభుత్వం తొలగించిన వృద్ధాప్య పెన్షన్ ను పునరుద్ధరించాలని తాడేపల్లికి చెందిన నండూరి మురళీమోహన్ విజ్ఞప్తి చేశారు.

దివ్యాంగ పెన్షన్ కోసం గత ప్రభుత్వంలో పలుమార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేదని, ఎలాంటి ఆధారం లేని తనకు దివ్యాంగ పెన్షన్ మంజూరుచేసి ఆదుకోవాలని యర్రబాలెంకు చెందిన షేక్ కరిమున్ కోరారు.

అద్దె ఇంట్లో జీవనం సాగించే తమకు ఇంటి స్థలం కేటాయించాలని మంగళగిరి కొప్పారావుకాలనీకి చెందిన ఏ.పుష్పావతి విజ్ఞప్తి చేశారు.

ఐదు దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తన ఇంటికి పట్టా మంజూరు చేయాలని తాడేపల్లికి చెందిన కొమ్మినేని సాంబశివరావు కోరారు. ఆయా విన్నపాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వినతులు

కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఆర్థికసాయం అందించండి
కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని గుంటూరు జిల్లా నారాకోడూరుకు చెందిన కోడూర్ వినోద్ కుమార్ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.

టీడీపీ సానుభూతిపరులంటూ చిత్తూరు జిల్లాలో పనిచేసే పలువురు హోంగార్డులను అన్నమయ్య జిల్లాకు వెళ్లాలని గతంలో అధికారులు ఆదేశించారని, సొంత జిల్లాలోనే విధులు నిర్వహించేలా తగిన ఉత్తర్వులు ఇచ్చి న్యాయం చేయాలని జిల్లాకు చెందిన హోంగార్డులు కోరారు.

విజయనగరం జిల్లా కోనాడ జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు, నైట్ వాచ్ మెన్ సక్రమంగా విధులు నిర్వర్తించడంలేదని, వారిని తొలగించాలని పాఠశాల మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్, సభ్యులు విజ్ఞప్తి చేశారు.

గత ప్రభుత్వంలో టీడీపీ సానుభూతిపరులనే నెపంతో 14 మందిపై అక్రమంగా నమోదు చేసిన కేసులను ఉపసంహరించేలా చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా వెల్దూరు గ్రామ సర్పంచ్ నాయన సత్యవతి కోరారు.

శ్రీకాకుళం జిల్లా పరిషత్ లో గత ఏడేళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల సమస్య పరిష్కరించాలని దరఖాస్తుదారులు విజ్ఞప్తి చేశారు.

గ్రామ సచివాలయంలో పనిచేసే సంక్షేమ, విద్యా సహాయకులను మాతృశాఖ అయిన సాంఘిక సంక్షేమ శాఖలో విలీనం చేయడంతో పాటు వారి సమస్యలు పరిష్కరించాలని గ్రామ వార్డు ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.

వంశపారంపర్యంగా తనకు సంక్రమించిన 1.46 ఎకరాలను ఆన్ లైన్ లో నమోదుచేయడంతో పాటు పాస్ బుక్ మంజూరు చేయాలని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గురిజేపల్లికి చెందిన వీరారెడ్డి విజ్ఞప్తి చేశారు.

నకిలీ పత్రాలతో వంశపారంపర్యంగా వచ్చిన తమ రెండెకరాల పొలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారి జూలకంటి బుడే కబ్జా చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన మొక్కరాల నరసమ్మ కోరారు.

ఎలక్ట్రికల్ టెక్నీషియన్ లో వెకేషనల్ కోర్సు పూర్తిచేసిన వారికి 11 కేవీయే సబ్ స్టేషన్ ఆపరేటర్ పోస్టులకు అర్హత కల్పించాలని సత్యసాయి జిల్లా నిద్రగట్టకు చెందిన ఎల్‌.కె ప్రశాంత్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

సత్యసాయి వాటర్ సప్లై కార్మికులకు ఆరు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, కార్మికులకు జీతాలు ఇవ్వడంతో పాటు ప్రాజెక్టుకు పూర్వవైభవం కోసం చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా సత్యసాయి వాటర్ సప్లై వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు కోరారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE